శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 29, 2020 , 05:07:48

లాక్‌డౌన్‌ మాటున..బాల్య వివివాహాలు

లాక్‌డౌన్‌ మాటున..బాల్య వివివాహాలు

  • కలిసి వచ్చిన కరోనా నిబంధనలు
  •  వివాహానికి ఇరు కుటుంబ  సభ్యులే   హాజరు
  • అధికారుల దృష్టికి రానివి మరెన్నో  పెళ్లిళ్లువాహాలు 

సూర్యాపేట : సమాజంలో అనేక సంస్కరణలు, మార్పులు వస్తున్నా యథేచ్ఛగా బాల్య వివాహాలు చేస్తూ ఆడ పిల్లల బాల్యాన్ని కన్న తల్లిదండ్రులే చిదిమేస్తున్నారు. బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయి-18, అబ్బాయి-21 ఏళ్ల లోపు వివాహం చేస్తే చట్ట రీత్యా నేరమని.. పెళ్లి చేసిన వారికి ఏడాది జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయినా బాల్య వివాహాలు ఆగడం లేదు. కరోనా మహ మ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ పెట్టి వైరస్‌ను అదుపు చేయాలని చూస్తే ఆడపిల్లల తల్లిదండ్రులు మాత్రం ఆ వైరస్‌ కన్న భయంకరంగా ఆలోచించి కన్న బిడ్డలను బాల్యాన్ని బలి పెడుతున్నారు. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 43 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. అందులో నల్లగొండలో 24, సూర్యాపేటలో 19   ఉన్నాయి. ఈ నాలుగు నెలల కాలంలో ఆషాడమాసంలో వివాహాలు ఉం డవు. అంటే కేవలం మూడు నెలల్లోనే 43 వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. కరోనా సమయంలో అధికారులకు వచ్చిన సమాచారం ప్రకారమే ఇన్ని ఉంటే అధికారులకు తెలియకుండా గుళ్లలో, వ్యవసాయ క్షేత్రాల్లో, ఇరు కుటుంబాల మధ్య జరిగిన వివాహాలు ఇంక ఎన్ని ఉన్నాయో అనే అనుమానం తలెత్తుతోంది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సుమారు 10 వివాహాలు, సూర్యాపేట నియోజకవర్గంలో 8 వివాహాలను అడ్డుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో సైతం 5 నుంచి 8 వివాహాలను అడ్డుకున్నారు. బాల్యవివాహాలు అడ్డుకునేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఉన్నా,ఒక్కొక్క కమిటీలో 14 మంది సభ్యులు ఉన్నా వివాహాలు జరగడంపై వాటి పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. కమిటీల సమావేశాలు అరుదుగా జరుగుతుండడం, కమిటీ సభ్యులు తమకు పట్టనట్లుగా వ్యవహరించడం వల్ల ఈ సమస్యలు తలెతున్నాయి.  

సంక్షేమ పథకాలు ఉన్నా..మారని తీరు 

ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు భారం కావొద్దని సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టింది. పథకం ప్రారంభంలో రూ. 51,000 ఆతరువాత రూ. 75,116 చొప్పున అందించింది. 2018 ఎన్నికల తరువాత రూ.1,00,116 అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చే స్తోంది.  ఆ నగదు సైతం తల్లి పేరుమీదనే ఇస్తున్నారు. అయినా ఆడపిల్లల తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. అమ్మాయి పెళ్లి చేస్తే భారం తగ్గుతుందనే అపోహతో బాల్యవివాహాలు చేస్తున్నారు.  

సమాచారమివ్వాల్సింది వీరికే..

మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా బాల్య వివాహం అవుతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే 100, 181, 1098 నెంబర్లకు ఫోన్‌ చేసి చెప్పాలి. లేదా అంగన్‌వాడీ టీచర్‌, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పోలీస్‌, సీడీపీఓ, తాసిల్దార్‌, ఆర్డీఓ, కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేయడం లేదా ఫోన్‌ ద్వారా సమాచారమందించి బాల్య వివాహాలను అడ్డుకోవచ్చు.. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం 

బాల్య వివాహాలను చేయడం చట్టరీత్యా నేరం.. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే సమాచారం అందించండి. వారి పేరును ఎక్కడ బయటకు చెప్పడం జరగదు. 100, 181, 1098 నెంబర్లకు ఫోన్‌ చేసి చెప్పాలి. జిల్లాలో కరోనా సమయంలో బాల్య వివాహాలు చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికీ 19 వివాహాలను అడ్డుకున్నాం. ఇంకా తెలియకుండా వివాహం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేస్తాం. 

  - నర్సింహారావు, మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల జిల్లా సంక్షేమ అధికారి సూర్యాపేట


logo