సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 11, 2020 , 02:16:27

ఉద్యాన సాగుకు ఊతం

ఉద్యాన సాగుకు ఊతం

  •  l ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వం 
  • l సన్న, చిన్నకారు  రైతులకు అవగాహన
  • l దరఖాస్తులను ఆహ్వా నిస్తున్న ఉద్యాన శాఖ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే ఉద్యాన పంటల సాగుకూ ప్రోత్సాహం కల్పిస్తోంది. ఇందుకోసం సన్న, చిన్నకారు రైతులకు రాయితీలు అందిస్తున్నది. జిల్లాలో అనువైన నేలలు, నీటి వనరుల ఆధారంగా రైతులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 40,844 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయగా మరో మూడు వేల ఎకరాల్లో సాగు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

- సూర్యాపేట అర్బన్‌ 


 తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే ఉద్యాన పంటలకు కూడా ప్రోత్సాహం కల్పిస్తోంది. ఉద్యాన సాగుకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి రైతులను అటువైపు మళ్లించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సూర్యాపేట జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నేలలు, నీటి వనరులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని.. ఉద్యాన పంటల సాగుకు అనువైన ప్రాంతాలు, అర్హులైన రైతులను ఎంపిక చేయనున్నారు. ఉపాధిహామీ కింద ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో 40,844 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అందులో మామిడి, జామ, బత్తాయి, సీతాఫలం, నారింజ, సపోటా వంటి పండ్ల సాగుతో కలిపి మొత్తం 21,883 ఎకరాలు, కూరగాయలు 5500 ఎకరాలు, పామాయిల్‌ 300 ఎకరాలు, ఆగ్రో ఫారెస్ట్‌ 1020 ఎకరాలు, మల్బరీ 400 ఎకరాలు, ఎండుమిర్చి 25,525 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఉద్యాన సాగును మరింత పెంచేందుకు అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.  

పంటల నమోదు తప్పని సరి 

నియంత్రిత సాగులో భాగంగా రైతులు సాగు చేస్తున్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని 40,844 ఎకరాలకు గానూ.. ఇప్పటివరకు 21,657 ఎకరాల ఉద్యాన పంటల వివరాలను( 53 శాతం) అధికారులు నమోదు చేసుకున్నారు. ఇంకా 19,187 ఎకరాలను నమోదు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతుల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడంతో పాటు.. ఆయా పంటలకు మాత్రమే బీమా సౌకర్యం, నష్ట పరిహారం చెల్లించనున్నారు.  

సన్న, చిన్నకారు రైతులకు అవకాశం 

ఉద్యాన పంటల సాగులో భాగంగా జిల్లాలో ఉన్న చిన్న, సన్నకారు రైతులకు అవకాశం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మండలాల వారీగా రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉద్యాన పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. తోటల సాగుకు రైతులు దరఖాస్తు చేసుకునే విధంగా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 

శ్రీ గంధం మొక్కల పెంపకం 

ఎకరంలో 650 మొక్కలు పెంచుతారు. దీని సాగులో కూలీలకు రూ.192,641, సాగుకు అవసరమైన సామగ్రి ఖర్చు రూ.41,084, మొత్తం ఖర్చు రూ.2,32,725 (నాలుగు సంవత్సరాల నిర్వహణ ఖర్చుతో కలిపి)

ఆయిల్‌ పాం పెంపకం : 

(తోట విస్తరణ, మూడేళ్ల వరకు ఎకరాకు నిర్వహణ) కూలీల ఖర్చు రూ.42464 , అవసరమైన సామగ్రికి రూ.17,900 మొత్తం రాయితీ రూ.1,15,700.

వెదురు మొక్కల పెంపకం 

ఎకరంలో 160 మొక్కలను సాగు చేయవచ్చు. ఎకరం వెదురు తోట సాగుకు రూ. 37,678 , సామగ్రి ఖర్చు రూ.50,149. మొత్తం రూ.87,827 .

ఉద్యాన పంటలు సాగు చేస్తున్న ప్రాంతాలు 

మామిడి, నిమ్మ  : కోదాడ, తుంగతుర్తి  

బత్తాయి, జామ  : కోదాడ, పెన్‌పహాడ్‌ మండలాలు

సపోటా          : తుంగతుర్తి, సూర్యాపేట

పామ్‌ ఆయిల్‌     : కోదాడ, హూజూర్‌నగర్‌

ఎండుమిర్చి       : హూజూర్‌నగర్‌, మోతె, నూతన్‌కల్‌, 

                        మద్దిరాల, తుంగతుర్తి మండలాలు

మల్బరీ సాగు     : ఆత్మకూరు(ఎస్‌)

కూరగాయలు     : చివ్వెంల, పెన్‌ పహడ్‌, తిరుమలగిరి

ఉద్యాన పంటలకు ప్రోత్సాహం


సన్న, చిన్నకారు రైతులు ఉద్యాన పంటల సాగు చేసేలా.. ప్రభుత్వం అనేక రాయితీలను అందిస్తోం ది. జిల్లాలో పంటల సాగు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు తాము సాగు చేసిన పంటలను కచ్చితంగా నమోదు చేసుకోవాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో మార్కెట్‌లో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 

-శ్రీధర్‌, ఉద్యానవన అధికారి, సూర్యాపేట
logo