సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 27, 2020 , 07:04:18

సూర్యాపేట జిల్లాలో సాగు విస్తీర్ణం 4,53,200 ఎకరాలు

సూర్యాపేట జిల్లాలో  సాగు విస్తీర్ణం 4,53,200 ఎకరాలు

  •   కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి

బొడ్రాయిబజార్‌ : సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే 4,53,200 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పూర్తయిందని, సాగర్‌ ఆయకట్టు కింద వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం 2019తో పోల్చితే ఈ సంవత్సరం లక్ష ఎకరాల వరకు విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రధానంగా ఎరువులు అవసరమయ్యే వరి, పత్తి పంటలే 4లక్షల ఎకరాలు సాగైందన్నారు.

ఈ పరిస్థితుల్లో రైతులకు అవసరమయ్యే అన్ని ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. యూరియా అవసరం పెరగనున్నందున అవసరం మేరకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ వానకాలంలో అవసరమైన మొత్తం ఎరువులు ఒకేరోజు కాకుండా విడుతల వారిగా సరఫరా అవుతున్నాయని తెలిపారు. అతిగా యూరియా వాడితే భూసారం దెబ్బతినడమే కాకుండా పంటలకు రోగాలు పెరిగి దిగుబడి తగ్గిపోతుందన్నారు. రైతులు విధిగా అవసరం మేరకే కొనుగోలు చేయాలని దీంతో ప్రతి రైతుకు ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. కరోనా నేపథ్యంలో రైతులు షాపుల వద్ద గుమ్మిగూడకుండా ఉండేందుకు ఏప్రిల్‌, మే నెలల నుంచి వ్యవసాయశాఖ యూరియాను ముందస్తుగానే సరఫరా చేసినట్లు గుర్తుచేశారు.

ప్రస్తుతం అనుకూలమైన వర్షపాతం, వాతావరణం ఉన్నందున పంటలకు యూరియా వేయడం ఒకటి రెండురోజులు ఆలస్యమైనా దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఆరుతడి పంటలైన పత్తి, కూరగాయలు మొదలైన వాటికి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు యూరియా వేయాలన్నారు. కరోనా విజృంభిస్తున్నందున రైతులు నేరుగా డబ్బులు చెల్లించకుండా డిజిటల్‌ పేమెంట్‌ ఉపయోగించాలన్నారు. పీఓస్‌ మెషిన్‌ ద్వారా ఎరువులు కొనుగోలు చేసేందుకు ఆధార్‌తోపాటు ఓటరు ఐడీ కార్డు, పాన్‌కార్డు విధిగా తీసుకొని రావాలని రైతులకు సూచించారు.


logo