మంగళవారం 24 నవంబర్ 2020
Suryapet - Nov 11, 2020 , 02:30:09

ధరణితో సమయం ఆదా

ధరణితో సమయం ఆదా

  •   తాసీల్దార్‌ కార్యాలయాల్లో రద్దీ 
  •   అరగంటలోపే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి 

డిండి : ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అరగంటలోపే ముగుస్తుం డడంతో తమ సమయం ఆదా అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. తాము కొనుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్‌ చేయించు కునేందుకు తాసీల్దార్‌ కార్యాలయాలకు రైతులు క్యూ కడుతుండగా రద్దీ పెరిగింది. డిండి తాసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం తొమ్మిది మంది రైతులు తమ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వారంతా మీసేవ కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేసుకొని రాగా తాసీల్దార్‌ పుష్పలత ఒక్కో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ను అరగంటలోనే పూర్తి చేసి వారికి పత్రాలతో పాటు పాస్‌పుస్తకాలు అందించారు.   

పీఏపల్లిలో 10 రిజిస్ట్రేషన్లు 

పెద్దఅడిశర్లపల్లి : తాసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం తాసీల్దార్‌ దేవదాసు 10 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. ధరణి పోర్టల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 30 రిజిస్ట్రేషన్లు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్య లేకుండా కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, మ్యుటేషన్‌ పూర్తవుతున్నట్లు ఆయన తెలిపారు. 

 గుర్రంపోడులో ఏడు ..

గుర్రంపోడు : తాసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా మంగళవారం 7 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు మండల రిజిస్ట్రార్‌ అంబటి ఆంజనేయులు తెలిపారు. సోమవారం స్లాట్‌ బుక్‌చేసుకున్న కొప్పోలు గ్రామానికి చెందిన ఒకరు, చేపూర్‌గ్రామానికి చెందిన ఇద్దరు, కాచారం, జూనూత్లకు చెందిన ఇద్దరు, తానేదార్‌పల్లికి చెందిన ఇద్దరి భూముల రిజిస్ట్రేషన్‌ నిర్వహించడంతో పాటు డాక్యుమెంట్లు అందించినట్లు తెలిపారు.  

అరగంటలోనే పని పూర్తి

త్రిపురారం : ధరణి పోర్టల్‌ సాయంతో తాసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం మూడు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. వీరంతా సోమవారం స్లాట్‌ బుక్‌ చేసుకోగా పత్రాలు పరిశీలించి రిజిస్ట్రేషన్‌ నిర్వహించినట్లు తాసీల్దార్‌ కేసీ.ప్రమీల తెలిపారు. కేవలం అరగంటలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.  రైతులు ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకొని రావాలని సూచించారు.