సోమవారం 30 నవంబర్ 2020
Suryapet - Nov 04, 2020 , 01:19:27

రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ 30 నిమిషాల్లోనోనే

రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ 30 నిమిషాల్లోనోనే

  • భూ క్రయ, విక్రయదారుల్లో సంతోషం
  • ఇలాంటి రోజులను ఊహించలేదంటున్న రైతులు
  • జిల్లాలో రెండో రోజు పెరిగిన రిజిస్ట్రేషన్లు
  • నల్లగొండలో 17, సూర్యాపేటలో 10పూర్తి..
  • స్లాట్‌ బుకింగ్స్‌కు భారీగా డిమాండ్‌
  • ఊపందుకోనున్న రిజిస్ట్రేషన్లు

ధరణి పోర్టల్‌తో నూతన భూ రిజిస్ట్రేషన్ల విధానం రెండో రోజు హుషారుగా సాగింది. తొలి రోజు నల్లగొండ జిల్లాలో మూడు, రెండో రోజు 17రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సూర్యాపేట జిల్లాలో సోమవారం ఐదు, మంగళవారం పది రిజిస్ట్రేషన్లు నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. నల్లగొండ, నేరేడుచర్ల తాసిల్దార్‌ కార్యాలయాల్లో ‘నమస్తే తెలంగాణ’ బృందం పరిశీలించి రిజిస్ట్రేషన్‌ సమయాన్ని నమోదు చేసింది. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా మొత్తం ప్రక్రియ కేవలం 30నిమిషాల్లోపే పూర్తికావడం గమనార్హం. దీంతో రైతులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. గతాన్ని తలచుకుని... ఇప్పటి పరిస్థితితో పోలుస్తూ... ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలకు పక్కాగా లెక్క, పత్రాలు ఉండడంతో పాటు అనధికారికంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా, సమయం వృథా కాకుండా పని పూర్తవుతుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయం ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ రెవెన్యూలో సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. 

ఏళ్లనాటి పద్ధతులకు స్వస్తిపలికి.. కొర్రీలు, ఇబ్బందులకు తెర దించుతూ తెచ్చిన ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ రెండోరోజు విజయవంతంగా సాగింది. అనుకున్న సమయం అర్ధగంటలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతోంది. సులభంగా, వేగంగా సేవలు అందుబాటులోకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైసా లంచం లేకుండా పట్టా చేతికందుతుండడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

ధరణితో రైతు భూములకు మరింత రక్ష 

ఎమ్మెల్యే చిరుమర్తి 

చిట్యాల : ధరణితో రైతు భూములకు మరింత రక్షణ ఏర్పడిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసే ప్రతి పనిలోనూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతును రాజును చేయడానికి కృషి చేస్తున్నాడని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ధరణి వెబ్‌ సైట్‌ ద్వారా చిట్యాల మండలంలో మంగళవారం తొలి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వనిపాకల గ్రామానికి చెందిన అన్నదమ్ములు జక్కలి రవి, జక్కలి శ్రీశైలానికి డాక్యుమెంట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న మరో సాహాసోపేత నిర్ణయం ఈ ధరణి అని, ఈ విధానం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. ధరణితో రైతులకు వ్యయ, ప్రయాసాలు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్‌, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కూరెళ్ల లింగస్వామి, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ మెండె సైదులు, ఎంపీటీసీ దేవరపల్లి సత్తిరెడ్డి, నాయకులు కొలను వెంకటేశ్‌, మర్ల రాంరెడ్డి, బెల్లి సత్తయ్య, సిలివేరు శేఖర్‌, కంచర్ల శ్రీనివాసరెడ్డి, కోనేటి కృష్ణ పాల్గొన్నారు. 

తొందరగా చేస్తరంటే నమ్మలేదు

భూమి మాత్రం అమ్మిన. తర్వాత రిజిస్ట్రేషన్లు బంద్‌ అయినయి. తెలంగాణ సర్కార్‌ తాసిల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేస్తరని చెబుతుంటే నేను నమ్మలేదు. ఎలాగైతేనేం అని స్లాబ్‌ బుక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌కు వచ్చిన. తొందరగా రిజిస్ట్రేషన్‌ చేసిర్రు. పాస్‌ పుస్తకాలు కూడా వెంటనే ఇచ్చిర్రు. ఇలాంటి రిజిస్ట్రేషన్‌తో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటాం. 

-తోట సుధీర్‌కుమార్‌, అమ్మనబోలు, నార్కట్‌పల్లి మండలం 

దళారీ వ్యవస్థ పోయినట్లే..

గతంలో దేవరకొండకెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకునేది. మూడు రోజుల ముందు నుంచే తిరుగుతూ దళారులకు డబ్బులిచ్చి పనులు చేసుకునేది.  ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ఇంత సులభం కావడం శానా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎవరి సుట్టూ తిరిగే పనిలేదు.. తాసిల్దార్‌ కార్యాలయంలోనే అన్ని చేస్తుండడంతో ఇక దళారీ వ్యవస్థకు చెక్‌ పడినట్లే..

