శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Oct 20, 2020 , 05:30:41

కోళ్ల పెంపకం.. అదనపు ఆదాయం

కోళ్ల పెంపకం.. అదనపు ఆదాయం

  • 45 రోజుల్లోనే రూ. లక్షకు పైగా ఆదాయం 
  • బ్యాంకు రుణాలతో షెడ్ల ఏర్పాటు
  • వ్యవసాయంతో పాటు కోళ్లపెంపకంతో ఆర్థికంగా బలోపేతం

మండలంలోని వద్దిపట్ల పరిధిలోని పలుగుతండా, పుట్టంగండి తండాకు చెందిన పలువురు రైతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కేవలం సాగుపై మాత్రమే ఆధారపడుతుండడంతో ఒక్కోసారి దిగుబడి సరిగా లేక ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో సదరు రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగంపై దృష్టిసారించారు. సహకార పరపతి సంఘం ద్వారా రూ.15 లక్షల రుణం తీసుకొని పౌల్ట్రీఫామ్‌ను ఏర్పాటు చేసుకొని లాభాలు ఆర్జిస్తున్నారు.

తమ వ్యవసాయ క్షేత్రంలోని పది గుంటల స్థలంలో కోళ్లఫాం కోసం షెడ్‌ నిర్మించుకుంటున్నారు. కోళ్ల పరిశ్రమకు సంబంధించిన పెద్ద కంపెనీలతో అనుసంధానంగా ఉంటూ వారు సరఫరా చేసే కోడిపిల్లలను 45 రోజుల పాటు కంటికి రెప్పల కాపాడుతూ పెంచి పెద్ద చేస్తున్నారు. ఆ తరువాత పెరిగిన కోళ్లను అదే కంపెనీకి విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక్కో షెడ్‌లో 7 వేల కోడి పిల్లలను 45 రోజుల పాటు పెంచితే 15 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. కంపెనీవారు ప్రతి కిలోకు కోడిపిల్ల, దాణా పోను 5 రూపాయాలు రైతులకు చెల్లిస్తుండగా.. ఒక్కో కోళ్లఫాం ద్వారా రైతుకు 45రోజులకు గాను లక్షరూపాయలకు పైగానే ఆదాయం వస్తోంది.

గ్రామానికి 10 కోళ్లఫామ్‌లు

కోళ్లఫామ్‌ ఏర్పాటు చేయడం ద్వారా అదనపు ఆదాయం వస్తుండడంతో గిరిజన రైతులు అటువైపు దృష్టిసారిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు షెడ్లు ఏర్పాటు చేసుకొని కోడి పిల్లలను పెంచుతున్నారు. ప్రస్తుతం గ్రామానికో 10 మంది రైతులు కోళ్లఫాం ఏర్పాటు చేసుకున్నారు. ఎగువన ఏఎమ్మార్పీ సిస్టర్న్‌ ఉండడంతో నీటి సరఫరాకు ఢోకాలేక పోవడంతో తమకున్న భూమిలోనే వరిసాగు చేస్తూ.. మిగతా సమయాల్లో కోళ్లపెంపకం చేపడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ సాగు పనులతో పాటు రైతుల కుటుంబ సభ్యులే కోళ్లకు దాణావేయడంతో పాటు వాటి సంరక్షణను చూసుకుంటున్నారు. వచ్చిన ఆదాయంతో బ్యాంకు రుణాలు చెల్లిస్తుండడంతో బ్యాంకు వారు కూడా ఇతర రైతులకు రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు.  

 రెండు కోళ్లఫామ్‌లు వేయించా

 కాల్వపక్కనే ఉన్న సొంత భూమిలో ఇద్దరు కొడుకులకు రెండు షెడ్లు వేయించి కోళ్లఫాంలు పెట్టించా. ఇందుకు  కో-ఆపరేటివ్‌ బ్యాంకు వారు రూ. 30 లక్షల లోను ఇచ్చారు. ప్రస్తుతానికి 45 రోజులకు ఒక సారి చొప్పున కోడి పిల్లలను తెచ్చి పెంచుతున్నాం. లాభం బాగానే ఉంది. వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. మా కుటుంబ సభ్యులమే పనులు చేసుకుంటుండడంతో కూలి ఖర్చులు కూడా కలిసి వస్తున్నాయి.

- రమావత్‌ బోడా, పలుగుతండా