గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Aug 19, 2020 , 03:30:33

మార్కెట్ల ఆదాయానికి మరో మార్గం

మార్కెట్ల ఆదాయానికి  మరో మార్గం

నల్లగొండ/సూర్యాపేట అర్బన్‌ : ‘చెక్‌ పోస్టుల్లో, ప్రైవేట్‌ పరిశ్రమల్లో క్రయ, విక్రయాల నేపథ్యంలో మార్కెట్‌ ఫీజు వసూలు చేయొద్దు’ అని జూన్‌ 6న కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖకు ఓ పిడుగులాంటి ఆర్డినెన్స్‌  చేసింది. దీంతో రెండు నెలలుగా ఆ శాఖ భవితవ్యం ప్రశ్నార్థకం కాగా.. ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ శాఖకు తీపి కబురు అందించింది. ఈ వానకాలం సీజన్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ నెల 7న జీఓ జారీ చేసింది. దీంతో మార్కెట్‌ వర్గాల్లో తిరిగి నూతనోత్సాహం నెలకొంది. నల్లగొండ జిల్లాలో  సూర్యాపేట జిల్లాలో  వ్యవసాయ మార్కెట్ల ద్వారా మార్కెటింగ్‌ శాఖకు క్రయవిక్రయాలు, ఫీజుల రూపంలో సుమారు రూ.42 కోట్ల ఆదాయం సమకూరుతుండగా.. కేంద్రం ఆర్డినెన్స్‌తో కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో మరో మార్గం ద్వారా ఆదాయం పొందే అవకాశం వచ్చింది.  

రైతు పండించిన పంటకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ఆ పంటకు డిమాండ్‌ లేని సమయంలో నిల్వ చేసి గిరాకీ ఉన్నప్పుడు రైతుకు విక్రయించి పెట్టాల్సిన బాధ్యత మార్కెటింగ్‌ శాఖది. ఈ క్రమంలో ఆ పంట కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి ఒక శాతం సెస్‌ రూపంలో ఫీజు వసూలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థలు జిల్లాలో ఎక్కడ ఏ ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పటికీ ఈ శాఖకు ఒక శాతం ఫీజు చెల్లించాల్సిందే. ఎవరైనా క్రయ విక్రయాలు అక్రమంగా జరిపి ఆ ఉత్పత్తులను బయటకు తరలిస్తే.. ఆ శాఖ పరిధిలో ఏర్పాటు చేసిన మార్కెట్‌ చెక్‌ పోస్టుల్లో నిఘా ఏర్పాటు చేసి ఫీజు వసూలు చేస్తారు. ఈ తరహాలో జిల్లా మార్కెటింగ్‌ శాఖకు చెక్‌ పోస్టుల ద్వారా, రైస్‌ ఇండస్ట్రీస్‌, జిన్నింగ్‌, పప్పు మిల్లుల ద్వారా ఏటా రూ.5 కోట్ల ఆదాయం వస్తోంది. దీనితోనే జిల్లాలో ఉన్న 10 వ్యవసాయ మార్కెట్లలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు సమకూరుతాయి. అయితే.. కేంద్రం ఈ ఏడాది జూన్‌లో ఓ ఆర్డినెన్స్‌ జారీ చేసి జిల్లాలో ఎక్కడ వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరిగినా ఫీజు వసూలు చేయొద్దని తెలిపింది. దీంతో  శాఖ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి తమ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని ప్రత్యామ్నాయం చూపింది.

మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు

జిల్లా వ్యాప్తంగా వానకాలం, యాసంగి  పండిన పంటలను ప్రభుత్వమే రైతులకు మద్దతు ధర  కొనుగోలు చేస్తోంది. ఈ పంట ఉత్పత్తులను ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలైన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఐకేపీ, సహకార శాఖ పరిధిలోని పీఏసీఎస్‌లతోపాటు ఎన్‌డీసీఎంఎస్‌లు కొనుగోలు  ఆదాయాన్ని సముపార్జిస్తున్నాయి. అయితే.. ఈ వానకాలం సీజన్‌ నుంచి వీటి సరసన మార్కెటింగ్‌ శాఖ సైతం చేరనుంది. ఈ సీజన్‌ నుంచి జిల్లాలోని అన్ని మార్కెటింగ్‌ శాఖలకు సంబంధించిన కార్యాలయాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న జీవో జారీ చేస్తూ శుభవార్త అందించింది. ఇప్పటికే ఆ శాఖ ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రతి సీజన్‌లోనూ ఉత్పత్తుల కొనుగోళ్లకు కావాల్సిన టార్పాలిన్లు, పురికోసలు, తేమ యంత్రాలు, వెయింగ్‌ మిషన్లు అందజేస్తుండగా తాజాగా సర్కార్‌ నిర్ణయంతో కొనుగోలు అవకాశం సైతం వచ్చింది. ఈ శాఖకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 10 వ్యవసాయ మార్కెట్లతోపాటు 12 సబ్‌ యార్డులు, మరో ఆరు మండల స్థాయి గోడౌన్‌లు ఉన్నాయి. ఆయా మార్కెట్లలో ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నందున ఈ 28 కేంద్రాల ద్వారా ఈ వానకాలం సీజన్‌ నుంచే కొనుగోళ్లు  సిద్ధమవుతున్నారు.

ఆర్డినెన్స్‌తో ప్రశ్నార్థకమైన మార్కెట్ల భవితవ్యం

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ లేదా ప్రైవేట్‌ పరిశ్రమలు, వ్యాపారులు ఎక్కడ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పటికీ మార్కెటింగ్‌ శాఖకు ఒక శాతం ఫీజు చెల్లించాలి. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ శాఖకు సుమారు రూ.26 నుంచి రూ.28 కోట్ల దాకా ఆదాయం వస్తోంది. సూర్యాపేట జిల్లాకు రూ.12 నుంచి రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు తప్పనిసరిగా ఫీజు చెల్లిస్తాయి. ప్రైవేట్‌ వ్యాపారులే ఫీజు ఎగవేత ధోరణి అవలంబిస్తారు. జిల్లాలో చిన్నా చితకా రైస్‌ మిల్లులతో కలిపి మొత్తంగా సుమారు 300 దాకా ఉండగా 26జిన్నింగ్‌, రెండు పప్పు మిల్లులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఏటా సుమారు రూ.2.50 కోట్ల ఆదాయం అధికారికంగా వస్తోంది. ఇక ఫీజు చెల్లించకుండా కొనుగోలు చేసిన ఉత్పత్తులను సరిహద్దులు దాటిస్తున్న క్రమంలో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న 25 మార్కెటింగ్‌ చెక్‌ పోస్టుల ద్వారా నిఘా వేసి ఫీజు వసూలు చేసి మరో రూ.2.50 కోట్ల ఆదాయాన్ని పొందుతాయి. ఈ నిధులే ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు, ఇతర నిర్వహణకు  కేంద్ర ప్రభుత్వం వీటికి గండికొడుతూ వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడ కొనుగోలు చేసినా ఫీజు వసూలు చేయొద్దని ఆర్డినెన్స్‌ జారీ చేసి పిడుగు లాంటి వార్త వినిపించింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మార్కెట్లకు మళ్లీ కళ

కేంద్రం ఆర్డినెన్స్‌తో మార్కెటింగ్‌ శాఖ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారగా ఉద్యోగులు సతమతమవుతున్నారు.  ఉన్న 25 వ్యవసాయ మార్కెట్లకు సంబంధించిన చెక్‌పోస్టులు సైతం మూతపడ్డాయి. ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న నిధులతో మరో ఐదు నెలలు మాత్రమే జీతాలు ఇవ్వగలమని, ఆ తర్వాత ఇవ్వలేమని ఆ శాఖ యంత్రాంగం తేల్చి చెప్పింది. ఈ  తాజాగా రాష్ట్ర సర్కారు నిర్ణయంతో మార్కెట్లకు మళ్లీ నూతన కళ వచ్చింది. ఈ వానకాలం సీజన్‌ నుంచే జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల లాగానే ధాన్యంతోపాటు, కందులు, పెసర ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసి సివిల్‌ సైప్లె యంత్రాంగానికి సైతం ఆ జీఓ కాపీని పంపింది.


logo