శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 14, 2020 , 03:45:20

కొవిడ్‌ సంక్షోభంలోనూ రైతులకు బాసట

కొవిడ్‌ సంక్షోభంలోనూ రైతులకు బాసట

  • l  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి నిర్ణయం సాహసోపేతమైనదే.. 
  • l  గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు అందులో భాగమే.. 
  • l  ఉమ్మడి నల్లగొండలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి 
  • l  ఆరేళ్లలో ఫ్లోరోసిస్‌ నుంచి జిల్లాకు విముక్తి 
  • l  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 
  • l  తిరుమలగిరి, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం

కొవిడ్‌ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని, ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకుందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరి, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌ నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న ప్రతి నిర్ణయం సాహసోపేతమైనదని, నేడు కరోనా పరిస్థితుల్లోనూ రైతులకు అందుతున్న సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమన్నారు. కరువుతో అల్లాడిన తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండగా పచ్చని పంటలతో సస్యశ్యామలమయ్యాయని తెలిపారు. నాడు కక్షలు, కొట్లాటలతో అట్టుడికిన పల్లెల్లో పసిడి పంటలు పండుతున్నాయని, యాసంగి దిగుబడిలో రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ సింహభాగంలో ఉందని చెప్పారు. 

- తిరుమలగిరి/శాలిగౌరారం

తిరుమలగిరి : గతంలో ఎడారిగా మారిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నేడు రైతుబాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో పంటల దిగుబడిలో రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పు డు ఎటుచూసినా పచ్చని పంటలే దర్శనమిస్తున్నా యి. తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమైక్య పాలనలో గుక్కెడు తాగునీరు దొరక్క ఫ్లోరిన్‌ నీటితో అలమటించిన ప్రజలు నేడు స్వచ్ఛమైన నీరు తాగుతున్నారన్నారు. కరువు ప్రాంతమైన తుంగతుర్తి, సూర్యాపేటలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండడంతో రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దేశం మొత్తం కరోనాతో ఇబ్బంది పడుతూ అన్నిరంగాలు మూ తపడుతున్న క్రమంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పేర్కొన్నారు. కష్టకాలంలోనూ రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడమే కాకుండా ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందించి ఆదుకున్న రైతుబాంధవుడు కేసీఆర్‌ అని కొనియాడారు. ఈ భూమి మీద సంతోషంగా ఉన్నది కేవలం తెలంగాణ రైతాంగమే అని అన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశంలో నెంబర్‌ వన్‌గా నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో రైతులు పండించిన పంటలకు వారే ధర నిర్ణయించనున్నారన్నారు. అందుకు రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. 

రైతుల సంక్షేమం కోసం పని చేయాలి : ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ 

నూతన మార్కెట్‌ పాలక మండలి రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ సూచించారు. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేయడమే కాకుండా రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెట్లను ఏర్పాటు చేసిందన్నారు. తుంగతుర్తి పరిధిలో ఉన్న తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ను ప్రత్యేక మార్కెట్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాజిరెడ్డిగూడంలో సబ్‌మార్కెట్‌, తుంగతుర్తి, శాలిగౌరారం మండలాల్లో నూతన మార్కెట్లను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మార్కెట్‌ పాలక మండలి సభ్యులతో మార్కెట్‌ సెక్రటరీ శంషేర్‌ ప్రమాణ స్వీకారం చేయించగా వారికి మంత్రి, ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణులు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజిని, ఎంపీపీ స్నేహలత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, జిల్లా నాయకులు యుగంధర్‌రావు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 
logo