శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 06, 2020 , 00:03:49

ఊర్లు పోయాయి... పేర్లు మిగిలాయి

ఊర్లు పోయాయి... పేర్లు మిగిలాయి

  • నేటికీ దర్శనమిస్తున్న పురాతన కట్టడాలు 
  • శిథిలావస్థలో ఆలయాల ఆనవాళ్లు
  • రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్లలో పాత పేర్లు
  • ‘సూర్యాపేట’లోనే సగానికి పైన ‘బేచిరాగ్‌' మాదారం ..

వందల ఏండ్ల కిందటి పలు గ్రామాలు కాలగమనంలో కనుమరుగయ్యాయి. కానీ, ఆనాటి రాతి కట్టడాలు, ప్రజల ఆచార, సంప్రదాయాలను ప్రతిబింబించే నిర్మాణాలు, వారు వినియోగించిన సామగ్రి, శిథిలావస్థలోని ఆలయాలు నేటికీ సాక్షాత్కరిస్తున్నాయి. ఊరు ఆనవాళ్లున్నా.. నివాసాలు లేక ఉనికి కోల్పోయాయి. కానీ, ఊర్ల పేర్లు మాత్రం చిరస్థాయిలో నిలిచిపోయి ప్రజల నోళ్లల్లో నానుతున్నాయి. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఎన్నోకాలనీలు, నివాసాలు, స్థలాలు ఆనాటి ‘బేచిరాగ్‌ మాదారం’ పేరిట రిజిస్ట్రేషన్‌ అవుతుండడం విశేషం. ‘బేచిరాగ్‌' అనేది ఉర్దూ పదం కాగా తెలుగులో ‘దీపం వెలుగని’ అని అని అర్థం. సూర్యాపేట పరిసరాల్లో బేచిరాగ్‌ గ్రామాలు అనేకం ఉన్నాయి. సర్కిల్‌పేట పేరిట రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండగా సూర్యాపేట మండలం యండ్లపల్లి, బి.వెంకట్రాంపురం, టేకుమట్ల సమీపంలోని భూములు బి.దాచారం పేరిట రికార్డవుతున్నాయి.  ఈ నేపథ్యంలో నాటి ‘బేచిరాగ్‌' ప్రాంతాలపై ఆదివారం ప్రత్యేక కథనం.


సూర్యాపేట, నమస్తే తెలంగాణ : మద్రాసు చెన్నైగా, బొంబాయి ముంబైగా, భాగ్యనగరం హైదరాబాద్‌గా, ఇందూరు నిజామాబాద్‌గా మారిపోయాయి. అదేవిధంగా చాలా పట్టణాలు, గ్రామాలకు గతంలో ఉన్న పేర్లు మారిపోయి కొత్త పేర్లు వచ్చాయి. కానీ అసలు ఊరు ఉనికే లేకుండా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతున్న గ్రామాలుండడం విశేషం. ఊరి పేరుకు ముందు ‘బీ’అనే అక్షరం ఉంటుంది. ‘బీ’ అంటే ఉర్దూలో బేచిరాగ్‌ అని అర్థం. నిజాం కాలంలో దీపాలు పెట్టని ప్రాంతాన్ని బేచిరాగ్‌గా పిలుచుకొనేవారు. ఆనాటి రికార్డుల నుంచే గ్రామాలకు ముందు బేచిరాగ్‌ తగిలించి ఉన్నాయి. అలాంటి ‘బీ’ అక్షరంతో ప్రారంభమయ్యే గ్రామాలు జిల్లావ్యాప్తంగా రికార్డుల్లో చాలానే ఉండగా సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో నాలుగున్నాయి. వాటిలో సూర్యాపేట పట్టణంలో 70శాతం ప్రాంతం బేచిరాగ్‌ మాదారం పేరిట ఉన్నది. పెన్‌పహాడ్‌ మండలం అనాజీపురం, సూర్యాపేట మండలం తాళ్లకాంపాడు, కాసరబాద గ్రామాల మధ్యలో ఉన్న భూములు సర్కిల్‌పేట(ప్రస్తుతం ఈ పేరుతో ఊరు లేదు) పేరిట రిజిస్ట్రేషన్లున్నాయి. అలాగే సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామ సమీపంలోని భూములకు బి.వెంకట్రాంపురం పేరిట, ఇదే మండలం టేకుమట్ల సమీపంలోని భూములు బి.దాచారం పేర్లు ఉండగా ఈ రెండు గ్రామాలు కూడా నేడు లేవు. ఈ గ్రామాలన్నీ మూసీ నది ఒడ్డున ఉండగా సర్కిల్‌పేట వద్ద మాత్రం రికార్డుల్లో కాకుండా ప్రత్యక్షంగా పురాతన కట్టడాలు, ఇతరత్రా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కాగా వందలాది సంవత్సరాల కిందట సర్కిల్‌పేట గ్రామం ఉండగా ఆ ప్రాంతాన్ని నేడు పరిశీలిస్తే కాకతీయుల కాలంలో నిర్మించినట్లుగా రాతి నిర్మాణాల ఆనవాళ్లు, మరి కొన్ని ఔరంగాజేబు కాలంలో నిర్మించిన ప్రార్థనా మందిరాలుగా పేర్కొంటున్నారు. అంతేకాకుండా అక్కడ దుకాణాలుగా చెప్పుకునే గదులు, దేవతా విగ్రహాలు, రాతి రోళ్లు, రాయితో నిర్మించిన పునాదులు కనిపిస్తున్నాయి.

