ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 14, 2020 , 03:45:08

టీవీనే కంప్యూటర్‌గా..

టీవీనే కంప్యూటర్‌గా..

  • l ఆరిజినేట్‌ పరికరంతో వాడుకునే ఏర్పాటు
  • l తయారు చేసిన బీటెక్‌ విద్యార్థి మౌనిక

బొడ్రాయిబజార్‌ : బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ చేసి గేట్‌ క్వాలిఫైడ్‌ అయిన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పాండ్యానాయక్‌ తండాకు చెందిన ధరావత్‌ మౌనిక టీవీనీ కంప్యూటర్‌గా వాడుకునేలా ఆరిజినేట్‌ అనే పరికరాన్ని రూపొందించింది. దీనితో కంప్యూటర్‌ను టీవీగా పూర్తిస్థాయిలో వాడుకోవచ్చని తెలిపింది. దానికి సంబంధించిన వివరాలను గురువారం సూర్యాపేటలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపింది. ‘ఆరిజినేట్‌ అనే పరికరాన్ని ఉపయోగించి రిమోట్లో ఒక్క మీటతో మనకు కావాల్సినప్పుడు టీవీగా, కంప్యూటర్‌గా ఎప్పుడు ఎలా కావాలంటే మార్చుకోవచ్చు. ఈ పరికరాన్ని ఒక్క ఆన్‌లైన్‌ క్లాసుల కోసం మాత్రమే కాకుండా మన దైనందిన ఆఫీసు, కంప్యూటర్‌ ల్యాబ్‌, ఫొటోషాప్‌తోపాటు బిజినెస్‌ పనులకు కూడా మానిటర్‌ని, ప్రొజెక్టర్‌ని కనెక్ట్‌ చేసి వాడేలా లినిక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో రూపొందించాను. ఈ పరికరంలో క్వాడ్‌ కోర్‌ 64బిట్‌ 1.5గిగాహెర్డ్స్‌ స్పిడ్‌ ప్రాసెసర్‌, 4జీబీ డీడీ ఆర్‌ఎస్‌బీ ర్యామ్‌ ఇంటర్నల్‌ మెమరీ, ఎక్ట్సర్నల్‌గా హార్డ్‌డిస్క్‌ పెన్‌డ్రైవ్‌ ఎంతైనా కనెక్ట్‌ చేసుకోవచ్చు.

ప్రాసెసర్‌ వల్ల మదర్‌బోర్డు వేడిని అదుపు చేయడానికి ఒక ఫ్యాన్‌ని, యూఎస్బీ-2తోపాటు యూఎస్బీ -3, బ్లూటూత్‌ టీవీ, మానిటర్‌, ప్రొజెక్టర్‌ కనెక్ట్‌ చేయడం కోసం హెచ్‌డీఎంఐ ఇంకా ఇంటర్నల్‌ కోసం ఈథర్‌నెట్‌తోపాటు వైఫై సౌలభ్యం కూడా ఇచ్చాను. పవర్‌ అడాప్టర్‌, హెచ్‌డీఎంఐ కేబుల్‌, వైర్లెస్‌ కీ బోర్డు, మౌస్‌, కెమెరా, మైక్‌లతో కలిపి ఈ పరికరాన్ని రూపొందించడానికి అయిన ఖర్చు రూ. 7వేలు. దాతలు సహకరిస్తే పెద్ద ఎత్తున ఈ పరికరాలను తయారు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో కంప్యూటర్‌ నైపుణ్యాలకు సంబంధించిన అవగాహన, పట్టణ, నగర ప్రాంత విద్యార్థులకు సాటిగా పెంపొందించేందుకు కృషి చేస్తాను’ అని తెలిపింది. logo