బుధవారం 25 నవంబర్ 2020
Suryapet - Oct 05, 2020 , 01:11:51

సర్వే నమోదును పకడ్బందీగా చేయాలి

 సర్వే నమోదును పకడ్బందీగా చేయాలి

  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి  
  • గుర్రంతండాలో సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్‌  

చివ్వెంల/బొడ్రాయిబజార్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతున్న వ్యవసాయేతర ఆస్తుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. ఆదివారం రాత్రి మండలంలోని ఐలాపురం ఆవాసం గుర్రంతండాలో జరుగుతున్న అసెస్మెంట్‌ సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను, ఆశించిన ఫలితాలను సాధించాలంటే సర్వే తీరు పకడ్బందీగా ఉండాలన్నారు. ప్రజలు ఇళ్లల్లో ఉన్నప్పుడే సిబ్బంది వివరాలు సేకరించాలన్నారు. వివరాల నమోదు పక్కాగా ఉండాలన్నారు. యజమానులు వెల్లడించని విషయాలను నమోదు చేయరాదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ధరావత్‌ సైదా ఇంటి వివరాలను నమోదు చేశారు. రోజుకు ఎన్ని ఇళ్ల వివరాలు నమోదు చేస్తున్నార పంచాయతీ కార్యదర్శిని అడుగగా సుమారు 60 నుంచి 80వరకు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సర్పంచ్‌ బోడపట్ల సునీతశ్రీను సూర్యాపేట-దంతాలపల్లి రహదారి అధ్వానంగా మారిందని తెలిపారు.

ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు వివరాలు తనకు పంపాలని ఎంపీఓ గోపికి సూచించారు. త్వరలోనే రోడ్డు సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కుమార్‌, ఉప సర్పంచ్‌ వినోద్‌, వార్డు సభ్యులు లక్ష్మి, నరసింహ, వినోద్‌ పాల్గొన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 14వ వార్డు కృష్ణాకాలనీలో నిర్వహిస్తున్న ధరణి సర్వేను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాప్‌ ద్వారా నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించారు. గృహ యజమానులు తమ ఇంటి వివరాలతోపాటు ఇతర వివరాలను మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.