మంగళవారం 24 నవంబర్ 2020
Suryapet - Nov 01, 2020 , 01:41:10

రైతాంగానికి ధరణి శ్రీరామరక్ష

రైతాంగానికి ధరణి శ్రీరామరక్ష

‘పేట’ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి జగదీశ్‌రెడ్డి  

సూర్యాపేట అర్బన్‌ :  రైతాంగానికి ధరణి పోర్టల్‌ శ్రీరామరక్షగా నిలుస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అనధికారికంగా పట్టా మార్పిడి చేయడం అసాధ్యమని, రిజిస్ట్రేషన్‌ పనులన్నీ క్షణాల్లో పూర్తయ్యి కొత్త పాస్‌బుక్‌ చేతికందుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు మూస పద్ధతిలో కాకుండా భూసారం, నీటి లభ్యతను బట్టి అధిక ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులను లక్షాధికారులను చేయడమే లక్ష్యమని, అందుకే రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుందన్నారు. రైతుల సమస్యలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటి శాశ్వత పరిష్కారం చూపేందుకు ధరణి పోర్టల్‌ను ప్రారంభించారన్నారు. ధరణి ద్వారా రైతులకు లంచాల బారి నుంచి విముక్తి లభించనుందని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యక్షంగా రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీకి, పరోక్షంగా విద్యుత్‌, నీటిపారుదల రంగాలకే సుమారు 65శాతం నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలతోపాటు 24గంటల కరెంట్‌ సరఫరా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతున్నాయన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో సూర్యాపేట మార్కెట్‌లో నిర్ణయించిన ధరను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన చరిత్ర ఈ మార్కెట్‌కు  ఉందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే నాయకులు గతంలో వారు ఎలాంటి అభివృద్ది చేశారో గుర్తించాలని సూచించారు. ప్రజల మనసులు తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని, అందుకే ఆయనకు ప్రజలు బాసటగా నిలుస్తున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలను అమలు చేస్నున్న వారిలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఉన్నారన్నారు. రైతులకు రుణమాఫీతోపాటు వారి కుటుంబానికి భరోసాగా రైతుబీమా, పంట పెట్టుబడికి రైతుబంధు అందిస్తున్నారన్నారు. అనంతరం మార్కెట్‌ చైర్మన్‌ లతితాఆనంద్‌ మాట్లాడుతూ.. వ్యాపారంతోపాటు రైతుగా అనుభవం ఉన్న మాకు ఈ మూలంగా రైతులకు న్యాయం చేసే అవకాశం కలిగిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు నూతన కమిటీ కృషి చేస్తుందన్నారు. మాపై నమ్మకం ఉంచి రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించిన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు మార్కెట్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వైస్‌ చైర్మన్‌గా ముద్దం కృష్ణారెడ్డి, డైరెక్టర్లుగా దాచేపల్లి భరత్‌, మహ్మద్‌  సల్మా, ఊట్కూరి సైదులు, పగిళ్ల శేఖర్‌, సంకరమద్ది రమణారెడ్డి, బాణోతు గంగరాజు, బోనాల రవీందర్‌, ముప్పారపు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. జడ్పీ చైర్మన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్‌, వై.వెంకటేశ్వర్లు, కౌన్సిలర్‌ చింతలపాటి భరత్‌, ఎంపీపీలు నెమ్మాది భిక్షం, రవీందర్‌రెడ్డి, కుమారిబాబునాయక్‌, స్వర్ణలతా చంద్రారెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి దామోదర్‌, వ్యవసాయ అధికారి రామారావు, మార్కెట్‌ కార్యదర్శి బీవీ రాహుల్‌, ఖాసీం  పాల్గొన్నారు.