సోమవారం 23 నవంబర్ 2020
Suryapet - Nov 12, 2020 , 02:46:34

భూములకు భద్రత.. రైతుకు భరోసా

భూములకు భద్రత.. రైతుకు భరోసా

  •   ధరణితో అక్రమార్కులకు కాలం చెల్లింది..
  •   భూముల వివరాలన్నీ ఆన్‌లైన్‌లోకి..
  •   ఇక దొంగ రిజిస్ట్రేషన్లు, పాసు పుస్తకాలకు చెక్‌

దామరచర్ల : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో అక్రమాలు, అవినీతికి చెక్‌ పడింది. గతంలో రెవెన్యూ శాఖకు సంబంధం లేకుండా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. భూమి ఒక్కటే ఉన్నా హద్దులు తారుమారు చేసి రెండు, మూడు రిజిస్ట్రేషన్లు చేసిన ఉదంతాలున్నాయి. దీంతోపాటు ఇనాం, పోరంబోకు, సీలింగ్‌, వక్ఫ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాగా మార్చుకున్నారు. ఇక అటవీ భూములు సైతం ఇలాగే అన్యాక్రాంతమయ్యాయి. దామరచర్ల మండలంలో కొన్ని గ్రామాల్లో పట్టా భూముల కన్నా అధికంగా పాసు పుస్తకాలున్నాయి. ఇష్టారాజ్యంగా దళారులు ఇంటి వద్దనే దొంగ పాసు పుస్తకాలను ముద్రించి అధికారుల సంతకాలు, కార్యాలయ స్టాంపులు వేసి చలామణి చేసేవారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని అనుభవించారు. ధరణి పోర్టల్‌ ద్వారా ఈ అక్రమాలకు చెక్‌ పడిందని చెప్పవచ్చు. దొంగ పుస్తకాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, పట్టాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. నిజమైన లబ్ధిదార్లు, రైతులకు న్యాయం జరుగనుంది. భూముల వివరాలు కూడా నిక్కచ్చిగా రైతుల చేతుల్లోనే ఉన్నాయి. భూముల వివరాలను ఎవరినీ అడిగే అవసరం లేకుండా ఎవరికి వారే మొబైల్‌లో, కంప్యూటర్‌లో తెలుసుకొనే అవకాశం ఉంది. ధరణి పోర్టల్‌లో వివరాలు ఉన్న వాటికే పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్‌ ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

రోజుల తరబడి తిరిగేది..

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంతో దళారుల బెడద తప్పింది. ఇటీవల నేను మేళ్లచెర్వు శివారులో 304/1 సర్వేనంబర్‌లో 1.2 ఎకరం పొలం కొన్నా. రిజిస్ట్రేషన్‌ కోసం తాసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన. అరగంటలో పని పూర్తి చేసి ఇంటికి పంపారు. గతంలో రిజిస్ట్రేషన్‌ కోసం 25 కి.మీ. దూరంలో ఉన్న కోదాడకు వెళ్లి రోజంతా ఎదురుచూసేవాళ్లం. తర్వాత మ్యుటేషన్‌ కోసం రోజుల తరబడి తాసీల్దార్‌ ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్లం. ఇప్పుడు స్లాట్‌ బుక్‌ చేసుకొని తాసీల్దార్‌ కార్యాలయానికి వస్తే కాసేపట్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 

-సాతులూరి సురేశ్‌కుమార్‌, రైతు, మేళ్లచెర్వు

మధ్యవర్తుల ప్రమేయం లేదు

గతంలో భూమి రిజిస్ట్రేషన్‌ చేయించాలంటే మధ్యవర్తులతోనే జరిగేది. ఇప్పుడు ధరణి పోర్టల్‌ ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌ పూర్తి చేసి పట్టా పాసుపుస్తకం అందజేస్తున్నారు. అలాగే సమయం కూడా చాలా తక్కువగా పడుతుంది. ధరణి పోర్టల్‌పై అందరూ చెపుతుంటే విని నమ్మలేదు. ఈ రోజు నిజంగానే కళ్లారా చూశాను. నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుండడంతో ఎంతో సంతోషంగా ఉంది.  సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.  

-పల్లా కృష్ణయ్య, కల్లూరు, నేరేడుచర్ల 

ఏమాత్రం ఆలస్యం కాలే..