సూర్యాపేటలో బేచిరాగ్‌ మాదారం...

సూర్యాపేట పట్టణం అంటే జిల్లా కేంద్రంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా అందరికీ సుపరిచితం. అలాంటి సూర్యాపేట పట్టణంలో దాదాపు 70శాతానికి పైనే అసలు సూర్యాపేట కాదు దాని పేరు బేచిరాగ్‌ మాదారం అని తెలియని వారు ఉండరు. జాతీయ రహదారి సమీపంలోని ఎస్వీ డిగ్రీకళాశాల, పక్కన ఉన్న రోడ్డు నుంచి సద్దుల చెరువు కట్టమీదుగా పట్టణంలోని ఈద్గా... శంకర్‌ విలాస్‌సెంటర్‌, వాణిజ్యభవన్‌, రాఘవాప్లాజా వరకు ఉత్తరం వైపు ఉన్న పట్టణం మొత్తం బేచిరాగ్‌ మాదారమే. సద్దుల చెరువు, హైటెక్‌బస్టాండ్‌, విద్యానగర్‌, చర్చికాంపౌండ్‌, భజనతండా తదితర ప్రాంతాలన్నీ బేచిరాగ్‌ మాదారం పేరుతో రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. సూర్యాపేట పట్టణంగానే పిలుచుకుంటున్నప్పటికీ అసలు సూర్యాపేట కాని బేచిరాగ్‌ మాదారం పేరుతో ఉన్న ప్రాంతాల నుంచి ఇంటి పన్నుల రూపంలో ఏడాదికి రూ.3.5కోట్లకు పైనే ఆదాయం మున్సిపాలిటీకి వస్తుంది. అలాగే బేచిరాగ్‌ మాదారం పేరిట 2,194ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది.


బీ.దాచారం...

బీ.దాచారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి సమీపంలో ఉంది. ఇక్కడ కూడా పురాతన కాలంలో గ్రామం ఉన్నట్లుగా ఆనవాళ్లు కన్పించడం లేదు. సుమారు 965ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములు ఉండగా ఏటా ప్రభుత్వానికి రూ.80వేల రెవెన్యూ వస్తోంది. ఈ భూములు టేకుమట్ల గ్రామానికి చెందిన వారు సాగుచేస్తున్నారు.

సర్కిల్‌పేట...

బేచిరాగ్‌ మాత్రమే కాదు ఈ పేరు లేని కొన్ని గ్రామాలు కూడా నేడు మటుమాయమయ్యాయి. అందులో పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని అనాజీపురం సూర్యాపేట మండలం తాళ్లకాంపాడు, కాసరబాద గ్రామాలకు మద్యలో సర్కిల్‌పేట పేరు వినిపిస్తుంది. ఇక్కడ గతంలో గ్రామం ఉన్నట్లుగా ఆనవాళ్లున్నాయి. ముస్లిం, హిందువుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ముస్లింల ప్రార్థన కోసం ఏర్పాటు చేసిన ఈద్గా ఉంది. ఇది 400ఏళ్ల కితం ఔరంగాజేబు హయాంలో నిర్మించినదిగా ప్రచారంలో ఉంది. దీనికి కిలోమీటరు దూరంలో సన్యాసి మఠం ఉంది. అక్కడ ఆంజనేయస్వామి దేవాలయం ఉన్నట్లుగా ప్రహరీ దాని చుట్టూ పునాది కన్పిస్తుంది. వినాయకుడి విగ్రహం ఉండగా రైతులు ఇప్పటికీ పంటలు వేసే సమయంలో, పంటలు చేతికి వచ్చిన సమయంలో పూజలు చేస్తుండడం విశేషం. ఇక్కడ నివసించిన ప్రజలు వాడిన రోళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడి భూములను కాసరబాద ప్రజలు సాగు చేస్తున్నారు. అంతే కాకుండా ఈద్గా నుంచి దూర ప్రాంతానికి వెళ్లేందుకు ఓ సొరంగ మార్గం ఉందనే ప్రచారం జరుగుతుండగా సొరంగం ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దాని పక్కనే దుకానాల కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. సన్యాసి మఠం పక్కనే రామాలయం ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. దర్గావద్ద ప్రతి శుక్రవారం కుందూరు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.

బి.వెంకట్రాంపురం...

సూర్యాపేట మండల పరిధిలోని యండ్లపల్లి గ్రామానికి సమీపంలో బేచిరాగ్‌ వెంకట్రాంపురం(బి.వెంకట్రాంపురం) పేరుతో భూములున్నాయి. కానీ, గ్రామ ఆనవాళ్లు ఏమాత్రం కన్పించడం లేదు కాకతీయుల కాలంలోని చిన్న గ్రామాల్లో బి.వెంకట్రాంపురం ఒకటి అని తెలుస్తుంది. ఇక్కడ 1,150ఎకరాల విస్తీర్ణంలో భూములున్నప్పటికీ జనావాసం లేదు. రికార్డుల్లో మాత్రం యండ్లపల్లి సమీపంలో బీ వెంకట్రాంపురం గ్రామం నమోదై ఉంది. ప్రభుత్వానికి ఈ గ్రామం నుంచి సుమారు రూ.20వేల రెవెన్యూ వస్తోంది. ఈ గ్రామంలోని భూములను సమీపంలోని యండ్లపల్లికి చెందిన గ్రామస్తులు సాగుచేస్తున్నారు.


logo