మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 31, 2020 , 01:54:20

మధ్యాహ్నం మరింత రుచికరం

మధ్యాహ్నం మరింత రుచికరం

  •  మధ్యాహ్నభోజనం ధర పెంచిన ప్రభుత్వం 
  • పీఎస్‌ విద్యార్థికి రూ. 0.49..  ఉన్నత పాఠశాల వారికి రూ. 0.74 పెంపు 
  • కోడి గుడ్డుకు అదనంగా రూ.2 చెల్లింపు  
  • ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచే వర్తింపు  
  • సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో 1,51,740 మందికి లబ్ధి 

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే సన్నబియ్యంతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న సర్కారు.. పెరిగిన ధరలతో ఏజెన్సీల నిర్వాహకులు ఇబ్బందులు పడవద్దని గత సంవత్సరమే ధరలు పెంచింది. బడి పిల్లలకు మరింత రుచికరమైన భోజనం అందించేందుకు వీలుగా విద్యార్థులకు చెల్లిస్తున్న ధరను మరోమారు పెంచింది. దీంతో పాటు కోడి గుడ్డుకు సైతం రూ. 2 అదనంగా చెల్లించనుంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచే పెంచిన ధరలు వర్తించనుండడంతో ఏజెన్సీల నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 1,51,740 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.  

పెరిగిన ధరలు ఇలా

తరగతి         పాతధర              కొత్త ధర
1నుంచి5    రూ.4.48     రూ.4.97
6నుంచి10  రూ.6.71     రూ.7.45
కోడి గుడ్డుకు అదనంగా రూ.2


నల్లగొండ విద్యావిభాగం/ హుజూర్‌నగర్‌ :  అర్ధాకలితో ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్‌ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. సన్నబియ్యంతో ఎంతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో వంట ఏజెన్సీలు కొంత ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరమే ఏజెన్సీలకు ధరలు పెంచిన ప్రభుత్వం ప్రస్తుతం కోడిగుడ్డుకు రూ.2 అదనంగా చెల్లించనున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలు కూడా ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచే వర్తించేలా జీఓలో స్పష్టంచేశారు. దీంతో నల్లగొండ, సూర్యాపేటజిల్లాల వ్యాప్తంగా ఏజెన్సీల్లో హర్షం వ్యక్తమవుతోంది. మొత్తం రెండుజిల్లాలో 2,271 ప్రభుత్వ పాఠశాలల్లోని 1,51,740 విద్యార్థులకు మేలు చేకూరనుంది. 

 మధ్యాహ్న భోజనం ధరలను ప్రభుత్వం పెంచుతూ జీఓ జారీచేసింది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 49పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 74పైసలతోపాటు కోడిగుడ్డుకు అదనంగా రూ. 2 అందించనున్నారు. కాగా మధ్యాహ్న భోజనం అందించే ఏజెన్సీలకు గతంలో ప్రభుత్వం 1నుంచి 5వ తరగతి వరకు ఒక విద్యార్థికి రోజుకు రూ.4.48 పైసలు చెల్లించేది. అయితే ప్రస్తుతం పెంచిన ధరతో రూ.4.97పైసలకు చేరింది. అదేవిధంగా 6నుంచి 10వ తరగతి(ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల) చదువుతున్న విద్యార్థులకు ఒక్కోక్కరికి రూ.6.71పైసలు చెల్లించేది. ప్రస్తుతం పెరిగిన ధరతో రూ.7.45కి చేరింది. దీంతో ఏజెన్సీలు తమకు మెనూలో చూపించిన విధంగా కూరగాయలు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాలను తెచ్చి ఇవ్వనున్నారు. అంతేకాకుండా పెరిగిన ధరలు తమకు ఊరట కలిగించాయని ఏజెన్సీల నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. 

మూడురోజులు గుడ్డు..

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా ఎంపీపీఎస్‌, జడ్పీ, ప్రభుత్వ, మోడల్‌, ఎయిడెడ్‌ విభాగాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత కలిపి మొత్తం 2,271 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,51,740 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి పెరిగిన ధరలతో మరింత రుచికరమైన భోజనం అందనుంది. అంతేగాకుండా మెనూలో చూపిన విధంగా వారంలో 3రోజులు గుడ్లు సైతం ఇవ్వనున్నారు. 

సన్నబియ్యంతో భోజనం...

తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌ సంకల్పంతో హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి రేషన్‌ దుకాణాల్లో అందజేసే   బియ్యంతో వండి విద్యార్థులకు అందించేవారు. దాన్ని తినలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన తెలంగాణ సర్కార్‌ సన్నబియ్యంతో భోజనం అందిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద, మధ్య తరగతి పిల్లలకు పౌష్టికాహారం అందుతుంది. రుచికర భోజనం అందుతుండటంతో తల్లిదండ్రులు, పిల్లలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

     నల్లగొండ జిల్లా     సూర్యాపేట జిల్లా 

యాజమాన్యం పాఠశాలలు విద్యార్థులు పాఠశాలలు విద్యార్థులు 


ప్రభుత్వ 60 4,475 32 2,764

ఎంపీపీ, జడ్పీ 1,423 72,808 658 50,762

మోడల్‌ 17 6,325 09 5,603

ఎయిడెడ్‌ 61 6,429 11 2,574

మొత్తం 1,561 90,037 710 61,703


రోజువారి మెనూ ఇదే..

వారం అందించాల్సిన ఆహారం 


సోమ గుడ్డు, కూరగాయలు, చారు

మంగళ పప్పు, చారు

బుధ గుడ్డు, కూరగాయలు, చారు

గురు పప్పు, చారు

శుక్ర గుడ్డు, కూరగాయలు, చారు

శని పప్పు, చారు

చాలా సంతోషంగా ఉంది.. .. 

ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ధరలను పెంచడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇస్తున్న డబ్బులతో పెరిగిన ధరలకనుగుణంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చి వండలేకపోయాం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 0.49పైసలు,  6నుంచి 10 చదివే పిల్లలకు ఒక్కొక్కరికి రూ.0.74 పైసలు గతంలో ఇచ్చేదాని కంటే అదనంగా పెంచిందని చెప్పారు. ఇది మాకు ఊరట కలిగిస్తోంది. 

             - గోసంగి చంద్రకళ, వంట ఏజెన్సీ  నిర్వాహకురాలు, జడ్పీహెచ్‌ఎస్‌, గుడిపల్లి


logo