-అబ్బనబోయిన చంద్రమౌళి, చిట్టంపాడ్‌, నాంపల్లి

గతంలో రోజంతా పట్టేది..

గతంలో భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే రోజంతా పట్టేది. ఒక్కోసారి రెండో రోజు పోవాల్సి వచ్చేది.  ఇప్పుడు శానా తొందరగా జరిగిపోయింది. ఇంత తొందరగా భూమి పేపర్లు చేతికొస్తే నమ్మలేకుండా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ఈ పని ఎంతో మంచిగా ఉంది. మాకు ఖర్చులు కూడా తగ్గినయి.. పనులు వదులుకొని రోజంతా నల్లగొండకు పోయే బాధ లేదు. 10 గంటల తర్వాత ఇక్కడికి నేను మా తమ్ముడు వచ్చినం. ఓ గంటలోనే మా ఇద్దరి పేర రిజిస్ట్రేషన్లు చేసిర్రు.  వెంటనే పేపర్లు కూడా ఇచ్చిర్రు. పాసు పుస్తకం కూడా తొందరగనే వస్తదంట. 

-జక్కలి రవి రైతు, వనిపాకల, చిట్యాల మండలం 

తొలి రిజిస్ట్రేషన్‌ సంబురం స్వీట్లు పంపిణీ చేసిన రైతు

అర్వపల్లి : ధరణి పోర్టల్‌ ద్వారా మండల కేంద్రంలో మంగళవారం మొదటి రిజిస్ట్రేషన్‌ పూర్తి అయ్యింది. మండల పరిధి అడివెంల గ్రామ శివారులోని 337 సర్వేనెంబర్‌లో 5 గుంటల భూమిని తిమ్మాపురం గ్రామానికి చెందిన బొడ్డు ఎల్లమ్మ గతంలో ఖరీదు చేయగా, ఈ నెల 2న రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. మంగళవారం తాసిల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. మొత్తం గంట లోపే పని పూర్తి కావడంతో రైతు ఎల్లమ్మ తాసిల్దార్‌ కార్యాలయంలోని సిబ్బందికి స్వీట్లను పంపిణీ చేశారు. తనకు భూమి రిజిస్ట్రేషన్‌ అయినట్లు తాసిల్దార్‌ హరిశ్చంద్రప్రసాద్‌ అందజేసిన పత్రాలను చూసి ఆనందంతో రైతు ఎల్లమ్మ మురిసిపోయింది. 

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తొందరగైంది.               

 మండల కేంద్రంలో నాపేరు మీద ఉన్న రెండెకరాల భూమిని దుబ్బాక సోమిరెడ్డికి అమ్మిన. సోమిరెడ్డికి రిజిస్ట్రేషన్‌ చేయడానికి అక్టోబర్‌ 31న స్లాట్‌ బుక్‌చేసినం. మంగళవారం రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్తే వెళ్లినం. తాసిల్దార్‌ అన్నీ చూసిన తర్వాత అర్ధగంటలోనే రిజిస్ట్రేషన్‌ చేసి పట్టా కాగితాలు చేతుల పెట్టిండు. ఇంతకుముందు వారాలకొద్దీ ఆఫీసుల సుట్టూ తిరగగా ఇప్పుడు నిమిషాల్లోనే పని అయిపోయింది. 

-గంగరబోయిన వీరయ్య, మద్దిరాల 

రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న ధరణి పోర్టల్‌ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. రైతులు రిజిస్ట్రేషన్‌కు ముందే స్లాట్‌ బుక్‌ చేసుకొని రావడంతో వారు వచ్చిన సమయానికి రిజిస్ట్రేషన్‌ను ప్రారంభిస్తున్నాం. అరగంటలోపే ప్రక్రియ పూర్తి అవుతోంది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌, డమ్మీ పాసుపుస్తకాన్ని గంటలోపే రైతులకు అందిస్తున్నాం. గతంలో రిజిస్ట్రేషన్‌ కోసం దూరప్రాంతం వెళ్లి రోజంతా కేటాయించాల్సి వచ్చేది. వ్యవసాయ పనులకు ఆటంకం కలిగేది. కానీ ఇప్పుడు మండలంలోనే ఈ ప్రక్రియ అవుతుండడంతో రైతులకు సమయం ఆదా అవుతుంది.

-జె.కార్తీక్‌, తాసిల్దార్‌, గరిడేపల్లి

నా బిడ్డల పేర్ల మీదికి మార్చిన 

నాకు మాదాపురం శివారులో ఐదెకరాల భూమి ఉంది. నా ఇద్దరు కూతుళ్లకు కట్నం కింద తలా ఎకరం భూమి ఇచ్చిన. కానీ ఇంత వరకు రిజిస్ట్రేషన్‌ చేయలేదు. మండలాఫీసులో చేస్తారని రెండు రోజుల కింద మీ సేవలో దరఖాస్తు చేసుకున్న. ఇయ్యాల గంటలో నా పేరుమీద నుంచి నా బిడ్డల పేర్లమీదికి భూమి ఎక్కించి పాస్‌పుస్తకం ఇచ్చిర్రు. గతంల పాస్‌ పుస్తకాల కోసం రోజుల తరబడి ఆఫీసుల సుట్టూ తిరిగేటోళ్లం. కేసీఆర్‌ గిట్ల సేయడం శాన మంచిగుంది. పైస లంచం లేకుండా పాస్‌పుస్తకం చేతికి వచ్చింది.

