శనివారం 05 డిసెంబర్ 2020
Suryapet - Oct 29, 2020 , 02:07:48

రైతాంగాన్ని ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే నోముల వినతి

రైతాంగాన్ని ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే నోముల వినతి

హాలియా/నిడమనూరు : ఇటీవల కురిసిన వర్షాలకు నాగార్జునసాగర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా  పంట నష్టపోయిన రైతులను, ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన పేదలను, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న నిడమనూరు ప్రజలను ఆదుకోవాలని కోరుతూ బుధవారం నాగార్జునసాగర్‌  ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంత్రి కేటీఆర్‌తో మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గ వ్యాప్తంగా 3650 ఎకరాల్లో వరి, 1170 ఎకరాల్లో పత్తి పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. పంట దెబ్బతిన్న రైతాంగానికి నష్టపరిహారం అందించాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 98.18 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు. నిడమనూరు మండలంలో జరిగిన నష్టాన్ని కేటీఆర్‌కు వివరించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నాయకులు నోముల భగత్‌, సంపత్‌, నిడమనూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కామర్ల జానయ్య, డీసీసీబీ డైరెక్టర్‌ విరిగినేని అంజయ్య తదితరులున్నారు.