శనివారం 31 అక్టోబర్ 2020
Suryapet - Oct 01, 2020 , 02:40:01

చిట్టితల్లి మూగవేదన

చిట్టితల్లి  మూగవేదన

  • పుట్టుకతో మూగ, వినికిడి లోపం 
  • వైద్యం చేయించే స్థోమత లేక తల్లిదండ్రుల అవస్థలు
  • దాతలు సాయమందించాలని వేడుకోలు

కుటుంబ పెద్ద దివ్యాంగుడు. చిన్న డబ్బాకొట్టు పెట్టుకొని వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉంది. భర్త కష్టం చూడలేక భార్య కూడా కూలిపనులకు వెళ్తోంది. ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు కలుగగా.. పెద్ద కూతురు మూగ, వినికిడిలోపంతో బాధపడుతోంది. తమ కూతురుకు వైద్యం చేయించి మామూలుగా చేయాలని ఆ దంపతులు దవాఖానల చుట్టూ తిరిగారు. అప్పుచేసి వైద్యం చేయించారు. చివరకు ఆపరేషన్‌ చేస్తే మాటలువస్తాయని.. అందుకు రూ.3 లక్షలు కావాలని డాక్టర్లు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు షేక్‌ సయ్యద్‌, సఫియాబేగం.

-  కట్టంగూర్‌

కట్టంగూర్‌ మండలంలోని నారెగూడెం గ్రామానికి చెందిన షేక్‌ సయ్యద్‌, సఫియాబేగం దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వీరిలో పెద్ద కూతురు జాస్మిన్‌(8)  పుట్టుకతోనే మూగ, వినికిడి లోపం ఉంది. సయ్యద్‌ గ్రామంలో చిన్న డబ్బాకొట్టు పెట్టుకొని వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే సయ్యద్‌ దివ్యాంగుడు కావడంతో భర్త కష్టం చూడలేక భార్య సఫియాబేగం కూడా కూలిపనులకు వెళ్తోంది. 

కూతురు వైద్యం కోసం..

కూతురు జాస్మిన్‌ మూగ, వినికిడి లోపంతో పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయిన దంపతులు చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా రూ.3లక్షలు అప్పు చేసి నల్లగొండ, హైదరాబాద్‌లోని దవాఖానలకు తిరిగి వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తోటి పిల్లలు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుండగా.. జాస్మిన్‌ మాత్రం వాళ్లనే దీనంగా చూస్తూ ఉండిపోతుండడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. సుమారు రూ.3లక్షలు ఖర్చుచేసి మెరుగైన వైద్యం చేయిస్తే జాస్మిన్‌కు మాటలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ఆశ కలిగినా.. అంత డబ్బు లేక ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. జాస్మిన్‌కు మెరుగైన వైద్యం చేయించేందుకు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు సెల్‌: 9010490244 నెంబర్‌ను సంప్రదించాలని వారు కోరుతున్నారు.