సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 11, 2020 , 02:36:13

ఇల్లే పాఠశాల

ఇల్లే పాఠశాల

  • కరోనా సెలవుల్లో తల్లిదండ్రులే గురువులు
  • చిన్నారుల నైపుణ్యాన్నిపెంచేలా కృషి చేయాలి
  • సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలి

చిన్నారుల మెదడు చురుకుగా పని చేస్తుంది. విషయాన్ని తొందరగా గ్రహించే శక్తి వారికి అధికంగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూతపడగా ప్రస్తుతం వారు ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులే గురువుల పాత్ర పోషించి తమ పిల్లలకు విద్యనందించాలి. చదువుతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా అందించేందుకు ఈ సెలవులను వినియోగించుకోవాలి.

- కోదాడటౌన్‌


భాషపై పట్టు కోసం

భాషపై పట్టు సాధించడం ద్వారా చదువులో ముందుకు సాగడం సులభ మవుతుంది. ఏ భాష అయినా బాగా నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి వెళ్లినా సంభాషించేందుకు వీలుగా ఉంటుంది. అయితే ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా చెల్లుబాటు అవుతుంది. భాష అనేది చదువులో ఒక భాగం మాత్రమే. ఈ సెలవుల్లో భాషపై పట్టు సాధించడంపై దృష్టి పెడితే అది మన పిల్లలను ఒక స్థాయిలో నిలబెడుతుంది.

ప్రతిభకు పదును  

గణితంలో మంచి మార్కులు సాధించేందుకు అబాకస్‌, వేదగణితం, గణితంలో మెళకువలు నేర్చుకోవడం అవసరం. ఈ సెలవుల్లో బాగా సాధన చేసి ప్రతిభకు పదును పెట్టుకోవచ్చు. ఇష్టంతో నేర్చుకోవడం ద్వారా విషయం త్వరగా అవగతమవుతుందనే విషయాన్ని విద్యార్థులకు తల్లిదండ్రులు చెప్పి..ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి.

చేతిరాత మెరుగు పర్చాలి

పరీక్షల్లో చేతి రాత చాలా ముఖ్యం. ఏ పరీక్ష అయినా విద్యార్థి రాసే సమాధానాలు అర్థం చేసుకోవడానికి మంచి దస్తూరి అవసరం. చేతిరాత ఎంత బాగుంటే ఆయా పరీక్షల్లో అంత మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చేతిరాతను మెరుగుపర్చుకునేందుకు ఈ సెలవులను వినియోగించుకుంటే మంచిది. 

 వ్యాయామం

కరోనా నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వ్యా యామం తోడ్పడుతుంది. యోగా ద్వారా భావోద్వేగాలు అదుపులో ఉంచడంతో పాటు, నూతనోత్తేజం కలుగుతుంది. రోజుకు గంట పాటు వ్యాయామం చేస్తే మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని పిల్లలకు తెలిపి.. ప్రతిరోజూ వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి.  

టెక్నాలజీపై అవగాహన కల్పించాలి

నేటీ పోటీ ప్రపంచంలో టెక్నాలజీ వినియోగం లేనిదే ఏ పని జరగడం లేదు. కంప్యూటర్‌ వినియోగం నేడు ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అవసరంగా మారింది. రానున్న రోజుల్లో ఉద్యోగ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. కాబట్టి ఇలాంటి టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించి వాటి వినియోగంపై తగిన శిక్షణ ఇవ్వాలి.logo