గురువారం 29 అక్టోబర్ 2020
Suryapet - Sep 19, 2020 , 05:08:10

ఆర్థిక భద్రతకు శిక్షణ

ఆర్థిక భద్రతకు శిక్షణ

  • జూట్‌ బ్యాగుల తయారీపై మహిళలకు శిక్షణ, ఉపాధి 
  • ప్రోత్సహిస్తున్న ఏఆర్‌డీఎస్‌, గ్రీన్‌మ్యారో సంస్థలు
  • లబ్ధిపొందుతున్న స్వయం సంఘాల సభ్యులు

 దేవరకొండ పట్టణంలో యాక్షన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, గ్రీన్‌ మ్యారో సంస్థలు జూట్‌ బ్యాగుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణతోపాటు ఉపాధి కల్పిస్తున్నాయి. జూట్‌ బ్యాగుల తయారీలో 60రోజుల శిక్షణ ఇచ్చి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ సంస్థలు తోడ్పాటునందిస్తున్నాయి. కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.

నేషనల్‌ జూట్‌ బోర్డ్‌ కోల్‌కతా నుంచి ఈ సంస్థలకు కొంత ఆర్థిక సహాయం అందుతోంది. ఇప్పటి వరకు 100 మందికి శిక్షణ కల్పించారు. ఇందులో 55 మందికి సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ కేంద్రంలో బ్యాగులకు అవసరమైన మెటీరియల్‌ను ఏఆర్‌డీఎస్‌ సంస్థ ఇస్తుండగా శిక్షణ, నిర్వహణను గ్రీన్‌మ్యారో చూస్తుంది. ప్రతి రోజూ శిక్షణ కేంద్రంలో 20 మంది మహిళలు జూట్‌ బ్యాగులు తయారు చేస్తారు. వారు తయారు చేసిన బ్యాగులను సంస్థ నిర్వాహకులు ధరను నిర్ణయించి వివిధ ప్రాంతాల్లో విక్రయించి లాభాలు పొందుతున్నారు. ప్రతి మహిళ జూట్‌ బ్యాగుల తయారీతో రోజుకు రూ.300 పైనే సంపాదిస్తున్నారు.

దీంతో మహిళల కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నది. జూట్‌ బ్యాగులతో ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని కొంత మేరకైనా తగ్గించవచ్చని ఉద్దేశంతో గ్రీన్‌మ్యారో సంస్థ ఈ శిక్షణ ఏర్పాటు చేసిందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇందులో శిక్షణ పొందిన మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అంటున్నారు. ఏఆర్‌డీఎస్‌, గ్రీన్‌ మ్యారో సంస్థలు జూట్‌ బ్యాగుల వాడకంపై దేవరకొండ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. 

  నాలో ఆత్మైస్థెర్యం నింపింది 


ఏఆర్‌డీఎస్‌ సంస్థ కల్పించిన ఉచిత కుట్టు శిక్షణ నాలో ఆత్మైస్థెర్యం నింపింది. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని భావన కలిగింది. మొదట్లో నేర్చుకుంటానో లేదోనని భయపడ్డాను. శిక్షకులు ఇచ్చే మెళకువలతో త్వరగా నేర్చుకున్నా. ఇప్పుడు శిక్షణ కేంద్రంలోనే ఉపాధి పొందుతూ ఆర్థికంగా లబ్ధిపొందుతున్నా. 

- ఎన్‌ అశ్విని, మహిళశిక్షకురాలు


logo