గురువారం 26 నవంబర్ 2020
Suryapet - Oct 20, 2020 , 06:15:03

ఎన్నిక ఏదైనా.. గెలుపు టీఆర్‌ఎస్‌దే

 ఎన్నిక ఏదైనా.. గెలుపు టీఆర్‌ఎస్‌దే

  • ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • తుంగతుర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ 
  • ముఖ్యకార్యకర్తల సమావేశం 

తిరుమలగిరి : ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టీదేనని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ  టీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014కు ముందు గ్రామాలు ఎలా ఉన్నాయో, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ చేపట్టిన పథకాలతో అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో చూడాలన్నారు. ప్రతి పల్లెలో శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులు, నర్సరీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో చిన్న మొక్క కావాలంటే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు గ్రామాల్లోనే నర్సరీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో భూముల పట్టాలకు అనేక ఇబ్బందులు పడేవారని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 1.50లక్షల ఉద్యోగాలు ఇచ్చి అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, హోంగార్డులకు వేతనాలు పెంచింది కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా  రైతుబీమా అమలు చేస్తుంది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. తుంగతుర్తి నియోజక వర్గంలో రెండు పంటలకు సాగునీరు అందించి ఏప్రిల్‌ చివరి వరకు కాల్వల ద్వారా నీరు అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. గ్రామం, మండలం, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ..

  గతంలో మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలిచింది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులేనని, ఈసారి కూడా నూటికి నూరుశాతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులదే విజయమన్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అన్ని సమస్యలపై అవగాహన ఉందని పేర్కొన్నారు. గ్రామగ్రామాన  నాయకులు, కార్యకర్తలు పట్టభద్రుల ఓట్లు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎస్‌ఏ రజాక్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు గుజ్జ యుగంధర్‌రావు, టీఆర్‌ఎస్‌ అన్ని మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.