మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 16, 2020 , 02:14:41

చెరువులకు జలకళ

చెరువులకు జలకళ

 చిలుకూరు : శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షానికి మండలంలోని పలు గ్రామాల చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. లోతట్టు ప్రాంతాల్లోని పొలాలు నీటమునిగాయి. ఎడతెరిపిలేని వర్షం కారణంగా ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. రైతులు సాగు పనుల్లో, యువకులు చెరువు అలుగుల వద్ద గాలాలతో చేపలు పడుతూ కనిపించారు.  

ఆత్మకూర్‌.ఎస్‌ : ఎడతెరిపిలేని వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. శనివారం కురిసిన వర్షానికి మండలంలోని నెమ్మికల్‌తో పాటు పలు గ్రామాల చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తున్నాయి. దీంతో చెరువుల కింద ఉన్న పంటపొలాలు నీటమునిగాయి. 

చెరువుల్లో చేరుతున్న నీరు

చిట్యాల : జోరు వర్షం కారణంగా మండలంలోని పలు గ్రామాల చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. కుంటలు, చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో జలకళను సంతరించుకుంటున్నాయి. శనివారం కూడా మండలంలో ముసురు వాన కొనసాగగా జనజీవనం స్తంభించింది. ప్రజలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. 


పారుతున్న పెద్దవాగు 

మునుగోడు : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షానికి మునుగోడు పెద్ద వాగులో వరద ప్రవహిస్తోంది. సాధారణంగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తేనే వాగులోకి నీళ్లు వస్తాయి. కానీ ఎడతెరిపి లేని వర్షంతో వాగులోకి నీరు చేరింది. దీంతో పలు గ్రామాల్లోని బోర్లు, బావుల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అలుగు పోస్తున్న రేగట్టె వాగు కత్వ

కనగల్‌ : నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురుతో చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. కనగల్‌ కత్వ, రేగట్టె వాగుపై నిర్మించిన కత్వ వర్షపు నీటితో నిండి అలుగు పోస్తున్నాయి.  

రుద్రమ్మ ఉధృతికి రాకపోకలు బంద్‌ 

తుంగతుర్తి : ఎస్సారెస్పీ కాల్వ ద్వారా వస్తున్న గోదావరి జలాలతో ఇప్పటికే చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి  మండలంలోని వెలుగుపల్లి వద్ద రుద్రమ్మచెరువు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో సూర్యాపేట - తుంగతుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. logo