సోమవారం 30 నవంబర్ 2020
Suryapet - Oct 03, 2020 , 01:39:54

గాంధీ అడుగుజాడల్లో నడవడమే.. నిజమైన నివాళి

గాంధీ అడుగుజాడల్లో నడవడమే.. నిజమైన నివాళి

  •   విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 

సూర్యాపేట టౌన్‌ : జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ.. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అర్పించడమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్ముడు కన్న కలలు నేడు సాకారమవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో జరుగుతున్న కనీవిని ఎరుగని అభివృద్ధే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

అహింసే ఆయుధంగా బ్రిటీష్‌ పాలకులను గడగడలాడించి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు యావత్‌ ప్రపంచానికే ఆదర్శప్రాయుడన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుమారు 14ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు. కేవలం ఆరేండ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు సృష్టించి ప్రజల గుండెల్లో తెలంగాణ జాతిపితగా సీఎం కేసీఆర్‌ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌చైర్మన్‌ పుట్ట కిశోర్‌, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, నాయకులు ఉప్పల ఆనంద్‌, పెద్దిరెడ్డి రాజా పాల్గొన్నారు.