సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 21, 2020 , 01:54:02

నేడు నాగార్జున సాగర్‌ క్రస్టుగేట్ల ఎత్తివేత

  నేడు నాగార్జున సాగర్‌  క్రస్టుగేట్ల ఎత్తివేత

  • నీటిని విడుదల చేయనున్న విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి 
  • 576.50 అడుగులకు నీటిమట్టం 
  • 2,58,425 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  

కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. శ్రీశైలం క్రస్టుగేట్ల ద్వారా 2.58 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌ రిజర్వాయర్‌కు చేరుతోంది. ఇప్పటికే సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువకాగా, వరదకు అనుగుణంగా నేడు క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరై నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించారు. పర్యాటకులకు ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు.

    నందికొండ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నేడు క్రస్టుగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద వస్తుండడంతో 10క్రస్టుగేట్లను పది అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు 2,58,425క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. క్రస్టుగేట్ల ద్వారా నీరు విడుదల చేయనున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. శ్రీశైలం నుంచి వరద ఇలాగే కొనసాగితే రెండ్రోజుల్లో సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312టీఎంసీలకు చేరనున్నది. వరద భారీగా వస్తుండడంతో డ్యాం భద్రత దృష్ట్యా  క్రస్టుగేట్ల ద్వారా నేడు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 4,43,926కూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తుండడంతో నీటిని  విడుదల చేస్తున్నారు. బుధవారం సాగర్‌ నీటిమట్టం 571.80అడుగులు ఉండగా గురువారం సాయంత్రానికి 576.50 అడుగులకు చేరింది. ఒక్కరోజులోనే 5అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. 272.9955 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 25,830 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 2712 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ 883.80 అడుగులకు చేరి 208.7210 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది. 

 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఈ  

శ్రీశైలం క్రస్టుగేట్ల ద్వారా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు వరద వచ్చి చేరుతుండడంతో క్రమంగా పూర్తిస్థాయికి చేరుతుంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం నేడు డ్యాం క్రస్టుగేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు, చేపల వేటకు వెళ్లే జాలర్లు, ఆలయ పూజారులు అప్రమత్తంగా ఉండాలి. పర్యాటకుల సందర్శనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.   

4గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల 

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు 4క్రస్టుగేట్ల ద్వారా గురువారం నీటి విడుదల కొనసాగింది. మూడు రోజుల నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతూ వస్తున్నా గురువారం ఉదయం 5,455క్యూసెక్కులుగా ఉన్న వరద సాయంత్రానికి 12,310 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఉదయం ప్రాజెక్టు 4గేట్ల నుంచి 5455 క్యూసెక్కులు, సాయంత్రం 5420 క్యూసెక్కులను దిగువకు వదిలారు. 285 క్యూసెక్కుల నీటిని కాల్వలకు వదులుతుండగా 50క్యూసెక్కులు ఆవిరవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులకు(4.46 టీఎంసీలు)ప్రస్తుతం 643.10 అడుగుల(3.97 టీఎంసీలు)వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు. ఐదు రోజులుగా 3టీఎంసీల నీటిని దిగువకు వదిలినట్లు  వెల్లడించారు.  

29అడుగులకు డిండి ప్రాజెక్టు.. 

డిండి : డిండి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36అడుగులకు గురువారం సాయంత్రానికి 29అడుగులకు చేరింది.  దుందుభి నది నుంచి 1900క్యూసెక్కుల వరద  వస్తుండగా ప్రధాన కాల్వకు 250క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 2.45టీఎంసీలకు ప్రస్తుతం 1.5టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.   


logo