శనివారం 31 అక్టోబర్ 2020
Suryapet - Sep 29, 2020 , 05:38:18

ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌!

ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌!

  •  డ్రైవింగ్‌ పాఠాలు నేర్పనున్న ఆర్టీసీ
  • ఆదాయ మార్గాలపై సంస్థ ప్రత్యేక దృష్టి
  • రెండు జిల్లాల్లో మూడు డ్రైవింగ్‌ స్కూళ్లు ఏర్పాటు 
  •  ఇప్పటికే పార్సిల్‌, కొరియర్‌ సర్వీసులు చేపడుతున్న సంస్థ 

ఆర్టీసీలో యాజమాన్యం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాలోని డిపో కేంద్రాలతో పాటు ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో పార్సిల్‌, కొరియర్‌ సర్వీసులను ప్రారంభించిన సంస్థ.. డ్రైవింగ్‌ పాఠాలను బోధించేందుకు సిద్ధమవుతోంది.  నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో రెండు డ్రైవింగ్‌  స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా అదనపు ఆదాయం పొందడమే కాకుండా, డ్రైవర్ల కొరతను అధిగమించాలని అధికారులు యోచిస్తున్నారు.  

- సూర్యాపేట అర్బన్‌

ఆర్టీసీలో ఇప్పటికే ఉన్న సీనియర్‌ డ్రైవర్ల ద్వారా డ్రైవింగ్‌ పాఠాలను బోధించనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఆదరణను బట్టి మరిన్ని డ్రైవింగ్‌ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నారు. కరోనా కారణంగా పీకల్లోతు నష్టాల్లో మునిగిన ఆర్టీసీకి.. కార్గో సేవలు కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. ఇప్పుడు డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మరింత ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ డ్రైవింగ్‌ స్కూళ్లను అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభించనున్నారు. 

 జిల్లా కేంద్రాల్లో..

ప్రస్తుతం నల్లగొండ, సూర్యాపేట జిల్లాకేంద్రాల్లో రెండు డ్రైవింగ్‌ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో కేవలం భారీ వాహనాల శిక్షణను మాత్రమే ఇవ్వనున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి తరువాత లైట్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ను కూడా నేర్పించన్నుట్లు సమాచారం.  

విధివిధానాలు.. 

 ఆర్టీసీ డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు  18 ఏండ్లకు పైబడిన వారే అర్హులు. 

డ్రైవింగ్‌ స్కూల్‌ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. 

శిక్షణ పొందేందుకు అభ్యర్థులు రూ.15,600 చెల్లించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు తప్పనిసరిగా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలి.

ఒక సంవత్సరం ముందుగా లైట్‌ మోటార్‌ లైసెన్స్‌ పొంది ఉండాలి.

శిక్షణలో భాగంగా మొత్తం 36 థియరీ క్లాసులతో పాటు ఫీల్డ్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. 

పదహారు మందిని ఒక గ్రూపుగా చేసి శిక్షణ ఇవ్వనున్నారు. రీజినల్‌ మేనేజర్‌, డిపో మేనేజర్ల పర్యవేక్షణలో శిక్షణ ఉంటుంది.

బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు 

డ్రైవింగ్‌ పాఠాల కోసం ఒక బస్సును గుర్తించి దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. వాహనానికి రెండు వైపులా స్టీరింగ్‌, క్లచ్‌, బ్రేక్‌, ఎక్సలేటర్‌ వంటి పరికరాలను అమర్చుతారు. అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకుగాను నైపుణ్యం కలిగిన శిక్షకులను నియమించి వారికి మళ్లీ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ప్రమాద రహితంగా వాహనాన్ని నడిపి, కేఎంపీఎల్‌ పెంచిన డ్రైవర్‌లకు శిక్షకులుగా అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డ్రైవింగ్‌ స్కూల్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆర్టీసీ తరపున సర్టిఫికెట్‌ను సైతం జారీ చేయనున్నారు.

ఉద్యోగులకు అదనపు ఆదాయం 

ఆర్టీసీలో ప్రారంభించిన కార్గో సేవల ద్వారా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కరోనా కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చడంలో కార్గో సేవలు ఉపయోగపడుతున్నాయి. అదే తరహాలో ఆర్టీసీ ఉద్యోగులను ఉపయోగించుకుని డ్రైవింగ్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు మరింత ప్రయోజనంతో పాటు నైపుణ్యం కలిగిన డ్రైవర్లు వెలుగులోకి రానున్నారు. 

రెండు కేంద్రాల్లో సేవలు ప్రారంభం


ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆర్టీసీలో డ్రైవింగ్‌ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో డ్రైవింగ్‌ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. శిక్షణకు అవసరమైన బస్సులను గుర్తించి దానికి అవసరమైన పరికరాలను రెండు వైపులా అమర్చుతున్నాం. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే అదేశాలు అందాయి. అక్టోబర్‌-1 నుంచి తరగతులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 

- సీహెచ్‌.వెంకన్న ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌, నల్లగొండ