ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 16, 2020 , 02:50:56

నిరుపేదకు.. నీడకరువు

నిరుపేదకు.. నీడకరువు

  • కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లోనే జీవనం
  • మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్న వైనం 
  • కంటిచూపు లేని కూతురును చదివించేందుకు అష్టకష్టాలు
  • ఆదుకోవాలని వేడుకోలు

పదేండ్ల క్రితం భర్తతో కలిసి కూలిపనులు చేస్తూ తన ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగించేది మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన గంగరబోయిన సైదమ్మ. అంతలోనే అనారోగ్యంతో భర్త చనిపోవడం.. తన కూతురు మౌనికకు కంటిచూపు పోవడంతో కూలి పనులకు కూడా వెళ్లలేక పోయింది. గ్రామంలోనే మేకలు, గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తోంది. కంటిచూపు లేని బిడ్డతో తనకున్న పెంకుటింట్లోనే ఉంటోంది. ఇల్లు జీర్ణావస్థకు చేరి వర్షం వస్తే ఉండలేని పరిస్థితిలో ఏమి చేయాలో తోచక.. ప్రభుత్వం, దాతలు సహకారం అందించాలని కోరుతోంది.

మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన గంగరబోయిన సైదమ్మ, వెంకన్న దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. వెంకన్న పదేళ్లక్రితం అనారోగ్యంతో చనిపోగా కుటుంబ భారం మొత్తం సైదమ్మపై పడింది. కొంత కాలం పాటు కూలిపనులు చేస్తూ పిల్లలను చదివించింది. కానీ కూతురు మౌనికకు కంటిచూపు పోవడంతో ఆమె కష్టాలు మరింత పెరిగాయి. కూలిపనులకు కూడా వెళ్లలేక గ్రామంలోనే గొర్రెలు, మేకలు కాస్తూ జీవనం సాగిస్తోంది. కుమారుడు వివాహం చేసుకొని ఉపాధి కోసం వేరే గ్రామానికి వెళ్లిపోయాడు. మేకలు కాయడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబం గడవడమే కష్టంగా మారగా పెంకుటిల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి.. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో మూడు పూటలా తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం, దాతలు తమకు సాయం అందించి ఆదుకోవాలని తల్లీకూతుళ్లు వేడుకుంటున్నారు. logo