మేము వాడపల్లిలో ఎకరం భూమిని కొన్నాం. రిజిస్ట్రేషన్‌ కోసం నేను నాభర్త డాక్యుమెంట్లను తీసుకొని ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చాం. డాక్యుమెంట్లను పరిశీలించి మా వివరాలను అడిగి తెలుసుకొని వెంటనే పోర్టల్‌లో నమోదు చేశారు. సాక్షుల సంతకాలు, ఫొటోలు తీసుకొని పది నిమిషాల్లోనే పత్రాలను ఇచ్చారు. మా పాసుపుస్తకంలో నమోదు చేసి మ్యుటేషన్‌ పత్రం కూడా అందజేశారు. అన్ని చకచకా జరిగిపోయాయి. ఇంటినుంచి కార్యాలయానికి వచ్చినంత సమయం కూడా పట్టలేదు. పత్రాలపై స్టాంపులు వేసినందుకు కూడా పైసా తీసుకోలేదు. ఇంత పారదర్శకంగా ఉంటదనుకోలేదు. గతంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే 25 కిలోమీటర్ల దూరంలోని మిర్యాలగూడకు వెళ్లాల్సి వచ్చేది. దానికి కూడా ఇద్దరు సాక్షులు, పెద్దమనుషులతో కలిసి వెళ్లేవాళం. ఖర్చుకూడా అధికంగా వచ్చేది. ఒక్క రోజు మొత్తం పట్టేది. అయినా వెంటనే పత్రాలు వచ్చేవి కావు. మళ్లీ మ్యుటేషన్‌, పాసు పుస్తకాలకు రెవెన్యూ కార్యాలయం చుట్టే నెలల తరబడి తిరిగేవాళ్లం. ఇప్పుడా సమస్య లేదు అన్నీ ఒక్కచోటే చేయడంతో అందరికీ అనుకూలంగా ఉంది. ఇది మంచి పద్ధతి. 

కవిత, దామరచర్ల

రైతులకు మేలు కలిగింది..

ప్రభుత్వం అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో రైతులకు ఎంతో మేలు కలుగుతోంది. గతంలో భూముల రిజిస్ట్రేషన్‌ కోసం 40 కి.మీ. దూరం గల మిర్యాలగూడకు వెళ్లేవారు. కార్యాలయాల వద్ద పడిగాపులు కాసి విసుగు చెందేవారు. సాక్షులకు చార్జీలు ఇతరత్రా ఖర్చులు అధికంగా అయ్యేవి. ఇప్పుడు ఎటువంటి ఖర్చు లేకుండా తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది.  సులువుగా, వేగంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల చేస్తున్నాం.             

 -రుఘు, ఇన్‌చార్జి తాసీల్దార్‌, అడవిదేవులపల్లి

ఖర్చులు తగ్గినయి..

గతంలో భూమి రిజిస్ట్రేషన్‌కు మిర్యాలగూడకు వెళ్లేటోళ్లం. ఇప్పుడు మాడ్గులపల్లి ఆఫీసుల్నే రిజిస్ట్రేషన్‌ చేస్తుడ్రంటే నమ్మలేదు. వచ్చి చూసినంక నమ్మకం కుదిరింది. నాకంటే ముందు ఉన్నోళ్లు 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఆఫీస్‌ నుంచి వస్తుంటే అప్పుడే చేసిండ్రా అని అడిగిన. అవును అని చెప్పంగనే సంతోషమైంది. చెర్వుపల్లి నుంచి మిర్యాలగూడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు సాక్షులు, అమ్మినోళ్లు, కొన్నోళ్లు, పెద్దమనుషుల్ని తీసుకుపోవాలంటే ఖర్చు చాలా అయ్యేది. కొన్నిసార్లు రెండ్రోజులు పట్టేది. కాగితాలు సరి కావడానికే సగం దినం గడిసేది. ఇప్పుడు అర్ధగంటల నాకు మానాన్న గిఫ్ట్‌ డీడ్‌ కింద 1.10ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ చేసిండు. 

