బుధవారం 02 డిసెంబర్ 2020
Suryapet - Nov 11, 2020 , 02:30:11

యాదాద్రిలో సకల వసతులు

యాదాద్రిలో సకల వసతులు

  •   ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖల మంత్రులు  ప్రశాంత్‌రెడ్డి, అజయ్‌కుమార్‌
  •  యాదాద్రి నిర్మాణ పనులు,  ప్రతిపాదిత    స్థలాల పరిశీలన 

ఆలేరు: ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పూర్తిగా కృష్ణశిలలతో నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల వసతులను కల్పిస్తామని ఆర్‌అండ్‌ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఆధ్యాత్మిక ఖ్యాతిని దేశ నలుమూ లల చాటే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టారని పేర్కొన్నారు. మంగళవారం యాదాద్రి కల్యాణకట్ట సమీపంలో 9 ఎకరాలలో నిర్మించే టర్మినల్‌ బస్‌స్టేషన్‌, సైదాపురం బోదానంద గో ఆశ్రమం సమీపంలో 10 ఎకరాల్లో నిర్మించే ఆర్టీసీ డిపో స్థలాలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ  ఆలయం పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయన్నారు. ఆలయం ప్రారంభదశలో ఉందని, రాబోవు రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తుల వస్తారని, వారికి అన్ని వసతులు కల్పించేలా సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టారన్నారు. ఆర్‌అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టెంపుల్‌ సిటీ నిర్మించామన్నారు. ఇందులో దాతలు కాటేజీలు నిర్మించి భక్తులకు వసతులు కల్పిస్తామన్నారు. వీఐపీ కోసం ప్రత్యేక ప్రెసిడెన్సియల్‌ సూట్లను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో మరో 14 సూట్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందన్నారు. స్వామివారి పుష్కరఘాట్‌, కల్యాణకట్ట, అన్నదాన సత్రం నిర్మా ణం పనులు కొనసాగుతున్నాయన్నారు. దేవాలయ చుట్టు నలుదిక్కుల  నుంచి వచ్చే భక్తుల రవాణాకు ఫోర్‌లైన్‌ రోడ్లను నిర్మించామన్నారు. తిరుపతిలో ఉన్న బస్‌స్టేషన్‌ కంటే మరింత ఎక్కువ సౌకర్యాలు కలిగిన బస్‌ టర్మినల్‌ నిర్మించేందుకు త్వరలో పనులు ప్రారంభంకానున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో స్థల పరిశీలనకు వచ్చామని చెప్పారు. 

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా బస్‌ టర్మినల్‌

 యాదాద్రికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి అనుగుణంగా, అనువైన ప్రాం తంలో ఆధునిక, నూతన, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా బస్‌ టర్మినల్‌ నిర్మించబోతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ చిన్నదిగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా నూతనంగా నిర్మించే బస్‌ టర్మినల్‌కు కావాల్సిన స్థలాన్ని పంచనామా చేసి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు అందజేశామని తెలిపారు.  ఇక్కడి భక్తులు స్వామివారి దర్శనం, సూట్‌ రూంలు, టెం పుల్‌ సిటీ, అన్నదానం, కల్యాణకట్ట, ఇతరాత్ర ప్రాం తాలకు తీసుకువెళ్లేందుకు  దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను నడిపిస్తారన్నారు. ఈ బస్సులకు ప్రత్యేక టెర్మినల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో యాదగిరిగుట్ట డిపోతో పాటు, ఇతర ప్రాంతాల డిపో బస్సులు కలిపి 150 బస్సులు రాత్రివేళల్లో నిలిపేందుకు బోదానంద గోఆశ్రమం పక్కనే 10 ఎకరాలల్లో బస్‌ డిపోను నిర్మించబోతున్నామన్నారు. బస్‌ టెర్మినల్‌, బస్‌ డిపోల నిర్మాణానికి కావాల్సిన నమూనాలను వైటీడీఏ అధికారులు, ఇంజినీర్లు, ఆర్టిటెక్ట్‌లతో తయారు చేసి, సీఎం కేసీఆర్‌కు నివేదించి ఆమోదం రాగానే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రారంభోత్సవానికి ముం దే బస్టాండ్‌, ఆర్టీసీ రవాణా వ్యవస్థను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎరుకల సుధా, జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈఓ గీత, ఎస్‌ఈ వసంతనాయక్‌, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న, రెవెన్యూ ఈడీ పురుషోత్తం,  ఆర్డీవో భూపాల్‌రెడ్డి, ఆర్టీసీ ఈడీ మునిశేఖర్‌, సూర్యాపేట డివిజినల్‌ మేనేజర్‌ కేశవులు, డిపో మేనేజర్‌ రఘు, తాసీల్దార్‌ అశోక్‌రెడ్డి   పాల్గొన్నారు.