బుధవారం 28 అక్టోబర్ 2020
Suryapet - Sep 23, 2020 , 03:19:53

మీ వాహనం అమ్ముతున్నారా?

మీ వాహనం  అమ్ముతున్నారా?

  • వెంటనే యాజమాన్య హక్కులను మార్చుకోండి
  • లేకుంటే అమ్మిన వారిపై కేసులు..
  • వారి అడ్రస్‌కే జరిమానాలు..
  • మార్పిడి చేయించుకోకుంటే ఇబ్బందులు తప్పవంటున్న రవాణా శాఖ 

కోదాడ పట్టణానికి చెందిన జాని.. తన బైక్‌ను ఆరు నెలల కిందట అమ్మేశాడు. తెలిసిన వ్యక్తే కదా అని కేవలం సాదా కాగితాలపై మాత్రమే విక్రయ ఒప్పందం రాసుకున్నాడు. ఇంతలో కొనుగోలు చేసిన వ్యక్తి తన అవసరాల నిమిత్తం ఆ వాహనాన్ని మరొకరికి విక్రయించాడు. అప్పుడు కూడా యాజమాన్య హక్కుల మార్పిడి గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే చివరగా వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి ఫోన్‌ నెంబర్‌ మార్చి అందుబాటులో లేకుండా పోయాడు. సదరు వ్యక్తి ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడంతో ఈ -చలానాల భారం రూ.6 వేల వరకు మొదట వాహనం అమ్మిన జానిపై పడింది. ఈ విషయాన్ని అతడు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఇందులో తాము చేసేదేం లేదని, జరిమానా చెల్లించాల్సిందేనని సిబ్బంది చెప్పడంతో చేసేది లేక జాని ఆ మొత్తం చెల్లించాడు. 

ఇది జాని ఒక్కడి పరిస్థితే కాదు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతో మంది ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాహనం కొన్నా.. అమ్మినా.. వెంటనే యాజమాన్య హక్కులు మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మోటార్‌ సైకిల్‌, ఫోర్‌ వీలర్‌, ఆటో, ఇతర వాహనాలు కొత్త వాటి కన్నా సెకండ్‌ హ్యాండ్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆర్థికంగా ఉన్నవారు, నెలసరి ఆదాయం వచ్చే వారు పాతది అమ్మి వాయిదాల పద్ధతిలో కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అయితే ఇక్కడే వారు పొరపాటు చేస్తున్నారు. పాత వాహనం విక్రయించేటప్పుడు యాజమాన్య హక్కులను మార్చడం లేదు. దీనివల్ల కేసులు, ఫైన్‌లు, జరిమానాలు వంటి ఇబ్బందులు తప్పవని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

25 శాతం వాహనాలు ఇతరులవే..

నిత్యం రోడ్డు పైకి వచ్చే వివిధ రకాల వాహనాల్లో 25 శాతం యాజమానులు కాకుండా ఇతరులు నడుపుతున్నారని తేలింది. ఇతరుల నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వారు యాజమాన్య హక్కులు మార్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. అలా చేయకుంటే వాహనం ప్రమాదానికి గురైనప్పుడు లేదా ఏదైనా కేసు అయినప్పుడు వాహనం నడిపేవారితో పాటు యజమానికి కూడా కష్టాలు తప్పవంటున్నారు.

ఆర్‌సీ మార్చకుంటే జరిమానా..

యాజమాన్య హక్కులు (ఆర్‌సీ)బదిలీ అయిన తర్వాతే వాహనం అప్పగించాలని అధికారులు చెబుతున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ వాహనం కొనుగోలు చేసిన వెంటనే ఫారం నెం.29, 30పై విక్రయించిన వారి సంతకాలు, ఆధారాలు తీసుకుంటే ఆర్‌సీ బదిలీ ఆర్టీఏ కార్యాలయంలో సులభమవుతుంది. అయితే సంతకం చేసి ఆర్టీఏ కార్యాలయానికి సమాచారం ఇచ్చిన నాటి నుంచి రాష్ట్ర పరిధిలోని వాహనాలైతే కేవలం 15 రోజుల్లో, ఇతర రాష్ట్ర వాహనాలైతే 30 రోజుల్లో యాజమాన్య హక్కులు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రతి నెలా వారికి రూ.500 జరిమానా విధిస్తారు. ఈ సమయంలో వాహనదారులు కచ్చితంగా వ్యవహరించి బదిలీ ప్రక్రియను ముందుగా పూర్తి చేశాకే కొనుగోలుదారుడికి వాహనం అప్పగించాలి. లేకుంటే కొనుగోలుదారుడు వాహనంతో ఎలాంటి నేరం చేసినా అసలు యాజమాని చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇలాంటి సెకండ్‌, థర్డ్‌ పార్టీ యాజమానులు వారు అమ్మిన వాహనాలను నిషేధిత ఉత్పత్తులు, అక్రమ రవాణా, ప్రమాదాలు వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో అసలు యజమానులు కేసుల్లో చిక్కుకుని పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  

బదిలీ తర్వాతే వాహనం అప్పగించాలి..

విక్రయదారుడు వాహనాన్ని అమ్మిన వెంటనే కొనుగోలుదారుడికి అప్పగిస్తున్నారు. ఇది సరికాదు. ఆర్‌సీ అతడి పేరుమీద మారిన తరువాతే వాహనాన్ని అప్పగించాలి. లేదంటే వాహన విక్రయదారులు తమ పేరిట ఉన్న వాహనం చేసే నేరాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. విక్రయదారులు ఈ విషయాన్ని కచ్చితంగా పాటించాలి. లేకుంటే అనవసర కేసుల్లో చిక్కుకొని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

-సుభాశ్‌, జిల్లా రవాణా శాఖ అధికారి, సూర్యాపేట


logo