ఆదివారం 29 నవంబర్ 2020
Suryapet - Oct 20, 2020 , 06:15:06

‘పేట’ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

 ‘పేట’ మున్సిపల్‌ కోఆప్షన్‌  సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

  • వెంపటి సురేశ్‌, బత్తుల ఝాన్సీ, పెద్దపంగు స్వరూపారాణి, సయ్యద్‌ రియాజుద్దీన్‌ ఎన్నిక 

బొడ్రాయిబజార్‌ : రెండు నెలలుగా ఎదురుచూస్తున్న సూర్యాపేట మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు తెరపడింది. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో నలుగురు మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. జనరల్‌, మైనార్టీవర్గాల నుంచి మొత్తం 51దరఖాస్తులు రాగా, వీరిలో 37మంది అర్హత సాధించారు. జనరల్‌(పురుష)వెంపటి సురేశ్‌ను కౌన్సిలర్‌ ఎస్‌కే జహీర్‌ ప్రతిపాదించగా మరో కౌన్సిలర్‌ మొరిశెట్టి సుధారాణి బలపర్చారు. జనరల్‌ మహిళా స్థానంలో బత్తుల ఝాన్సీని కౌన్సిలర్‌ నిఖిల ప్రతిపాదించగా మరో కౌన్సిలర్‌ తాహేర్‌పాషా బలపర్చారు. మైనార్టీ మహిళా కేటగిరీలో పెద్దపంగు స్వరూపారాణిని కౌన్సిలర్‌ రాపర్తి శ్రీను ప్రతిపాదించగా మరో కౌన్సిలర్‌ ధరావత్‌ రవి బలపర్చారు. మైనార్టీ(పురుష) విభాగంలో రియాజుద్దీన్‌ను కౌన్సిలర్‌ చింతలపాటి భరత్‌మహాజన్‌ ప్రతిపాదించగా మరో కౌన్సిలర్‌ గండూరి పావని బలపర్చారు. దీంతో వెంపటి సురేశ్‌, బత్తుల ఝాన్సీ, సయ్యద్‌ రియాజుద్దీన్‌, పెద్దపంగు స్వరూపారాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ పి.రామానుజులరెడ్డి ప్రకటించారు. ఎన్నికైన నలుగురు సభ్యులను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

గత ఆరేళ్లలో సూర్యాపేట మున్సిపాల్టీని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుందన్నారు. కోట్లాది రూపాయల పనులు పురోగతిలో ఉన్నాయని, అవన్నీ పూర్తయితే సూర్యాపేట పట్టణం రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.  పట్టణాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన, గతంలో కౌన్సిలర్లుగా పని చేసిన అనుభవం ఉన్నవారిని మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రజాసమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. నూతన సభ్యులు  మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటామన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తమపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి సంపూర్ణ న్యాయం చేస్తామన్నారు. తమ ఎన్నికకు సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌తోపాటు కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు.  ఎంపీ బడుగుల,  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, కమిషనర్‌ రామానుజులరెడ్డి, వైస్‌ చైర్మన్‌ కిశోర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.