-రాంజా, మాదాపురం, పీఏపల్లి మండలం

25 నిమిషాల్లోనే అయ్యింది..

కొంపల్లిలో సర్వే నెంబర్‌ 226/1లో నా భర్త మనోజ్‌ పేరిట ఉన్న 1.04 ఎకరాల వ్యవసాయ భూమిని గిఫ్ట్‌ డీడ్‌ కింద నా పేర రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సోమవారం మీ సేవ కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం. మరుసటి రోజే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఇద్దరు సాక్షులతో వెళ్లాను. కేవలం 25 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేసిర్రు. దీనికోసం 5,730 రూపాయలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాం. ఇంత త్వరగా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుందని అనుకోలేదు. వెంటనే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, పట్టాదారు పాసుపుస్తకం కూడా ఇచ్చిర్రు. నూతన సంస్కరణలు తీసుకొచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వానికి సదారుణపడి ఉంటాం. 

-స్పందన కుమారి, కొంపల్లి, మునుగోడు మండలం

వెంటనే పేపర్లు ఇచ్చిండ్రు..

మా మండలంలోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునే రోజు వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. నేను ధరణిలో సేల్‌ డీడ్‌ కింద 5 ఎకరాల 12 గుంటలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని రెండ్రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్న. మంగళవారం 11 గంటలకు తాసిల్దార్‌ కార్యాలయానికి రావాలని చెప్పిండ్రు. వారు చెప్పిన పత్రాలు అన్నీ ఇచ్చిన. రిజిస్ట్రేషన్‌ చేసి వెంటనే భూమి పత్రాలు ఇచ్చిండ్రు. ఇలాంటి బ్రహ్మాండమైన సౌకర్యం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.

-చిట్టెడి మధుసూదన్‌రెడ్డి, రైతు, అమ్మనబోలు, నార్కట్‌పల్లి మండలం

అన్నీ వెంటవెంటనే అయినయి..

శాంతినగర్‌లో 20 గుంటల భూమిని నాపేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసేందుకు మా నాన్న నాగభద్రం సోమవారం మీ సేవలో స్లాట్‌ బుక్‌ చేశాడు. రెవెన్యూ అధికారులు మంగళవారం రమ్మని అనటంతో ఉదయం ఆఫీసుకొచ్చాం. అరగంటలోనే మా వేలి ముద్రలు, సంతకాలు, ఫొటోలు తీసుకొని నా పేరు మీద 20 గుంటల భూమిని ఎక్కించారు. ఇంత త్వరగా భూమి మార్పిడి అవుతుందని అనుకోలేదు. 

-పసుపులేటి ఉమ, శాంతినగర్‌, అనంతగిరి

ఎంత ఎదురుచూశానో అంత త్వరగా పని అయ్యింది..

నేను మండలంలోని కరివిరాలలో రెండు ఎకరాల పది గుంటల భూమిని కొన్నా. రెండు నెలలుగా రిజిస్ట్రేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా. ఇంతలో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తరని తెలిసింది. మీసేవలో సోమవారం స్లాబ్‌ బుక్‌ చేసిన. మంగళవారం ఆఫీసుకు రావాలని అధికారులు చెప్పిర్రు. ఉదయం వస్తే వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసి నాకు కొత్త పాసుపుస్తకం, దాని డాక్యుమెంట్లు ఇచ్చిర్రు. రిజిస్ట్రేషన్‌కు ఎంత ఎదురుచూశానో అంత త్వరగా పని అయ్యింది.     

-పిల్లి నాగరాజు, బేతవోలు, నడిగూడెం

మొబైల్‌లోనూ స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు

వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ కోసం ఎవరికి వారు మొబైల్‌ ద్వారా ధరణి వెబ్‌సైట్‌కు వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. మీసేవ కేంద్రంలో రూ.200 చెల్లించి బుక్‌ చేసుకునే వీలుంది. ఆ మరుసటి రోజు నుంచి కార్యాలయ పనిదినాల్లో రైతు తనకు అనుకూలమైన రోజు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌, స్టాంపు డ్యూటీ, మ్యుటేషన్‌కు అయ్యే ఫీజును ఈ-చలానా, ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించొచ్చు. ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణ. ఇందులో గతంలో మాదిరిగా బ్రోకర్స్‌, అధికారుల ప్రమేయం ఉండదు. భూమి విలువను తగ్గించి అక్రమాలకు పాల్పడే అవకాశమూ ఉండదు. అన్ని వివరాలు ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. 

-దేశ్యా నాయక్‌, తాసిల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌, మునుగోడు