మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 27, 2020 , 07:04:50

అవాంతరాలెన్నెదురైనా.. అభివృద్ధి ఆగదు

అవాంతరాలెన్నెదురైనా.. అభివృద్ధి ఆగదు

  • ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం
  • కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగిస్తున్నం 
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

‘అవాంతరాలెన్నెదురైనా అభివృద్ధి ఏమాత్రం ఆగదు..ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా మరింత ముందుకు సాగుతాం.  కష్ట కాలంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను  కొనసాగిస్తున్నాం’ అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన..  తిరుమలగిరి(ఎస్‌) మండలాల్లో 643 మంది లబ్ధిదారులకు రూ.6.39 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.

- సూర్యాపేట టౌన్‌


సూర్యాపేట టౌన్‌ : కరోనా కష్టకాలంతోపాటు అవేమీ పట్టని విపక్షాలు చేస్తున్న అర్థం లేని విమర్శలను తిప్పికొడతాం. ఇలాంటి అవాంతరాలు ఎన్ని ఎదురైనా అభివృద్ధి ఆగదు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా మరింత ముందుకు సాగుతాం అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి   సూర్యాపేట, ఆత్మకూర్‌(ఎస్‌)మండలాలకు చెందిన లబ్ధిదారులు 643మందికి సుమారు రూ.6.39కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులతోపాటు 80మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 31.55లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

గడిచిన 60 ఏళ్ల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ కేవలం ఆరేళ్లలోనే గత ప్రభుత్వాలకు భిన్నంగా, రాజకీయాలకతీతంగా పాలన కొనసాగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పనులు కొనసాగించుకోవాలన్నారు. కరోనాకు భయపడేది లేదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామన్నారు.  కార్యక్రమంలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, వైస్‌ ఎంపీపీ నేరెళ్ల వెంకన్న, బొల్లె జానయ్య, ఎంపీటీసీ ముత్తయ్య, సర్పంచ్‌ దావీద్‌, కౌన్సిలర్‌ బాషా తదితరలు పాల్గొన్నారు. 

సుందర్‌నాయక్‌ కుటుంబానికి పరామర్శ   

చివ్వెంల : శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల ప్రాణత్యాగం వెలకట్ట లేనిదని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన జగన్‌తండాకు చెందిన ఏఈ సుందర్‌నాయక్‌ కుటుంబ సభ్యులను మంత్రి బుధవారం పరామర్శించారు. సుందర్‌నాయక్‌ భార్య ప్రమీల, పిల్లలు సుహస్వి, నిహస్వి, తల్లిదండ్రులు నాగేశ్వర్‌రావు, కమలమ్మలతో మాట్లాడిన మంత్రి వారికి ధైర్యం చెప్పి ప్రగాఢ సంతాపం తెలిపారు. అన్నివిధాలా అండగా ఉంటామని తెలుపడంతోపాటు అదే శాఖలో సుందర్‌నాయక్‌ భార్య కోరుకున్న చోట ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

పిల్లల చదువు దృష్ట్యా హైదరాబాద్‌లో ఉద్యోగం కావాలని మంత్రిని కోరగా అందుకు మంత్రి సరేనని హామీ ఇచ్చారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఆగమేఘాల మీద ప్రమాదస్థలికి చేరుకొని ఉద్యోగుల ప్రాణాలు కాపాడటానికి మంత్రి ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఈ సందర్భంగా సుందర్‌నాయక్‌ కుటుంబ సభ్యులు కొనియాడారు.  అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, తాసిల్దార్‌ పి.సైదులు, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీపీ ధరావత్‌ కుమారిబాబునాయక్‌, జడ్పీటీసీ భూక్యా సంజీవనాయక్‌, సర్పంచ్‌ ధరావత్‌ జ్యోతిరవీందర్‌, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, బాషా, శిరీష పాల్గొన్నారు. logo