బుధవారం 02 డిసెంబర్ 2020
Suryapet - Sep 30, 2020 , 02:10:26

మిల్లింగ్‌ కష్టం

మిల్లింగ్‌ కష్టం

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) సేకరణలో సూర్యాపేట జిల్లా యంత్రాంగం వెనుకబడిపోయింది. మిల్లింగ్‌ గడువు నేటితో ముగియనుండగా.. అతికష్టంగా 42శాతం మాత్రమే పూర్తి చేశారు. మరో నెల రోజుల్లో వానకాలం ధాన్యం మార్కెట్లకు పోటెత్తనుంది. అయినప్పటికీ యాసంగి ధాన్యం నేటికీ మిల్లుల్లో పేరుకుపోయింది. దీంతో కొనుగోళ్లలో జాప్యం జరిగే అవకాశాలున్నాయి. 2019- 2020యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 296కొనుగోలు కేంద్రాల నుంచి 3,96,166మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. మరో ఆరు జిల్లాల నుంచి వచ్చిన మొత్తం 4,27,097మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 60మిల్లులకు కేటాయించారు. మిల్లర్లు 2,90,426మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా ప్రస్తుతం 1.22లక్షల మెట్రిక్‌ టన్నులు(42శాతం) మాత్రమే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో 15రోజులు గడువు కోరుతూ అధికార యంత్రాంగం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

సూర్యాపేట : ఈ ఏడాది వానకాలం రాష్ట్రవ్యాప్తంగా కనీవిని ఎరుగని స్థాయిలో వరి సాగైంది. సూర్యాపేట జిల్లాలో సైతం మరో నెలరోజుల్లో వరి ధాన్యం మార్కెట్లకు చేరనుంది. దీంతో ప్రభుత్వం సీఎంఆర్‌పై దృష్టిపెట్టింది. యాసంగి ధాన్యం సీఎంఆర్‌ వేగంగా పూర్తిచేయాలని టార్గెట్‌ పెట్టింది. కానీ ఇప్పటివరకు 42శాతం మాత్రమే టార్గెట్‌ పూర్తయ్యింది. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసింది. దీంతో సూర్యాపేట జిల్లాలో 296కేంద్రాలు ఏర్పాటుచేసి పెద్దఎత్తున 3,96,166 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దీనికితోడు సరిహద్దు జిల్లాలైన యాదాద్రి నుంచి 8836మెట్రిక్‌ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం 536.520, ములుగు 1849, జనగాం 8274, జయశంకర్‌ భూపాలపల్లి 7255, మహబూబాబాద్‌ 4180మెట్రిక్‌ టన్నుల ధాన్యం సూర్యాపేటకు తరలించారు. దీంతో జిల్లాలోని 60రైస్‌ మిల్లుల్లో 4,27,097 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సీఎంఆర్‌ చేయాల్సి ఉంది. ‘రా రైస్‌' క్వింటాల్‌కు 67కేజీల బియ్యం వస్తుండగా, బాయిల్డ్‌ రైస్‌ క్వింటాల్‌కు 68కేజీల బియ్యం వస్తుంది. వీటి కోసం ప్రభుత్వం మిల్లులకు ‘రా రైస్‌'కు రూ.30ఇస్తుండగా బాయిల్డ్‌ రైస్‌ క్వింటాల్‌కు రూ.50చొప్పున మిల్లింగ్‌ చార్జీలు చెల్లిస్తోంది. 

నేడే ఆఖరు.. 

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 30 నాటికి ధాన్యం మిల్లింగ్‌ పూర్తి చేసి గోదాములకు తరలించాలని గడువు విధించింది. 2019 సంవత్సరంలో వానకాలం సీఎంఆర్‌ సెప్టెంబర్‌ 23న పూర్తయిన నేపథ్యంలో యాసంగి ధాన్యం ఆలస్యమవుతున్నదని అధికారులు చెబుతున్నారు. మరో 15 రోజులు గడువుకావాలని కోరుతున్నారు.  

కొనుగోళ్ల నాటికి మిల్లులని ఖాళీ చేయడమే లక్ష్యం...

వానకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యే నాటికి రైస్‌ మిల్లుల్లో పేరుకుపోయిన నిల్వలు ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. సీఎంఆర్‌ త్వరగా పూర్తి చేయించి వానకాలం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగకుండా చూడాలని భావిస్తోంది. ఈఏడాది 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుపోతుంది. 

15రోజుల్లో లక్ష్యం చేరుకుంటాం... 

ఈ నెలాఖరుకల్లా సీఎంఆర్‌ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 42శాతమే అందింది. అక్టోబర్‌ 15వరకు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. వానకాలం కోతలు ప్రారంభమయ్యే నాటికి అన్ని మిల్లుల్లో సీఎంఆర్‌ స్వాధీనం చేసుకుంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. 

- పుల్లయ్య, పౌరసరఫరాలశాఖ డీఎం, సూర్యాపేట