శనివారం 31 అక్టోబర్ 2020
Suryapet - Sep 29, 2020 , 05:38:18

చిరు వ్యాపారం.. నగదు ర‌హితం

చిరు వ్యాపారం..  నగదు ర‌హితం

  •  ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపుల దిశగా అడుగులు
  •  క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలు.. ఖాతాల్లో నగదు జమ
  •  మెప్మా అధ్వర్యంలో చిరు వ్యాపారులకు ప్రోత్సాహం
  • సూర్యాపేట జిల్లాలో 13,750 మంది వ్యాపారుల గుర్తింపు

హుజూర్‌నగర్‌ : చిరు వ్యాపారులు సాంకేతికతను ఉపయోగించుకునేలా మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) చర్యలు చేపట్టింది. పురపాలక సంస్థ పరిధిలో వారికి క్యూఆర్‌ కోడ్‌లు ఇచ్చి నగదు రహిత చెల్లింపులు దిశగా అడుగులు వేయిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల సమయం వృథా కాకుండా, వ్యాపారులు నగదు తీసుకునే అవసరం లేకుండా వినియోగదారులు తమ ఫోన్‌ నుంచి క్యూర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చిరు వ్యాపారి ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు తమ దుకాణాల్లో ఆన్‌లైన్‌ నగదు చెల్లింపులు నిర్వహిస్తున్నారు. పలు యాప్‌ల ద్వారా క్యూఆర్‌కోడ్‌లను ఏర్పాటు చేసుకుని నగదు లావాదేవీలను కొనసాగిస్తున్నారు. అధికారులు ప్రతి దుకాణం వద్దకు వెళ్లి భారత్‌ క్యూర్‌ పేరుతో లింక్‌ను కేటాయిస్తున్నారు. 

నోట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే...

సాంకేతికత నిత్య జీవితంలో ఒక భాగమైంది. ఈ క్రమంలోనే డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం పెరిగింది. ప్రభుత్వాలు కూడా నగదు రహిత లావాదేవీలనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నగదు లావాదేవీలపై చాలా మంది విముఖత చూపుతున్నారు. నోట్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే భయం వారిలో నాటుకు పోయింది. చాలామంది డబ్బులు చేతుల మీదుగా తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా చిరు వ్యాపారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా మెప్మా చర్యలు చేపట్టింది. ఆత్మ నిర్భర్‌ పథకం కింద రూ.10 వేల రుణం తీసుకున్న వారికి క్యూఆర్‌ కోడ్‌ను కేటాయిస్తున్నారు. వినియోగదారుల నుంచి నగదు తీసుకునే అవకాశం లేకుండా వారి ఫోన్‌ నుంచి క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే వ్యాపారి ఖాతాలో నగదు జమ అవుతోంది.

 డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించేలా చర్యలు... 

జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలున్నాయి. వీటి పరిధిలో చిరు వ్యాపారం చేసే 13,750 మందిని మెప్మా గుర్తించింది. ప్రతి వీధి వ్యాపారి ఆత్మ నిర్భర్‌ పథకం కింద రూ.10 వేల రుణం తీసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. వీరికి క్యూర్‌ కోడ్‌లను కేటాయించి ఫోన్‌ ద్వారా లావాదేవీలు జరిపేలా అవగాహన కల్పించారు. అయితే మొబైల్‌ బ్యాకింగ్‌ సౌకర్యం ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇలా 200 లావాదేవీలను జరిపితే వ్యాపారి ఖాతాలో రూ.100 జమ అవుతాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల ఇటు వ్యాపారులతో పాటు అటు వినియోగదారులకు కూడా లాభం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా చిల్లర కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. చిరు వ్యాపారులు కూడా డబ్బులు తీసుకోవడం, మళ్లీ తిరిగి చిల్లర ఇవ్వడం వంటి వాటితో సమయం వృథా కాకుండా ఉంటుంది.

వ్యాపారం సులువుగా సాగుతుంది...


ఆత్మనిర్భర్‌లో రుణం పొంది చిరు వ్యాపారం చేసే వారు డిజిటల్‌ లావాదేవీలు జరిపేలా ప్రోత్సహిస్తున్నాం. నగదు లావాదేవీలకు బదులుగా ఆన్‌లైన్‌ చెల్లింపులు చేపట్టడం వల్ల వ్యాపారం సులువుగా సాగుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. దాదాపు అందరు వ్యాపారులు ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా నోట్ల మార్పిడి వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే భయం కూడా కొనుగోలుదారుల్లో ఉంది. అందువల్లే వారు కూడా నగదు రహిత లావాదేవీలవైపే మొగ్గు చూపుతున్నారు.  

-నాగిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, హుజూర్‌నగర్‌