-సోమనబోయిన నాగలక్ష్మి, చెర్వుపల్లి, మాడ్గులపల్లి  

రోజంతా పనిపోయేది

సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో దళారుల బెడద తొలగిపోయింది. ఇటీవల నేను మేళ్లచెర్వు శివారులో 30 గుంటల పొలం కొన్నా. స్లాట్‌ బుక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ కోసం తాసీల్దార్‌ ఆఫీసుకు పోయిన. అరగంటలోనే పని పూర్తయ్యింది. గతంలో రిజిస్ట్రేషన్‌ కోసం 25 కి.మీ. దూరం ఉన్న కోదాడకు వెళ్లేవాళ్లం. రోజంతా పనిపోయేది. ఆ తర్వాత మ్యుటేషన్‌ కోసం రోజుల తరబడి ఆఫీస్‌ చుట్టూ తిరిగేది. ఇప్పుడు ఎవరి చుట్టూ తిరిగే పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నరు. అన్ని బాధలు తప్పినయి. ధరణి ద్వారా రైతులకు సరైన న్యాయం జరుగుతుంది.

- కమతం వీరబాబు, మేళ్లచెర్వు

బహుత్‌ అచ్చాహై..

మా నాన్న నాకు గిఫ్ట్‌డీడ్‌ చేసేందుకు గతంలో వీఆర్వోను కలిశాం. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఆయన చాలా సాకులు చెప్పారు. దీంతో రిజిస్ట్రేషన్‌ వాయిదా వేసుకున్నాం. ఇప్పుడు ధరణి గురించి తెలుసుకొని సోమవారం మీ సేవలో స్లాట్‌ బుక్‌ చేసినం. బుధవారం రిజిస్ట్రేషన్‌కు మా నాన్న నేను ఆఫీసుకు వచ్చాం. కొద్ది సేపటికే మా పని అయ్యింది. ధరణి బహుత్‌ అచ్చాహై.. ఇన్ని రోజులు ఆగినందుకు జెల్ది పనైంది. 

-జరీనా, కాగితరామచంద్రాపురం, నడిగూడెం, మండలం 

ఇట్ల ఉంటే ఏ ఇబ్బంది ఉండదు

గతంలో రిజిస్ట్రేషన్‌కు పోతే ఎంతో ఖర్చు అయ్యేది. బస్సుల కిరాయిలు, సాక్షులకు తినిపించుడు, తాపించుడు ఉండేది. అధికారులు వెంటనే పనిచేయకుండా పైసలిచ్చేదాకా తిప్పించుకునేది. ఇప్పుడు ధరణి వచ్చినంక శానా మంచిగైంది. వెంటనే పనైతుంది. ఎవరికీ పైసా ఇచ్చుడు లేదు. తిరుగుడు కూడా తప్పింది. ఇట్ల ఉంటే రైతులకు ఎలాంటి కష్టం ఉండదు.

-ఎల్లయ్య, రైతు, తిప్పర్తి

తిరిగే తిప్పలు తప్పినయ్‌

నేను నా కుటుంబం హైదరాబాద్‌లో ఉంటాం. ఇటీవల 13 గుంటల భూమిని ఉండ్రుగొండలో కొన్నా. కొత్తగా ధరణి రావడంతో రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుక్‌ చేసిన. బుధవారం తాసీల్దార్‌ ఆఫీసుకు వచ్చిన.. అరగంటలనే రిజిస్ట్రేషన్‌ చేసి కాగితాలు చేతిలో పెట్టారు. గతంలో పట్టాబుక్‌ కోసం తాసీల్దార్‌ ఆఫీసుకు వస్తే వారం రోజులు తిరిగినా అయ్యేది కాదు. నూతన విధానం వల్ల నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు  అవుతున్నాయి. 

-కోటపాటి మాల్యాద్రి, చివ్వెంల

జరంతల్నే పనైంది

నేను మా ఊళ్లో ఎకరం 10 గుంటల భూమి కొన్న. మా ఊరి పెద్ద మనిషి స్లాట్‌ బుక్‌ చేయించి ఇచ్చిండు. ఆయనతోనే కలిసి  ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన. కంప్యూటర్ల కొట్టి అమ్మినోళ్ల పేరుమీదున్న భూమిని నా పేరుమీదికి చేసి ఎమ్మటే కాగితాలు నా చేతిల పెట్టిర్రు. గిప్పుడు రిజిస్ట్రేషన్‌ శానా సులువైంది. కేసీఆర్‌ సారుకు నా దండాలు.

- బండ అంజమ్మ, అన్నారెడ్డిగూడెం, నల్లగొండ