మంగళవారం 20 అక్టోబర్ 2020
Suryapet - Sep 21, 2020 , 04:24:50

యూరియా మోతాదు మించితే నష్టమే!

యూరియా మోతాదు మించితే నష్టమే!

  • ఎకరాకు 60కిలోలు చాలు
  •  కోదాడ వ్యవసాయ సంచాలకులు వాసు 

కోదాడ రూరల్‌ : వరి సాగులో రైతులు యూరియా(నత్రజని)ను అవసరానికి మించి వాడొద్దని కోదాడ వ్యవసాయ సంచాలకులు తంగెళ్ల వాసు అంటున్నారు. వరి సాగులో నత్రజని వాడకంపై పలు సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే...

వరిసాగులో అవగాహన లేకుండా యూరియాను వాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మోతాదుకు మించి వాడటంతో  పొలం ఆకుపచ్చగా, ఏపూగా పెరుగుతుందని రైతులు ఆలోచిస్తున్నారు. కానీ ఆ తరువాత దుష్ఫలితాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. పంటను ఆశించే తెగుళ్లు, వాటి ద్వారా జరిగే నష్ణాన్ని మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. దీంతో పంట దిగుబడి తగ్గడమేకాకుండా పెట్టుబడులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మన ప్రాంతంలో భూసార లెక్కల ప్రకారం ఎకరానికి 60కిలోల నత్రజని సరిపోతుంది. అలాకాకుండా ఎకరంలో అరకట్ట యూరియా కన్నా ఎక్కువ చల్లితే సోకే తెగుళ్ల నివారణకు దాదాపుగా రూ.1,500 అధిక పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని, ఈ లెక్కన జిల్లాలో సాగవుతున్న నాలుగు లక్షల ఎకరాలకు రూ. 70కోట్లకు పైగా రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

వరి పంటకు తెగుళ్లు...

వరిలో అధిక యూరియా వాడకంతో ఆకులు మందంగా, పెద్దగా పెరిగి పంటలో గాలిసోకక వేడి ఉబ్బకు పంటను దోమపోటు,  ఆకుముడత మొగిలిపురుగు, పాముపొడ, అగ్గితెగులు వంటి వ్యాధులు ఆశిస్తాయి. వీటి ఉధృతి పెరిగితే  పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. యూరియా వాడకం పెరిగి గత మూడు సంవత్సరాలుగా దోపో, సుడిదోమ తెగుళ్ల నివారణకు రూ.5వేల నుంచి రూ.8వేల వరకు పై మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది. 

ఎకరాకు 60కిలోలు చాలు..


వరి పంట కాలంలో ఎకరానికి 60కిలోల యూరియా సరిపోతుంది. దమ్ములో రైతులు రెండు కట్టల డీఏపీని వాడుతున్నారు. కట్టలో 9కిలోల చొప్పున రెండు కట్టల్లో 18కిలోల నత్రజని పంటకు అందుతుంది. మిగిలిన 42కిలోలను పంట ఎదుగుదలను బట్టి పలు దఫాలుగా చల్లుకోవచ్చు.  వర్షానికి పంటలు ఏపుగా పెరుగుతాయి. ఈ సమయంలో  వాతావరణంలోని నత్రజనిని పంట తీసుకుంటుంది. కాబట్టి తక్కువ మోతాదులో చల్లుకోవాలి. యూరియాను బురదగా ఉన్నప్పుడు చల్లి రెండ్రోజుల తర్వాత నీరు పెట్టుకోవాలి.

-వాసు, ఏడీఏ, కోదాడ   logo