శనివారం 31 అక్టోబర్ 2020
Suryapet - Sep 26, 2020 , 01:39:18

జాతీయ రహదారి పచ్చదనంతో మెరవాలి

జాతీయ రహదారి పచ్చదనంతో మెరవాలి

  • చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలి
  • మొక్కల సంరక్షణకు స్థానికుల భాగస్వామ్యం తీసుకోవాలి
  • సీఎం ఓఎస్డీ, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్‌
  • 65వ జాతీయ రహదారిపై హరితహారం మొక్కల పరిశీలన
  • హరితహారం మొక్కల సంరక్షణలో జిల్లా అధికారులకు ప్రశంసలు

సూర్యాపేట రూరల్‌/మునగాల/ కోదాడరూరల్‌/ చివ్వెంల/ కేతేపల్లి/ చిట్యాల : హరితహారంలో భాగంగా ఇరువైపులా నాటిన మొక్కలతో 65వ జాతీయ రహదారి పచ్చదనంతో మెరవాలని, మొక్కల సంరక్షణ బాధ్యతను రహదారి వెంట ఉన్న గ్రామాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సీఎం ఓఎస్‌డీ, హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్‌ అన్నారు.

శుక్రవారం ఆమె సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని జాతీయ రహదారి వెంట మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చనిపోయిన మొక్కల స్థానంలో మరో మొక్క నాటాలని ఆదేశించారు. రహదారి వెంట నీరు తక్కువ భూమి ఎత్తుగా ఉన్నప్రాంతంలో గుల్‌మెహర్‌, నీటి గుంతలు ఉన్న ప్రాంతంలో నీటిలో పెరిగే మొక్కలను నాటాలని సూచించారు. మొక్కలకు సంరక్షణగా ఉన్న బుట్టలు ఒరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని, వృక్షాలుగా ఎదిగే వరకు బాధ్యతగా కాపాడాలన్నారు. ప్రతి రెండున్నర మీటర్ల దూరానికి ఒక మొక్క చొప్పున మూడు మూడు వరుసల్లో ఇరుపక్కలా నాటాలని సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను గ్రామ పంచాయతీ ట్రాక్టర్లతో నీరు పోసి సంరక్షించాలన్నారు. నాటిన మొక్కలను నరకాలంటే నేషనల్‌ హైవే అథారిటీ అధికారుల అనుమతి కాకుండా డీఎఫ్‌ఓ నుంచి ఎన్‌ఓసీ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి వెంట చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు, నకిరేకల్‌, కేతేపల్లి మండలాల్లోని 21గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 66కిలోమీటర్ల మేర మొక్కలు నాటినట్లు అధికారులు ఆమెకు తెలిపారు.

ఈ సంవత్సరం పంచాయతీ ద్వారా 17వేల మొక్కలు, గత సంవత్సరం అటవీశాఖ ద్వారా 28వేల మొక్కలు నాటినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమె హరితహారంలో జిల్లా అధికారుల పనితీరు పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు వినయ్‌ కృష్ణారెడ్డి, ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, డీపీఓలు యాదయ్య, విష్ణువర్ధన్‌, సూర్యాపేట డీఆర్‌డీఓ సుందరి కిరణ్‌కుమార్‌, డీఎఫ్‌ఓ ముకుందారెడ్డి, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.