గురువారం 03 డిసెంబర్ 2020
Suryapet - Oct 25, 2020 , 02:15:40

తెలంగాణ సంప్రదాయం.. నేడు ప్రపంచ వ్యాప్తం

తెలంగాణ సంప్రదాయం.. నేడు ప్రపంచ వ్యాప్తం

  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • ఆస్ట్రేలియాలో బతుకమ్మ వేడుకలను ఆన్‌లైన్‌లో వీక్షించిన మంత్రి
  • జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు 

అరవై ఏండ్ల ఉమ్మడి నిర్లక్ష్య పాలనలో ఆదరణ కోల్పోయిన బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్వవైభవం తీసుకొచ్చారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌ నగరంలో జరిగిన సద్దుల బతుకమ్మ సంబురాలను మంత్రి ఆన్‌లైన్‌లో వీక్షించి మాట్లాడారు. మరోవైపు ఉమ్మడి జిల్లా ప్రజలు విజయదశమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. జమ్మి వేడుకల్లో భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.


సూర్యాపేట టౌన్‌ : అరవై ఏండ్ల ఉమ్మడి నిర్లక్ష్య పాలనలో అన్ని రంగాలతో పాటు ఆదరణ కోల్పోయిన బతుకమ్మ పండుగకు .. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పూర్వవైభవం వచ్చిందని, నేడు ప్రపంచ వ్యాప్తంగా అక్కడి తెలుగు ప్రజలతో పాటు విదేశీయులు సైతం బతుకమ్మ సంబురాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో వైభవంగా జరిగిన సద్దుల బతుకమ్మ సంబురాలను మంత్రి జూమ్‌ యాప్‌ ద్వారా వీక్షించి మాట్లాడారు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా చేస్తున్న సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా కొనసాగుతున్నాయని కొనియాడారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు మన దేశ, ప్రాంత పునాదిని మరిచి పోకుండా మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్‌ ప్రతినిధి అనిల్‌తో పాటు కార్యవర్గ సభ్యులను మంత్రి అభినందించారు. ప్రతి ఏటా లక్షలాదిమంది ఒకేచోట చేరి అత్యంత సంబురంగా జరుపుకునే బతుకమ్మ, దసరా వేడుకలు ఈ ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరి ఇండ్లల్లో వారే జరుపుకుంటున్నారని.. వచ్చే ఏడాది నాటికి కరోనా పూర్తిగా అంతరించి మళ్లీ అందరూ కలిసి  వైభవంగా వేడుకలు జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. తనను బతుకమ్మ వేడుకకు ఆహ్వానించిన ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్‌ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి.. వీలైతే ఆస్ట్రేలియా వచ్చి అసోసియేషన్‌ ప్రతినిధులను కలుస్తానని హామీ ఇచ్చారు.