బుధవారం 28 అక్టోబర్ 2020
Suryapet - Sep 23, 2020 , 03:20:11

గురుకులం.. చదువు నిరంతరం

గురుకులం.. చదువు నిరంతరం

కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అన్ని రంగాలు కుదేలవుతుండగా.. విద్యాశాఖపై పెద్ద దెబ్బే పడింది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందనే భయంతో ప్రభుత్వాలు ఇప్పటివరకు విద్యాసంస్థలను తెరువ లేదు. దీంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం వృథా అవుతుందేమోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన గురుకుల పాఠశా లలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు మాత్రం యథావిధిగా విద్యాబోధన సాగుతోంది. ఆన్‌లైన్‌ బోధనతో పాటు విలేజ్‌ లెర్నింగ్‌ సెంటర్ల ద్వారా కూడా విద్యార్థులకు పాఠాలు చెబు తున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18 గిరిజన గురుకుల  పాఠశాలలు, 12 జూనియర్‌ కళాశాలలు, 2 డిగ్రీ కళాశాలలున్నాయి. పాఠశాల స్థాయిలో 5,634 మంది విద్యనభ్యసిస్తున్నారు.

నిరంతరం సాగుతున్న విద్యాబోధన 

18 గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా బోధించడంతో పాటు వారి సందేహాలను కూడా నివృత్తి చేస్తున్నారు. గురుకులాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని లాక్‌డౌన్‌ కాలంలో కూడా విద్యా బోధన కొనసాగించారు. అన్ని విద్యా కేంద్రాల విద్యార్థులకు ఈ నెల ఆన్‌లైన్‌ బోధన ప్రారంభం కాగా గిరిజన గురుకులాల్లో మాత్రం ఏప్రిల్‌1 నుంచే ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో వింటున్నది లేనిది ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక విలేజ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆ సెంటర్‌కు సమీప గ్రామాల విద్యార్థులు వచ్చేలా ఏర్పాటు చేసి కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు.

ఏప్రిల్‌ 1న ప్రారంభమైన ఆన్‌లైన్‌ తరగతులు 

ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్‌1 నుంచే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌ పాఠాల్లో తలెత్తిన సమస్యలు, సందేహాలను విద్యార్థులు విలేజ్‌ లెర్నింగ్‌ సెంటర్‌కు వెళ్లి ఉపాధ్యాయుల చేత నివృత్తి చేసుకుంటున్నారు.  బోధన మొత్తం ఆంగ్ల భాషలోనే సాగుతోంది. ఇప్పటికి రెండు నుంచి మూడు చాప్టర్లు పోర్షన్‌ పూర్తి చేశారు.

చదువుతోపాటు క్రమ శిక్షణ 

విద్యార్థులకు చదువు అందించడంతోపాటు క్రమశిక్షణ కోసం విలేజ్‌ ఫిట్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు వ్యాయామం, క్రీడల్లో నైపుణ్యం నేర్పుతున్నారు. దీంతో విద్యార్థులు ఇటు చదువు, అటు క్రీడల్లో రాణిస్తున్నారు. 

963 విలేజ్‌ లెర్నింగ్‌ సెంటర్ల ఏర్పాటు 

గురుకుల పాఠశాలలకు విద్యార్థులు వచ్చేందుకు ఇష్టపడకపోవడంతో గురుకుల అధికారులు విలేజ్‌ లెర్నింగ్‌ సెంటర్లను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో 963 విలేజ్‌ లెర్నింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయగా ఒక్కొక్క సెంటర్‌కు 25 మంది విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ హాజరవుతున్నారు. ఒక ఉపాధ్యాయుడికి ఐదు సెంటర్ల పర్యవేక్షణ అప్పగించారు. ఉమ్మడి జిల్లాలోని 963 సెంటర్లలో 5634 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా విద్యా బోధన వింటూ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠాంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకుంటున్నారు. 

హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు 

లోకమంతా కొవిడ్‌ దాడితో విలవిలలాడుతుంటే గిరిజన గురుకుల విద్యార్థుల చదువులు మాత్రం కళకళడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు చేపడుతూనే విలేజ్‌ లెర్నింగ్‌ కేంద్రాల్లో విద్యార్థులకు తలెత్తే విషయాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారంటున్నారు. అన్ని పాఠశాలలు మూతబడినా గిరిజన గురుకుల పాఠశాల మాత్రం నిర్వహిస్తుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


logo