మంగళవారం 20 అక్టోబర్ 2020
Suryapet - Oct 02, 2020 , 01:42:04

ఇదే క‌దా.. గ్రామ స్వ‌రాజ్యం..

ఇదే క‌దా.. గ్రామ స్వ‌రాజ్యం..

  • గుబాళిస్తున్న గాంధీజీ గ్రామస్వరాజ్యం 
  • ‘పల్లె ప్రగతి’తో నెలకొన్న పారిశుధ్యం 
  •  సకల వసతుల సమాహారంగా గ్రామాలు 
  • మౌలిక సదుపాయాలతో మారిన  రూపురేఖలు 
  • డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం 
  • పారిశుధ్యం, పచ్చదనానికి సర్కారు పెద్దపీట 

 గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలోఆవిష్కృతమవుతోంది. స్వరాష్ట్రంలో పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. మౌలిక వసతులు, అభివృద్ధి హంగులతో రూపు రేఖలు మారుతున్నాయి. సంక్షేమ ఫలాలు ఇంటింటికీ అందుతున్నాయి. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా సహా అనేక సౌకర్యాలు సమకూరుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ‘పల్లె ప్రగతి’ ద్వారా గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, డంపింగ్‌ యార్డు, నర్సరీ, వైకుంఠధామం, కంపోస్ట్‌ షెడ్డు ఇలా అనేక సదుపాయాలు సమకూరుతున్నాయి. నర్సరీల  ఏర్పాటు ద్వారా స్థానికంగా మొక్కలు పెంచి నాటుతుండడంతో  పచ్చదనం అలరారుతోంది. నేడు గాంధీ జయంతి పురస్కరించుకొని  పల్లెల ప్రగతి బాట  ప్రత్యేక కథనం 


పారిశుధ్యం-ఆరోగ్యం..

ఆరోగ్యానికి, పారిశుధ్యానికి అవినాభావ సంబంధం ఉంది. గ్రామాల్లో పారిశుధ్యం సాధిస్తే.. అక్కడ అనారోగ్యం దరిదాపుల్లోకి కూడా రాదు. మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే జిల్లాలోని పలు గ్రామాలు వంద శాతం మరుగుదొడ్లు ఉన్న గ్రామాలుగా రూపొందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపడుతోంది.  

మద్యపాన నిషేధం..  

మద్యపానంపై గాంధీజీ ఎంతో వ్యతిరేకత చూపేవారు. దేశం ఆర్థికంగా, నైతికంగా ముందడుగు వేయాలంటే మద్యపాన నిషేధం తప్పనిసరని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సారా తయారీని అరికట్టి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. 

పాలనలో పారదర్శకత..

పరిపాలనలో దాపరికాలు ఉండొద్దు. పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా పాలకవర్గం ఉండాలని గాంధీజీ ఏనాడో చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని తన ఆత్మకథలోనూ రాసుకున్నారు. ప్రజాహితాన్ని మనస్సులో పెట్టుకొని విశాల హృదయంతో నిజాయతీగా వ్యవహరించే ప్రజాప్రతినిధులు మెరుగ్గా ప్రభుత్వాన్ని రక్షిస్తారు. ఇరవై మంది కేంద్రంలో కూర్చొని ప్రజా ప్రభుత్వాన్ని నడపలేరు. ప్రతి గ్రామంలోని నాయకులు పారదర్శకంగా పనిచేసినప్పుడే ఆ గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. నిధుల వ్యయంలో పారదర్శకత ఉంటే నాయకుడిపై నమ్మకం పెరుగుతుంది. 

ప్రాథమిక విద్య 

విద్య అంటే గాంధీజీ దృష్టిలో మానవుడిలో దాగి ఉన్న శారీరక, మానసిక, సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీయగల సాధనం. బడీడు పిల్లలకు నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయాలని రాజ్యాంగం చెప్పింది. ఈ దిశగా కృషి చేస్తున్నా.. ఇంకా చాలా మంది పిల్లలు బడిబయట బాల కార్మికులుగా ఉన్నారు. విద్యతో పాటు వృత్తి విద్యకూ ప్రాధాన్యం ఇవ్వాలని గాంధీ సూచించారు. దీంతో పనిపై గౌరవం పెరిగి విద్యార్థుల్లో సామాజిక విలువలు పెంపొంది జాతి నిర్మాణంలో భాగస్వామ్యులయ్యేందకు దోహదం చేస్తుందనేది ఆయన ఆలోచన.

అభివృద్ధి.. 

పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దానికనుగుణంగా ప్రణాళికలు రచించాలి. తమకుతామే ఆర్థిక ప్రగతిని పెంచుకోవాలి అనే గాంధీజీ ఆలోచనలు నేడు అమలవుతున్నాయి. ప్రణాళికల రూపకల్పనలో గాంధీజీ ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ దిశగానే ప్రణాళికలు రూపుదిద్దుకొంటున్నాయి. రాజ్యాంగంలోని 11వ షెడ్యుల్‌లో ప్రకటించిన 29 అంశాలను వేగవంతం చేయాలి. అప్పుడే పంచాయతీలు పూర్తి స్థాయిలో అభివృద్ధిని సాధిస్తాయి. 

మహిళాభ్యుదయం..

మహిళలు ఇంటికే పరిమితం కాకూడదనేది గాంధీజీ అభిప్రాయం. స్వాతంత్య్రోద్యమంలో గాంధీ పిలుపుతో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. స్త్రీలు విద్యావంతులు కావాలి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని గాంధీ కోరుకున్నారు. ఆయన ఆశయాలకనుగుణంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. నేడు పంచాయతీల్లోనూ 50 శాతం మహిళలకు కేటాయించడంతో సగం మంది సర్పంచులు వారే ఉన్నారు. కానీ నేరుగా రాజకీయల్లో రాణించినప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. ఎక్కువ శాతం మహిళల పదవుల్లో వారి భర్తలు, కుటుంబీకుల పెత్తనమే కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం మహిళలు పదువుల్లో ఉన్న చోట వారి బంధువులు, కుటుంబ సభ్యుల పెత్తనం చెల్లదని కీలక నిర్ణయం తీసుకుంది. మహిళ స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చినప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. 

గాంధీ సూత్రం.. 

మనం చేస్తున్న పని సరైనదా, కాదా? అని నిర్ణయించు కోవడానికి గాంధీజీ ఒక సూత్రం చెప్పారు. ‘నీకు తెలిసిన అతి పేదవాడు, నిస్సహాయుడైన ఒక వ్యక్తిని తలుచుకో.. నేను చేస్తున్న పని అతడికి ఏ విధంగా నైనా ఉపయోగపడుతుందా? అతడికి దీనివల్ల లాభం కలుగుతుండా? అని ఆలోచించు. ఆ పేదవాడికి లాభం కలుగుతుందనిపిస్తే ఆ పని చేయొచ్చు’ అని ఆయన సూచించారు. అభివృద్ధిని కాక్షించి, సేవాభావంతో రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్పుకుంటున్న నేతలు ఈ సూత్రాన్ని పాటిస్తే ఓటర్లకు న్యా యం చేసిన వారవుతారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లిన వారుగా నిలిచిపోతారు. 


logo