మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 19, 2020 , 03:30:36

సీజన్‌ సమరం..

సీజన్‌ సమరం..

వానకాలం.. వ్యాధుల కాలం. ఇప్పటికే వరుస వర్షాలు, ముసురు కారణంగా చిత్తడిగా మారిన పరిసరాలు.. ఓ వైపు దోమల విజృంభణ, మరో వైపు వైరల్‌ జ్వరాలు పొంచి ఉన్న తరుణమిది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన పారిశుధ్య చర్యలు చేపడుతోంది. పంచాయతీరాజ్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖలతో పాటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ పనులు పర్యవేక్షిస్తున్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించడం, వీధుల్లో బ్లీచింగ్‌ చల్లించడం, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించడం, డ్రైనేజీల్లో పూడిక తీయించి దోమల నివారణకు ఫాగింగ్‌ చేపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పనులన్నీ చకచకా సాగుతున్నాయి.

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖలతోపాటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ మంచినీటి ట్యాంకులను క్లీనింగ్‌ చేయించడం... వీధుల్లో బ్లీచింగ్‌ చల్లడం... లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించడం... మురికి కాలువలు పరిశుభ్రం చేయడం... దోమల నివారణకు ఫాగింగ్‌ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటువ్యాధులు ప్రబలితే అధికారులపై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరికలు జారీ చేయడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు చకచకా జరుగుతున్నాయి.

ఒకపక్క కరోనా మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్న నేపథ్యంలో వరుసగా ఆరురోజుల పాటు వర్షాలు పడడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. గతంలో చిన్న జల్లులకే గ్రామాలు బురదమయంగా మారి వీధుల్లో అడుగుతీసి అడుగు పెట్టలేనంత గందరగోళంగా ఉండేది. దోమలు, ఈగలు ముసిరి అంటువ్యాధులు ప్రబలి గ్రామాలు, తండాల్లో ఇంటింటికీ మంచంపై చికిత్సలు పొందేవారు. అలాంటిది గత ఆరేళ్లలో వందల కోట్లు వెచ్చించి గ్రామగ్రామాన దాదాపు ప్రతి వీధిలో సీసీ రోడ్లు, సైడ్‌ డ్రెయిన్లు నిర్మించడంతో చాలావరకు బురద బెడద తప్పింది. అలాగే అంటువ్యాధులు కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. దీంతో శానిటేషన్‌ చేయాలని కలెక్టర్‌ ముందస్తుగానే ఆదేశాలు జారీచేశారు.

పల్లెల్లో చకచకా పారిశుధ్య పనులు

జిల్లాలో గత బుధవారం నుంచి కాగా సోమవారం ఉదయం వరకు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. దీంతో వ్యాధులు ప్రబలకుండా మున్సిపాలిటీలు, పల్లెల్లో పారిశుధ్య పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రతిచోట లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని అవసరమైతే జేసీబీల సాయంతో కూడా తొలగించి మొరం పోయిస్తున్నారు. అలాగే గ్రామాల్లో సామూహిక తాగునీటి ట్యాంకులను శుభ్రం చేస్తూనే ఇళ్లల్లో ఉండే వాటిని కూడా శుభ్రం చేయిస్తున్నారు. మురికికాలువల్లో పేరుకుపోయిన చెత్తను ఎత్తివేస్తూ వీధుల్లో పేరుకుపోయిన చెత్తను ఎత్తివేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ ఇవ్వడంతో వాటి వినియోగం ఎంతో ఉపయుక్తంగా మారింది. మొత్తం మీద ముసురుతో పట్టణాలు, పల్లెలు చిత్తడిగా మారినప్పటికీ ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుండడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం..

గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ప్రతి పంచాయతీలో డీఎల్‌పీఓలు, పంచాయతీ కార్యదర్శిలతోపాటు వైద్య ఆరోగ్య సిబ్బంది, గ్రామ పారిశుధ్య కార్మికులు పర్యటిస్తున్నారు. నీటి నిలువలు గుర్తిస్తూ మొరం పోయడంతోపాటు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. ఎవరైనా జ్వరంతో బాధపడితే వైద్య ఆరోగ్యశాఖ వారు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

- యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి


logo