మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 17, 2020 , 03:14:36

7 గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల

7 గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. దీంతో ఆదివారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కాగా ఈఈ భద్రునాయక్‌ ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆగస్టులోనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం ఇదే ప్రథమం. ప్రాజెక్టుకు ప్రస్తుతం 9 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  వచ్చి చేరుతుండగా నీటిమట్టం 643 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులు పెరిగితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుంది. దీంతో అధికారులు ఆదివారం మధ్యా హ్నం ప్రాజెక్టు 2, 3, 4, 7, 8, 9, 11 క్రస్టు గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 22 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు కుడి, ఎడమ కాల్వల ద్వారా 100 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తిన విషయం తెలుసుకున్న సూర్యాపేట, నల్లగొండ జిల్లాల ప్రజలు అధిక సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీటి అందాలను వీక్షిస్తూ.. సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు.

ఆగస్టులో ఇదే ప్రథమం

మూసీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఆగస్టులో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం ఇదే ప్రథమం. ఉమ్మడి రాష్ట్రంలో క్రస్టుగేట్లు సరిగా లేక పోవడంతో లీకేజీ ద్వారా నీరు వృథాగా దిగువకు వెళ్లేది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం గగనంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి మూసీ ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో ప్రాజెక్టుకు నూతన గేట్లు, బీటీ రోడ్డు నిర్మించారు. లీకేజీ ఆగిపోవడంతో ప్రాజెక్టు ప్రతిసంవత్సరం పూర్తిస్థాయిలో నిండుతోంది. గత వానకాలం ప్రాజెక్టు గేటు ప్రమాదవశాత్తు ఊడిపోగా మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో గత నెలలో రూ. 2కోట్లతో శాశ్వత గేటును ఏర్పాటు చేశారు.  ఆగస్టులోనే ప్రాజెక్టు నిండగా రెండు పంటలకూ సాగునీరు అందనున్నాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అప్రమత్తంగా ఉండాలి

మూసీకి వరద ఉధృతి పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేసినందున పరిసరాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఈఈ భద్రునాయక్‌ విజ్ఞప్తి చేసారు. ఆదివారం నీటిని విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. గొర్రెలు, పశువుల కాపరులు, వ్యవసాయ మోటర్లు ఉన్న వారు ఏటిలోకి వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట డీఈఈలు నవికాంత్‌, రమేశ్‌, ఏఈఈ శ్రీకాంత్‌, తదితరులున్నారు.logo