శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Oct 16, 2020 , 01:37:35

వర్షం ఆగింది... నష్టం మిగిలింది

వర్షం ఆగింది... నష్టం మిగిలింది

  •  సూర్యాపేట జిల్లాలో 13,432 ఎకరాల్లో వరి, 11,869 పత్తికి నష్టం 
  • పాక్షికంగా దెబ్బతిన్న 35 ఇండ్లు

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షం ప్రభావం అన్ని రంగాలపై పడింది. గురువారం సూర్యాపేట జిల్లాలో వర్షం ఆగినప్పటికీ రైతులు, సాధారణ ప్రజలకు నష్టం మాత్రం మిగిలింది. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అధికారయంత్రాంగం మండలాలు, గ్రామాల్లో పర్యటించింది. పంటలు, కూలిన ఇండ్లు, చెరువులకు గండ్లు, కోతకు గురైన రోడ్ల ద్వారా జరిగిన నష్టాలను పరిశీలించి నివేదిక రూపొందించింది. జిల్లాలో 13,432 ఎకరాల్లో వరిపంట నీట మునగగా, 11,869 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. 35 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. మూసీ పరివాహక ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లో పంట నష్టం పెద్దగా లేదు. ఎక్కడ చెరువులకు గండ్లు పడకపోగా రోడ్లు కోతకు గురికాలేదు.  

మూసీ వరదతో అధిక నష్టం

వర్షాకాల సీజన్‌లో సాగునీరు పుష్కలంగా ఉండగా రైతులు అధిక మొత్తంలో పంటలను సాగు చేశారు. తుపాన్‌ కారణంగా కురిసిన వర్షం కొంతమేర రైతులకు నష్టం కలిగించింది. ప్రధానంగా హైదరాబాద్‌లో వర్ష బీభత్సంతో పాటు వరంగల్‌ నుంచి వచ్చే బిక్కేరు పొంగడంతో మూసీ నదికి ఉప్పెనలా వరద వచ్చింది. మూసీ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తేయడంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి కొంతమేర వరి, పత్తికి నష్టం కలిగింది. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి నష్టాన్ని పరిశీలించి నివేదికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా 13,432 ఎకరాల్లో వరి పంట నీట మునగగా, 11,869 ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు ఆయా మండలాల్లో 35 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

వరదొచ్చినా చెక్కు చెదరని చెరువులు

జిల్లాలో దాదాపు 1071 చెరువులు ఉండగా 820 చెరువులు వందశాతం నిండి అలుగు పోస్తున్నాయి. మిగిలిన చెరువులు సైతం 80 నుంచి 90 శాతం నిండాయి. రికార్డు స్థాయిలో చెరువులు జలకళను సంతరించుకొని భారీగా అలుగు పోస్తున్నా ఒక్క చెరువుకు కూడా గండి పడకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయడంతో అవన్నీ పటిష్టంగా తయారయ్యాయి. దీంతో రెండు మూడేళ్లుగా వర్షాలు, నదుల ద్వారా నీళ్లు వచ్చి చెరువులు నిండుతున్నా గండ్లు మాత్రం పడకపోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

నల్లగొండ జిల్లాలో పెరిగిన పంట నష్టం

నల్లగొండ: అల్పపీడనం కారణంగా నల్లగొండ జిల్లాలో మంగళవారం కురిసిన వర్షానికి పంటనష్టం భారీగా పెరిగింది. బుధవారం వ్యవసాయశాఖ అధికారులు ఆయా మండలాల్లోని 243 గ్రామాల్లో 49744 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మొదట ప్రాథమిక అంచనా వేయగా.. గురువారం నాటికి ఆ నష్టం మరింత పెరిగింది. తాజా లెక్కల ప్రకారం 489 గ్రామాల్లో 45993 ఎకరాల్లో వరి, 46826 ఎకరాల్లో పత్తి, 100 ఎకరాల్లో కంది పంటకు నష్టం జరిగింది. మొత్తంగా 41765 మంది రైతులకు సంబంధించిన 92919 ఎకరాల్లో పంటదెబ్బతిన్నది. 50 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగిన పంటలనే పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయాధికారులు దీనికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు.