శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 07, 2020 , 02:22:03

చిప్‌తో...చీటింగ్‌

చిప్‌తో...చీటింగ్‌

  • సూర్యాపేట జిల్లాలో పెట్రోల్‌ మోసాలు 
  • అర్ధరాత్రి ప్రత్యేక బృందాల తనిఖీ
  • జిల్లాలోని రెండు బంకులు సీజ్‌
  • కొరవడుతున్న సంబంధిత శాఖ అధికారుల నిఘా
  • గతంలో ఓ బంకు యజమానిని రక్షించే క్రమంలో అధికారి సస్పెండ్‌

పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు వినియోగదారులను మోసం చేసేందుకు రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బంకుల్లో ఉంచే సాధారణ చిప్‌ స్థానంలో ఇంటిగ్రేటెడ్‌ చిప్‌ అమర్చి..రీడింగ్‌ను సరిగా చూపుతూనే తక్కువ పెట్రోల్‌ వచ్చేలా చేస్తున్నారు. బంకుల్లో చిప్స్‌ అమర్చే ముఠాను శనివారం స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకొని విచారించగా.. సూర్యాపేట జిల్లాలోని రెండు బంకుల్లోనూ ఇలాంటి చిప్‌లు అమర్చినట్లు తేలింది. పోలీసులు వాటిపై దాడి చేసి చిప్‌లు, మదర్‌బోర్డులు స్వాధీనం చేసుకొని బంకులను సీజ్‌ చేశారు. 

సూర్యాపేటసిటీ : చిప్‌ అమర్చడంతో రీడింగ్‌ కరెక్టుగానే చూపిస్తూ 30మిల్లీ లీటర్ల ఆయిల్‌ తక్కువ  వచ్చేలా చిప్‌లకు సాఫ్ట్‌వేర్‌ పొందుపర్చి గోల్‌మాల్‌కు పాల్పడుతున్నారు. చిప్‌ అమర్చిన బంకుల్లో తెలంగాణలోని 11బంకులను జప్తు చేసినట్లు గురువారం రాత్రి సైబరాబాద్‌ సీపీ సజ్జానార్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, వీటిలో జిల్లాకు చెందిన రెండు పెట్రోల్‌బంకులు ఉండడం గమనార్హం. వీటి వివరాలు ఆదివారం ఆలస్యంగా వెలుగుచూశాయి. వీటిని జప్తు చేసినా జిల్లా అధికారులు తమకు తెలియదనడం విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలోనూ జిల్లాలో పలు బంకులపై వాహనదారులు ఫిర్యాదు చేసినా అధికారుల చర్యలు అంతంత మాత్రమే కావడంతో బంక్‌ నిర్వాహకులు రెచ్చిపోయి మోసాలకు పా ల్పడుతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నా రు. అంతేకాకుండా జిల్లాలో ఒక బంక్‌పై ఇదే ఫి ర్యాదు రాగా వారిని రక్షించడానికి జిల్లా తూనికలు, కొలతల అధికారే సహకరించి సస్పెండ్‌ అ యిన విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ విషయం మరువకముందే తాజాగా జిల్లాలోని బంకుల మోసాలు హైదరాబాద్‌ అధికారులు బయటపెట్టినా జిల్లా అధికారు లు ఏమి చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.   


జిల్లాలోని పెట్రోల్‌ బంకులు ఇవే.. 

హైదరాబాద్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ చిప్స్‌ చీటింగ్‌పై చేసిన తనిఖీలో  రాష్ట్ర వ్యాప్తంగా 11బంకులను జప్తు చేశారు. జప్తు చేసిన పె ట్రోల్‌ బంకుల్లో జిల్లాకు చెందినవి రెండు ఉ న్నట్లు ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవి జిల్లాలోని మేళ్లచెర్వుకు చెందిన బీపీసీఎల్‌ సాయిగణేశ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ కాగా, మరొకటి చిలుకూరుకు చెందిన హెచ్‌పీసీఎల్‌ బంక్‌ పరశురాం ఫిల్లింగ్‌ స్టేషన్‌. వీటిల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తనిఖీ చేసి ఇంటిగ్రేటెడ్‌ చిప్‌లు, మదర్‌బోర్డులు, కేబుల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి ఈ బృందాలు రెండు బంకులను సీజ్‌ చేయగా వీరితోపాటు నల్లగొండ బీపీసీఎల్‌ సేల్స్‌ ఆఫీసర్‌ ప్రీతంగుప్తా ఉన్నారు. కాగా, మేళ్లచెర్వు బంక్‌ నిర్వాహకులకు గతంలోనే అమ్మకాలు నిలిపివేసిన్నట్లు నియోజకవర్గ డీటీసీఎస్‌ రాజశేఖర్‌ తెలిపారు.

 అధికారుల నిఘా నామమాత్రమే 

వినియోగదారులను మాటల్లో పెట్టి పెట్రోల్‌ పంపుల వద్ద నిలువునా దోచేస్తున్నారు. కొలతల్లో మాయాజాలం, ఆయిల్‌లో ఇతరత్రా మిక్సింగ్‌లతో  వాహనదారులను నష్టపరుస్తున్నారు. మరికొన్ని బంకుల్లో పని చేసే ఫిల్లింగ్‌మెన్ల చేతివాటానికి వాహనదారులు మోసపోతున్నారు. జిల్లాలోని పలు బంకులపై  ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులు నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వినియోగదారులను మోసం చేస్తున్నట్లు ఆరోపణలున్నా అధికారులు తనిఖీలు చేయకపోవడం  విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ విషయమై జిల్లా తూనికలు, కొలతల అధికారిని వివరణ కోరగా.. తమకు సమాచారం లేదని, బంకులు సీజ్‌ చేసింది తాము కాదని, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ వారని చెప్పారు. 

 గతంలోనూ మోసాలు.. 

గతంలోనూ జిల్లాలోని పెట్రోల్‌బంకుల నిర్వాహకుల మోసాలపై పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు  హుజూర్‌నగర్‌లోని మఠంపల్లి రోడ్డులో గల ఓ పెట్రోల్‌బంక్‌పై తక్కువ ఆయిల్‌ పోస్తున్నారనే ఫిర్యాదు వచ్చింది. ఈ విషయమై అప్పటి తూనికలు, కొలతల అధికారి విచారణకు వెళ్లి సం బంధిత రికార్డులు, చిప్‌ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంక్‌ యాజమాన్యంతో కుమ్మక్కై రికార్డులను తగులబెట్టడానే ఆరోపణలతో సంబంధిత అధికారి సస్పెండ్‌ కావడమే కాకుండా కేసు నమోదై కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్‌లో ఓ బంకుపై ఫిర్యాదులు రాగా అప్పటి డీఎస్‌ఓ తనిఖీ చేశారు. అలాగే పలుచోట్ల అధికారులు దాడులు చేసినా చర్యలు అంతంత మాత్రమేననే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరు బంక్‌ నిర్వాహకుల మోసాలను సంబంధిత ఆయిల్‌ కంపెనీ సేల్స్‌ మేనేజర్స్‌కు చేరకుండా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌ అధికారులు  జిల్లాలోని రెండు బంకులను సీజ్‌ చేయడంతో జిల్లా అధికారుల పనితనానికి అద్దం పడుతున్నాయి.  

 మోసాలు ఇలా..  

జీరో రీడింగ్‌ నుంచి పెట్రోల్‌ ఫిల్లింగ్‌ ప్రారంభించినా రూ.100 పెట్రోల్‌ కొట్టిస్తే రూ.99నుంచి 99.45పెట్రోలే వస్తుంది. గమనించి ప్రశ్నించిన వినియోగదారుడికి అదనంగా పెట్రోల్‌ పోసి పంపిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. బాటిల్‌తో వచ్చిన వారికి ఒక పంపు వద్ద, బండ్లకు మరో పంపుపై ఇతర కెమికల్స్‌ కలిపి అమ్ముతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. 

జాగ్రత్తలు తప్పనిసరి..  

  1.   మీటర్‌ రీడింగ్‌ను 0 చూశాకే ట్యాంకు మూత తీయాలనే స్వీయ నిబంధన విధించుకోవాలి. 
  2.   కొట్టే సిబ్బంది మాటలను పట్టించుకోకుండా మీటర్‌ రీడింగ్‌పై దృష్టి ఉంచాలి. 
  3.   కూర్చొని సిబ్బందికి కార్డులు, డబ్బులిచ్చి, ట్యాంక్‌ ఫుల్‌ చేయమనే అలవాటు మానుకోవాలి. 
  4.   మాట్లాడుతూ రీడింగ్‌ చూడకుండా డబ్బు చెల్లించే పద్ధతికి స్వస్తి పలకాలి. 


logo