గురువారం 26 నవంబర్ 2020
Suryapet - Oct 23, 2020 , 03:06:28

వరద కష్టాలకు మోక్షం

వరద కష్టాలకు మోక్షం

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ఆత్మకూర్‌.ఎస్‌ మండల పరిధిలోని నశీంపేట రహదారిపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. వర్షాలకు నశీంపేట చెరువు అలుగుపడిన ప్రతిసారి రహదారిపై నుంచి భారీగా వరద పోతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వెంటనే వెళ్లి పరిశీలించారు. అక్కడ హైలెవల్‌ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన వారంలోపే ఆచరణ ప్రారంభమై వంతెన నిర్మాణానికి అడుగులు పడడం గమనార్హం. రూ.4.75 కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లడం... ఆ వెంటనే పరిపాలన అనుమతి లభించడం జరిగిపోయింది. టెండర్లు పిలిచేందుకు పూర్తిస్థాయి అంచనాలతో సమగ్ర ప్రతిపాదనలు పంపించాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.  ప్రజలకు ఏంకావాలి అనేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆలోచన చేసి వివిధ పథకాలను అమలు చేస్తుండడంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. సూర్యాపేట జిల్లా లో దశాబ్దాల తరబడి తిష్టవేసిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతూ అభివృద్ధిలో దూసుకుపోతోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో మెడికల్‌ కళాశాల, మోడల్‌ మార్కెట్‌, రోడ్ల విస్తరణతోపాటు అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. 

మంత్రి ప్రత్యేక చొరవ..

నశీంపేట చెరువు ప్రతిసారి అలుగుపోయడం... ఆ రహదారిపై నుంచి వరద వెళ్తుండడంతో మండల పరిధిలోని దాచారం, ఆత్మకూర్‌.ఎస్‌ క్రాస్‌రోడ్డు, రామన్నగూడెం, ఏపూరు, మిర్యాల, చిననెమిల, పెదనెమిల, బిక్కుమళ్ల తదితర గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 14న మండల నాయకులు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే వెళ్లి పరిశీలించి హైలెవల్‌ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఆ వెంటనే ఈనెల 15న ఆర్‌అండ్‌బీ అధికారులను పిలిచి హైలెవల్‌ వంతెనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని ఆదేశాలు జారీ చేయడంతో అదే రోజు రూ.4.75 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ప్రతిపాదనలు చేసి 16న ప్రభుత్వానికి పంపించారు. కాగా ఈనెల 18న పరిపాలనా అనుమతులు లభించి టెండర్లు పిలిచేందుకు పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు పంపించాలని పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ఆర్‌అండ్‌బీ డీఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు. రెండువైపులా ఫుట్‌పాత్‌లతో 100మీటర్ల డబుల్‌లేన్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉందన్నారు. మంత్రి పరిశీలించిన వారంరోజుల్లోనే హైలెవల్‌ వంతెన నిర్మాణానికి ఆచరణ ప్రారంభం కావడం పట్ల ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.