శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Oct 21, 2020 , 01:57:29

గలగల.. జలకళ

గలగల.. జలకళ

  • ఉమ్మడిజిల్లాలో మత్తడి దుంకిన 55శాతం చెరువులు
  • 19శాతం చెరువుల్లో 75శాతానికి మించి చేరిన నీరు
  • ‘మిషన్‌ కాకతీయ’తో నీటి వృథాకు చెక్‌ 
  • పైపైకి ఎగబాకుతున్న భూగర్భ జలాలు
  • చేపపిల్లల విడుదలలో వేగం పెంచిన మత్స్యశాఖ

నల్లగొండ : ఈ సీజన్‌లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల చేయడంతో అప్పటికే కొన్ని చెరువుల్లోకి నీరు చేరింది. ఎడమకాల్వ, వరద కాల్వల ద్వారా నీటి విడుదల జరుగడంతో ఆయా ప్రాంతాల్లోని చెరువుల్లోకి సైతం కొంతమేర నీటినిల్వలు చేరాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షం కారణంగా చాలా చెరువులు మత్తడి దుంకాయి. దశాబ్దకాలంగా జలకళ లేని చెరువులు సైతం నేడు నీటితో కనువిందు చేస్తున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని 89శాతం చెరువుల్లో 50శాతానికి పైగా నిండి కళకళలాడుతున్నాయి. వీటితో భూగర్భజలాలు సైతం గణనీయంగా పెరిగి వచ్చే వేసవికాలంలోనూ బోర్లు ఉబికిపోసే విధంగా ఉన్నాయి. 

55శాతం చెరువుల్లో అంతకుమించిన నిల్వలు 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,454 చెరువులుండగా అందులో 55శాతం చెరువులు మత్తడి దుంకాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రికార్డు స్థాయిలో ఉమ్మడి జిల్లాలోని అన్ని చెరువుల్లోనూ వరద భారీగా చేరడంతో నీటినిల్వలు గణనీయంగా పెరిగాయి. నల్లగొండ జిల్లాలో 2001చెరువులుండగా ఇందులో 844 చెరువులు అలుగుపోయగా 288చెరువుల్లో నీరు వందశాతం చేరింది. సూర్యాపేట జిల్లాలో 1071 చెరువులకుగాను 720చెరువులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1382 చెరువులకు 887అలుగుపోశాయి. మొత్తంగా 4,454 చెరువులకు మూడుజిల్లాలో 2,451(55శాతం) చెరువులు అలుగుపోయగా 855 చెరువుల్లో వందశాతం నీటి నిల్వలున్నాయి. పెద్దఎత్తున వరదలు వచ్చినప్పటికీ మిషన్‌ కాకతీయ పథకంతో చెరువుకట్టలు నిలబడ్డాయి. దీంతో ఎక్కడా గండ్లు పడడం, తెగిపోవడం జరుగలేదు. 

చేపల విడుదలలో పెరిగిన వేగం

ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో 50శాతానికి పైగా ఉన్న చెరువుల్లో నీలి విప్లవం పథకం కింద మత్స్యశాఖ ఉచితంగా చేపపిల్లల విడుదల చేపట్టింది. ప్రస్తుతం చెరువుల్లో నీటి నిల్వలు పెరగడంతో మత్స్యశాఖ చేపపిల్లల విడుదలలో వేగం పెంచింది. ఉమ్మడిజిల్లాలో 89శాతం చెరువుల్లో 50శాతానికి పైగా నీరు చేరుకోవడంతో నీలివిప్లవం కింద ఆయా చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం ఐదేళ్లుగా చేపపిల్లల విడుదల చేపడుతున్నప్పటికీ 89శాతం చెరువుల్లో ఇంత పెద్దఎత్తున నీరు చేరుకోవడం ఇదే తొలిసారి. ఈసారి లక్ష్యానికి మించి చేపల విడుదల చేసే అవకాశం ఉంది. 

55శాతం చెరువులు అలుగులు పోశాయి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4,454 చెరువులుండగా అందులో 55శాతం చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగులు పోశాయి. మరో 19శాతం చెరువుల్లో 75 శాతం నుంచి వందశాతానికి నీరు చేరుకుంది. మిషన్‌ కాకతీయ పథకంతో చెరువులన్నీ పూడిక తీయడంతో ఎక్కువ నిల్వలు చేరుకున్నాయి. అంతేకాక ఇంత పెద్దఎత్తున వరద వచ్చినప్పటికీ చెరువుకట్టలు పెద్దగా తెగకపోవడం మంచి పరిణామం.  

- రమేశ్‌, ఐబీ ఎస్‌ఈ, నల్లగొండ జిల్లా