సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 30, 2020 , 03:07:01

ఆన్‌లైన్‌ తరగతులకు ఏర్పాట్లు చేయాలి

 ఆన్‌లైన్‌ తరగతులకు ఏర్పాట్లు చేయాలి

  •  జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి
  • l  టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష

సూర్యాపేట అర్బన్‌ : ప్రభుత్వం నిర్ణయం మేరకు సెప్టెంబర్‌ 1నుంచి నిర్వహించనున్న ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి ఏర్పాట్లపై సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి శనివారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షణలో పాఠశాలలను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ ఉపకరణాలు అందుబాటులో లేని విద్యార్థులకు గ్రామపంచాయతీల్లో టీవీలను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలను మున్సిపల్‌, గ్రామపంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు. జిల్లాలోని అన్ని డీటీహెచ్‌ సేవలు అందించేవారు టీశాట్‌(విద్య, నిపుణ ఛానల్స్‌), దూరదర్శన్‌ ద్వారా షెడ్యూల్‌ ప్రకారం ప్రసారం అయ్యేలా చూడాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయం సహాయక సంఘాలు,

అంగన్‌వాడీ టీచర్ల ద్వారా సమాచారం అందించి తరగతులకు అవసరమైన ఉపకరణాలు సిద్ధం చేసుకునేలా సహకారం అందించాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమాధికారులు, రీజినల్‌ కో ఆర్డినేటర్లు, గురుకుల పాఠశాలల వారు హాస్టల్‌ సిబ్బందితో హాస్టల్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు అందేలా చూడాలన్నారు. గ్రామ, మండలస్థాయి అధికారులు, సిబ్బంది ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థుల హాజరు, విద్యాభ్యాసం వివరాలను అందించాలని కోరారు. వాటితోపాటు అభ్యసనంలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా తల్లిదండ్రులకు  ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా జిల్లా పౌరసంబంధాల అధికారి చర్యలు తీసుకోవాలని సూచించారు.


logo