బుధవారం 02 డిసెంబర్ 2020
Suryapet - Oct 22, 2020 , 00:42:25

టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతి ఒక్కరి మద్దతు

టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతి ఒక్కరి మద్దతు

  • ‘పట్టభద్రుల’ నమోదులో స్థానిక ప్రజాప్రతినిధులు ముందుండాలి 
  • నమోదైన ఓట్లను టీఆర్‌ఎస్‌ వైపు మళ్లించాలి 
  • ప్రజల దగ్గరికి పోయే శక్తి గులాబీ క్యాడర్‌, లీడర్లకే ఉంది
  • ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌
  • విపక్షాల ఊహలకే అందని ‘రైతు బంధు, కల్యాణలక్ష్మి’ పథకాలు
  • పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సభల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి

‘టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతి ఒక్కరి మద్దతు ఉంది.. ప్రస్తుత పరిస్థితిలో ప్రజలను ఓట్లు అడిగే శక్తి కూడా గులాబీ క్యాడర్‌, లీడర్‌కు మాత్రమే ఉంది’ అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఓట్ల నమోదుతోపాటు ఆ ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌కే దక్కేలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు. గ్రామాలు, వార్డుల వారీగా పట్టభద్రులను గుర్తుపట్టడం సర్పంచ్‌ మొదలుకొని ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల స్థానానికి జరుగనున్న ఎన్నికల్లో భాగంగా ఓటర్ల నమోదుపై బుధవారం నల్లగొండ, నకిరేకల్‌, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బడుగులతోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్‌ రవీంద్రకుమార్‌, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

దేవరకొండ/నల్లగొండ విద్యావిభాగం/కట్టంగూర్‌(నకిరేకల్‌) : టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతి ఒక్కరి మద్దతు ఉందని, ప్రస్తుత పరిస్థితిలో ప్రజలనుఓటు అడిగే శక్తి గులాబీ క్యాడర్‌, లీడర్‌కు మాత్రమే ఉందని  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం దేవరకొండ, నల్లగొండ, నకిరేకల్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు సన్నాహక  సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీకి  బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని 50సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పాలించే రాష్ర్టాల్లో ఈ పథకాలు లేవని మంత్రి గుర్తుచేశారు. ఓటరు నమోదు లక్ష్యాన్ని చేరుకునేలా ముందుకు సాగాలని సూచించారు. 

పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 2014కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోను అమలుపర్చిన పార్టీ దేశంలోనే లేదన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే ఆ ఖ్యాతిని సొంతం చేసుకుందని   ఊహలకందని రైతుబంధు, కలలో కూడా ఉహించని కల్యాణలక్ష్మి ఎవరూ అడుగకుండానే  అమలుపర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎన్నో పథకాలు అమలుచేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం ఉందని, ఆ విషయాన్ని గులాబీ క్యాడర్‌ గుర్తుంచుకోవాలన్నారు. మోడీ, సోనియా సొంత రాష్ర్టాల్లో ఇప్పటికీ ఉచిత కరెంటు లేదని, పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బీజేపీ నాయకులు చెప్పేది అంత డొల్ల, అబద్ధాలేనని, వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చేసింది శూన్యమన్నారు. 

కార్యకర్తలు అహర్నిశలు కృషిచేసి ఓటరు నమోదును సీరియస్‌గా తీసుకోవాలన్నారు.  ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌ అసత్య ఆరోపణలు చేయస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం పింఛన్‌ రూ.200 ఇస్తే సీఎం కేసీఆర్‌ రూ.1816 కలిపి ఇస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 1.50లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 5కోట్ల ఉద్యోగాలు ఊడబీకారని ఎద్దేవా చేశారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలని సూచించారు. టీఆర్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండలాలవారీగా పట్టభద్రుల ఓటరు గుర్తింపు, నమోదు చేయాలన్నారు. 

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ  పట్టభద్రుల ఓటర్లను అధికంగా నమోదు చేసేందుకు ఆయా గ్రామాల కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి,   మున్సిపల్‌ చైర్మన్లు ఆలంపల్లి నర్సింహ, మందడి సైదిరెడ్డి, కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన్లు రహత్‌ అలీ, అబ్బగోని రమేశ్‌గౌడ్‌,  రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్‌, జడ్పీ టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ పాశం రాంరెడ్డి, ఎంపీపీలు మాధవరం సునీతాజనార్దన్‌రావు, వంగాల ప్రతాప్‌రెడ్డి,  కరీంపాషా, విజయలక్ష్మి, బచ్చులపల్లి శ్రీదేవి, జెల్లా ముత్తిలింగయ్య, సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీలు మారుపాకుల అరుణాసురేశ్‌గౌడ్‌, పవిత్ర, మాధవరం దేవేందర్‌రావు, చిట్ల వెంకటేశం, మాద ధనలక్ష్మి, తరాల బలరాములు, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు పున్న వెంకటేశ్‌, హన్మంత్‌ వెంకటేశ్‌గౌడ్‌, బోనగిరి దేవేందర్‌, కటికం సత్తయ్యగౌడ్‌, కంకణాల వెంకట్‌రెడ్డి, సిరందాసు కృష్ణయ్య, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.