శనివారం 05 డిసెంబర్ 2020
Suryapet - Oct 29, 2020 , 02:07:51

ఆ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదు

ఆ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదు

  • దుబ్బాకలో హుజూర్‌నగర్‌ ఫలితమే పునరావృతం 
  • తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌కు చోటు లేదు
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 
  • మట్టపల్లి వద్ద హైలెవల్‌ బ్రిడ్జి ప్రారంభం.. 
  • రెండు రాష్ర్టాల మధ్య తగ్గిన దూరభారం 
  • రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌కు చోటులేదు.. దుబ్బాక ప్రజలు ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానదిపై రూ.50కోట్లతో  నిర్మించిన హైలెవల్‌ బ్రిడ్జిని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, దుబ్బాక ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఫలితమే పునరావృతమవుతుందని పేర్కొన్నారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకునే పార్టీలకు ఈ రాష్ట్రంలో స్థానం లేదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడంతో రెండు తెలుగు రాష్ర్టాల మధ్య దూరభారం తగ్గుతుందని అన్నారు.

 మఠంపల్లి  : బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు దుబ్బాక ప్రజలు గుణపాఠం చెబుతారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితమే దుబ్బాకలోనూ పునరావృతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.  మఠంపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జిని బుధవారం  రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. 

ఆ విశ్వసనీయతే ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్సే గెలువడానికి కారణమని పేర్కొన్నారు. బీజేపీ పరిస్థితి ‘దొంగే.. దొంగా దొంగా’ అని అరిచిన చందంగా తయారైందని మంత్రి  విమర్శించారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టి లబ్ధిపొందాలనుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో మరో పార్టీకి చోటే లేదని, కాంగ్రెస్‌, బీజేపీలు డిపాజిట్లు దక్కించుకోవడంలో పోటీపడుతున్నాయని ఎద్దేవా చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ మఠంపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య దూరభారం తగ్గిందన్నారు. వరంగల్‌, ఖమ్మం, కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజినీరింగ్‌ అధికారుల  తప్పిదాల కారణంగా తెలంగాణలో 1500ఎకరాల భూమి ముంపునకు గురైందన్నారు.