మంగళవారం 01 డిసెంబర్ 2020
Suryapet - Oct 21, 2020 , 01:57:27

మున్సిపాలిటీలోకి ఆహ్వానం

మున్సిపాలిటీలోకి ఆహ్వానం

  • 34శాఖల్లో ఉద్యోగుల బదిలీకి అవకాశం
  • పురపాలికల్లో మినిస్టీరియల్‌ సిబ్బంది ఖాళీల భర్తీ
  • ఉద్యోగి అభీష్టం మేరకే రెగ్యులర్‌ శాఖగా బదలాయింపు 

పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు పాలన చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. అందుకనుగుణంగా కొత్త పంచాయతీలు, మండలాలతోపాటు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ఉద్యోగుల కొరత తీర్చేలా పలు శాఖల నుంచి స్వచ్ఛంద బదిలీలకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఆస్తుల ఆన్‌లైన్‌, ధరణి పోర్టల్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ పనుల నిమిత్తం అదనపు ఉద్యోగులు అవసరం ఉన్నందున భర్తీ చేసేందుకు సిద్ధమైంది. జిల్లాలోని 34 శాఖల్లో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టులకు మున్సిపాలిటీల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పించింది.

నీలగిరి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉమ్మడిజిల్లాలో కేవలం 5మున్సిపాలిటీలు నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ మాత్రమే ఉండేవి. దేవరకొండ, హుజూర్‌నగర్‌ నగర పంచాయతీలుగా ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత నగర పంచాయతీలను, మేజర్‌ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చారు. దీంతో నల్లగొండ జిల్లా లో హాలియా, చండూరు, చిట్యాల, నందికొండ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, యాదగిరి గుట్ట, మోత్కూరు, చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి.. సూర్యాపేట జిల్లాలో నేరేడుచర్ల, తొండ తిర్మలగిరిలను మున్సిపాలిటీలుగా ప్రకటించారు.

నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న వారికే మున్సిపాలిటీల్లో అవకాశం కల్పించడంతో వారిపై పనిభారం అధికంగా ఉంది. ఇక మినిస్టీరియల్‌ సిబ్బంది రాకతో పనిభారం తగ్గడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగనున్నాయి. 

34 శాఖలు ఇవే..

గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడంతో అక్కడ సిబ్బంది కొరత ఉండడంతో ఇతర శాఖల్లో ఉన్న సిబ్బందిని మున్సిపాలిటీలోకి బదిలీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో 34శాఖల్లో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టులు మున్సిపాలిటీల్లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ 34 శాఖల్లో ఉద్యోగుల అభీష్టం మేరకే బదిలీ కానున్నారు. దీంతో మున్సిపాలిటీల్లో మినిస్టీరియల్‌ సిబ్బందికి ఇబ్బందులు తొలగనున్నాయి. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక, మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధులు, వైద్యారోగ్య, ఇంటర్మీడియట్‌, టెక్నికల్‌, చేనేత జౌళి, కార్మిక, ఉపాధి కల్పన, భూపరిపాలన, కమర్షియల్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌ స్టాంప్స్‌, విద్యా, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక, యువజన సర్వీసులు, ఐబీ, ఆర్‌అండ్‌బీ, పౌర సరఫరాల, పంచాయతీరాజ్‌, ఫ్యాక్టరీస్‌ తదితర శాఖలకు అనుమతి ఇచ్చారు.