మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 31, 2020 , 02:08:56

చివరి దశలో నాట్లు

 చివరి దశలో నాట్లు

  • సాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో సాగుపనులు ముమ్మరం
  •  కాల్వకు ముందస్తుగా నీటి విడుదల..
  • వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుకు ఊతం
  • ఇప్పటికే 2.60లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు తెలంగాణ ప్రభుత్వం ఈ సారి ముందస్తుగానే నీటిని విడుదల చేసింది. దీనికి తోడు వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో సాగుకు అనుకూల వాతావరణం నెలకొంది. ఫలితంగా ఎన్నెస్పీ ఆయకట్టులో వరినాట్లు ఊపందుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. నీరు వదిలిన 20 రోజుల్లోనే 2.60 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. మరో వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.

ఆయకట్టులో వరి నాట్లు ఇలా..

జిల్లా      ఆయకట్టు       నాట్లు 

ఎకరాల్లో పూర్తయినవి 

నల్లగొండ    1,61,000    1,00,000

సూర్యాపేట  2,19,000    1,60,000

మొత్తం       3,80,000    260,000

అల్పపీడనంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో రైతులు వరి నాట్లు వేసే పనుల్లో బిజీ ఆయ్యారు. వర్షాలు కురుస్తుండడంతో దుక్కుల్లో నీరు నిలిచింది. కాల్వల్లో సైతం నీళ్లు పుష్కలంగా రావడంతో రైతులు నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. 

 ముమ్మరంగా వరి నాట్లు

ఎన్‌ఎస్పీ అధికారులు కెపాసిటీ మేరకు ఎడమ కాల్వ ద్వారా మేజర్లు, మైనర్లకు నీరు వదిలారు. రైతులు ముందస్తుగానే నార్లు సైతం పోశారు. కాల్వ నీళ్లకు వర్షం తోడు కావడంతో పొలాలు ముందస్తుగానే తడిచాయి.  దీంతో   రైతులు అనుకున్నదాని కంటే కాస్త ముందుగానే వరినాట్లు  వేస్తున్నారు.  

 2.60లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి...

సాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.80 లక్షల ఎకరాలుండగా.. కాల్వకు నీరు వదిలిన 20 రోజుల్లోనే 2.60లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేశారు. నల్లగొండ జిల్లాలో లక్ష ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 1.60లక్షల వేల ఎకరాల్లో ఇప్పటి వరకు వరినాట్లు పూర్తి చేశారు. నారుమళ్లు సిద్ధంగా ఉంచడంతో కలిసొచ్చింది. మరో 15రోజుల్లో ఆయకట్టులో నూరు శా తం వరినాట్లు పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. 

కాల్వలకు సరిపడా నీటిని విడుదల చేశాం

ఈ నెల 7న సాగర్‌ ఎడమకాల్వకు సాగునీటిని విడుదల చేశాం. ప్రధానకాల్వకు, మేజరు, మైనరు కాల్వలకు సరిపడా నీటి విడుదల చేస్తున్నాం. వరుణుడు సైతం కరుణించడంతో  రైతులు అనుకున్నదానికంటే ముందుగానే దుక్కులు తడుపుకుని నాట్లు వేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆయకట్టులో సుమారు 2 లక్షల 60 వేల ఎకరాలు వరినాట్లు పూర్త య్యాయి. మరో పదిహేను రోజుల్లో నూరు శాతం పూర్తికావొచ్చు. మేజరుకాల్వలకు సరిపడా నీటి విడుదల చేస్తున్నాం. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి.

- విజయభాస్కర్‌, ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ, మిర్యాలగూడlogo