బుధవారం 28 అక్టోబర్ 2020
Suryapet - Sep 23, 2020 , 03:19:56

నిత్యపూజల కోలాహలం

నిత్యపూజల కోలాహలం

ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం శాస్ర్తోక్తంగా పూజలు కొనసాగాయి. ఉదయం బాలాయంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం పట్టువస్ర్తాలను ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. వేకువ జామునే ఆలయాన్ని తెరచి ఆరాధన, సహస్త్ర నామార్చన, సువర్ణపుష్పార్చన వంటి నిత్యకైంకర్యాలను నిర్వహించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం పర్వాలను అర్చకులు విశేషంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీస్వామి అమ్మవార్లకు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

క్షేత్రపాలకుడికి ఆకుపూజ..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణి చెంతన ఉన్న క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని సింధూరంతో అభిషేకించి, తమలపాకులతో అలంకరించారు. స్వామివారిని శ్రీ చందనంతో అభిషేకం చేశారు. శ్రవణానందంగా లతిలా పారాయణం గావించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడలు, బెల్లం, ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. శ్రీస్వామివారిని పలువురు భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి ఖజానాకు రూ. 2,75,798 ఆదాయం

స్వామి వారి ఖజానాకు రూ. 2,75,798 సమరికూరినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ. 400, ప్రచారశాఖ ద్వారా రూ. 1,650, ప్రసాదవిక్రయాలతో రూ. 2,34,150, చెక్‌పోస్టు ద్వారా రూ. 1,330, వాహనపూజల ద్వారా రూ. 8,700, అన్నదాన విరాళంతో రూ. 3,498, కొబ్బరికాయలతో రూ. 26,070 లతో కలిపి మొత్తం రూ.2,75,798 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.


logo