మంగళవారం 20 అక్టోబర్ 2020
Suryapet - Sep 26, 2020 , 01:39:24

అతిథిగా వచ్చి.. ఆశీర్వదించి..

అతిథిగా వచ్చి.. ఆశీర్వదించి..

  • సూర్యాపేటతో ఎస్పీ బాలుకు ప్రత్యేక అనుబంధం
  • పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరు
  • గానగంధర్వుడికి గానగాత్రం కావ్యం అంకితం
  • సంగీత సరస్వతి తన  బిడ్డను కోల్పోయింది : మంత్రి జగదీశ్‌రెడ్డి
  • బాలసుబ్రమణ్యం సేవలు వెలకట్టలేనివి : మండలి చైర్మన్‌ గుత్తా, ఎంపీ బడుగుల

 ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడుగా సుపరిచితుడైన ఎస్పీ బాల సుబ్రమణ్యం ఇక లేరనే విషయాన్ని సంగీత, సాహిత్యాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సూర్యాపేటకు చెందిన పలువురితో ఎస్పీ బాలూకు ప్రత్యేక అనుబంధం ఉంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించారు. 2009లో ఒకసారి,ఆ తర్వాత త్యాగరాజ ఆరాధనోత్సవాలకు సూర్యాపేటకు వచ్చారు.

2013లో పెద్దిరెడ్డి గణేశ్‌ తను రాసిన గానగాత్రం కావ్యాన్ని బాలూను ఆహ్వానించి అంకితమిచ్చారు. సంగీత సరస్వతి ఓ బిడ్డను కోల్పోయిందని,  బాలూ లేనిలోటు పూడ్చలేనిదని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి.. వేల పాటలతో కోట్లాది మనసులు గెలుచుకున్న బాలూ సినీ రంగానికి చేసిన సేవలు వెలకట్టలేనివని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం  వ్యక్తం చేశారు. 

బొడ్రాయిబజార్‌ : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిని సూర్యాపేట జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా వ్యాధితో బాధపడుతున్న బాలు శుక్రవారం తనువు చాలించడంతో తీవ్రంగా కలత చెందారు. సూర్యాపేట జిల్లాకేంద్రంతో గాయకుడు బాలుకు ప్రత్యేక అనుబంధం ఉంది. సూర్యాపేటలో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఇక్కడి గాయకులను ఎంతో ప్రోత్సహించేవారు. పాడుతా తీయగా, పాడాలని ఉంది, స్వరాభిషేకం వంటి కార్యక్రమాల్లో రోజూ కనిపించే బాలు ఇక కనిపించరనే నిజం కలగా మారితే బాగుండని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. 

పేటతో ప్రత్యేక అనుబంధం : సూర్యాపేటలో 2007సంవత్సరంలో జరిగిన గొల్లపూడి మారుతీరావు ఎలిజేలు పుస్తకావిష్కరణలో పట్టణానికి చెందిన పలువురు సంగీతప్రియులు ఎస్పీ బాలసుబ్రమణ్యాన్ని పేటకు ఒక్కసారైనా తీసుకురావాల్సిందిగా మారుతీరావును కోరారు. దీంతో ఆయన మే 1, 2009న సూర్యాపేటకు బాలును తీసుకొచ్చారు. పట్టణానికి చెందిన పెద్దిరెడ్డి గణేశ్‌ రాసిన గానగాత్రం బాలుకి అంకితమివ్వాలనే సంకల్పంతో రాయగా ఆ కావ్యాన్ని నవంబర్‌ 23, 2013న సూర్యాపేటలో శాస్త్రీయంగా బాల సుబ్రహ్మణ్యానికి కాళ్లు కడిగి అంకితమిచ్చారు. దీంతో బాలు ఎంతో సంబురపడి పెద్దిరెడ్డి గణేశ్‌ కుటుంబంతో ప్రత్యేక అనుబంధాన్ని పెనవేసుకున్నారు.

సంగీత సరస్వతి బిడ్డను కోల్పోయింది 


సంగీత సరస్వతి ఓ బిడ్డను కోల్పోయింది. ప్రపంచంలో బాలు లేనిలోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయకుడిగా.. నటుడిగా.. సంగీత దర్శకుడిగా సినీ ప్రపంచానికి ఆయన అందించిన సేవలు అనన్య సామాన్యం. నాలుగుతరాల ప్రేక్షకులకు సుపరిచితుడు. 16భాషల్లో తన గానామృతాన్ని పంచిన బాలు మరణం తెలుగు జగత్తు జీర్ణించుకోలేని విషయం. 

- గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి 

బాలు లేనిలోటు పూడ్చలేనిది


ఎన్నో భాషల్లో వేలాది సుమధుర గేయాలు ఆలపించిన గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు, కళాకారులకు, శ్రోతలకు శ్రేయోభిలాషులకు బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.

- బడుగుల లింగయ్యయాదవ్‌,రాజ్యసభ సభ్యుడు logo