శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 16, 2020 , 02:50:56

ఆదర్శ సర్పంచ్‌

ఆదర్శ సర్పంచ్‌

  • పూరిగుడిసెలోనే నివాసం
  • జీవనోపాధికోసం కూలిపనులు
  • ప్రజాసేవకే అధిక సమయం కేటాయింపు
  • ఆదర్శంగా నిలుస్తున్న గార్లబాయిగూడెం సర్పంచ్‌ సరిత

రాజకీయాల్లో తిరుగుతుంటేనే కాలర్‌ ఎగరేస్తున్న రోజులివి. ప్రజాప్రతినిధిగా గెలిస్తే చాలు కారు నుంచి కాలు కింద పెట్టని నాయకులున్న సమాజమిది. కానీ ఓ గ్రామానికి సర్పంచ్‌గా ఉన్నా తన జీవనోపాధికోసం రోజూ కూలిపనులకు వెళ్తోంది. హంగూలు, ఆర్భాటాలకు దూరంగా తనకున్న పూరిగుడిసెలోనే జీవనం సాగిస్తోంది. ఉదయం సాయంత్రం గ్రామంలో ప్రజలమధ్యే తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది కట్టంగూర్‌ మండలం గార్లబాయిగూడెం సర్పంచ్‌ బోడ సరిత.

కట్టంగూర్‌ : మండలంలోని గార్లబాయిగూడెం గ్రామ సర్పంచ్‌ స్థానం ఈ సారి ఎస్సీలకు కేటాయించారు. దీంతో గ్రామానికి చెందిన బోడ సరిత టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేసి విజయం సాధించింది. పంచాయతీ ప్రథమ పౌరురాలుగా గౌరవమైన పదవిలో ఉన్నా గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పనులకు తోటి కూలీలతో కలిసి వెళ్తుంది. తనకు వ్యవసాయ భూమి లేకపోవడంతో గ్రామంలో ఇతరుల వద్ద 8 ఎకరాలను కౌలుకు తీసుకొని భర్తతో కలిసి పత్తి సాగు చేస్తోంది. ఉండడానికి పక్కా ఇల్లు కూడా లేదు. గతంలో నిర్మించుకున్న పూరి గుడిసెలోనే కుటుంబంతో కలిసి నివాసముంటోంది. తాను  సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా తనను గెలిపించిన ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తోంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్రామంలో తిరుగుతూ.. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తోంది. రాజకీయ అనుభవం లేకున్నా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారం, భర్త యాదగిరి సూచనలు, గ్రామస్తుల సలహాలతో గ్రామాభివృద్ధికి తోడ్పడుతోంది. 

గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి

అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నా. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులకు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నా. మాది నిరుపేద కుటుంబం. ఇల్లు లేకపోవడంతో పూరి గుడిసెలో ఉంటున్నం. ఆర్థికంగా లేకపోవడంతో ఇల్లుగడవాలంటే గ్రామస్తులతో కలిసి ఉపాధి, ఇతర కూలి పనులకు వెళ్తున్నా. నన్ను గెలిపించిన ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడడమే నా కర్తవ్యం.  

- బోడ సరిత, సర్పంచ్‌, గార్లబాయిగూడెం logo