గురువారం 26 నవంబర్ 2020
Suryapet - Oct 27, 2020 , 00:39:50

ప్రాణాలు తీస్తున్న సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌

ప్రాణాలు తీస్తున్న సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌తో ప్రమాదాల 

బారిన పడుతున్న యువత

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తరువాత రెండోస్థానంలో  సెల్‌డ్రైవ్‌ 

పోలీసులకు పట్టుబడితే 

జరిమానాతో పాటు ఆరునెలలు జైలుశిక్ష

సెల్‌ఫోన్‌ వినియోగం ప్రతి ఒక్కరికీ నేడు అత్యవసరంగా మారింది. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలా చేయడం నేరం.. అందుకుగాను రూ.వెయ్యి నుంచి 3వేల వరకు జరిమానా, 6నెలలు శిక్ష పడుతుంది. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌తో ప్రమాదాలకు గురవుతున్న వారిలో 18 నుంచి 35 సంవత్సరాలలోపు వారే అధికంగా ఉన్నారు. డ్రంక్‌అండ్‌ డ్రైవ్‌ ప్రమాదాల తరువాత సెల్‌డ్రైవింగ్‌ ప్రమాదాలు రెండోస్థానంలో ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం పొంచి ఉన్నట్లే.. డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్‌ మోగిందా.. అయితే ఆగి మాట్లాడండి. వాడరాని చోట, వాడకూడని విధంగా ఉపయోగిస్తే అది మారణాయుధంగా మారుతుంది. డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నారా.. అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. గడిచిన సంవత్సర కాలంలో నియోజకవర్గం వ్యాప్తంగా 30మందికి పైగా సెల్‌డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాల బారిన పడ్డారు. 

యువకులే అధికం.. 

‘సెల్‌డ్రైవింగ్‌' చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న వారిలో 18 నుం చి 35లోపు యువతే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. అత్యధిక రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి వాహనా లు నడుపడం ద్వారా జరుగుతుంటే రెండో స్థానంలో సెల్‌డ్రైవింగ్‌ ప్రమాదాలు ఉన్నట్లు తెలిసింది. ఇలా వాహనం నడుపుతున్న వారిని పోలీసులు సాధారణ యాక్షన్‌గా పరిగణిస్తున్నా పట్టుబడితే మాత్రం కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ప్రధానంగా సెక్షన్‌ 184 ప్రకారం జరిమానాలతో సరిపెడుతున్న పోలీసులు తీవ్రతను బట్టి 337, 338, 304(ఎ)సెక్షన్లు సైతం విధిస్తున్నారు. 


ఐదు సెక్షన్ల కింద చర్యలు! 

నిర్లక్ష్యంతో సెల్‌డ్రైవింగ్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద జరిమానాతో పాటు జైలు శిక్షకూడా విధిస్తారు. ఐపీసీ 184 క్లాజ్‌-ఏ ప్రకారం వాహనం నడుపుతూ సెల్‌ మాట్లాడిన వ్యక్తికి కనిష్టంగా రూ.వెయ్యి నుంచి 3వేల వరకు జరిమానా విధిస్తారు. సెక్షన్‌ 279 ప్రకారం నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసినా, వేగంగా నడిపినా జరిమానాతో పాటు 6నెలలు జైలు శిక్ష విధిస్తారు. సెక్షన్‌ 337, 338 ప్రకారం మొబైల్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ఎదుటివారికి ప్రమాదం తలపెట్టినా, మరణానికి కారణమైనా సెక్షన్‌ 304(ఏ) ప్రకారం జరిమానాతో పాటు రెండేళ్ల వరకు శిక్ష విధిస్తారు. 

సెల్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరం

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయటం ప్రమాదకరం. అత్యవసర కాల్‌ అయితే వాహనం పక్కకు నిలిపి మాట్లాడాలి. ప్రస్తుతం యువత సెల్‌డ్రైవింగ్‌ను ఫ్యాషన్‌గా భావిస్తున్నది. ఇలా చేస్తే కఠిన చర్యలుంటాయి. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తాం. 

- ఎస్‌ఐ డేనియల్‌కుమార్‌ తిరుమలగిరి